Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరటికాయలు ఉన్నాయంటే దాంతో వేపుడు చేసుకోవడమో లేదా బజ్జీలు వేసుకోవడం మహా అయితే పులుసులో వేసుకోవడం తప్ప మరోరకంగా వండాలనే ఆలోచన పెద్దగా రాదు చాలా మందికి. కానీ వీటితోనూ రకరకాల కూరలు, స్నాక్స్ నోరూరించేలా తయారు చేసుకోవచ్చు. అవేంటో ఈరోజు తెలుసుకుందాం...
పిండి మిరియం
కావల్సిన పదార్థాలు: అరటికాయ - ఒకటి, కందిపప్పు - కప్పు, కారం - అర చెంచా, దనియాలు - చెంచా, సెనగపప్పు - చెంచా, బియ్యం - అరచెంచా, మిరియాలు - ముప్పావు చెంచా, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి - నాలుగు, ఆవాలు - అరచెంచా, కరివేపాకు రెబ్బలు - రెండు, ఇంగువ - చిటికెడు, నూనె - పావుకప్పు, చింతపండు - కొద్దిగా, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: కందిపప్పును కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించు కోవాలి. అరటి కాయను కడిగి చెక్కు తీసి ఉడికించు కుని పెట్టు కోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె పోసి దనియాలు, సెనగ పప్పు, బియ్యం, మిరియాలు, మూడు ఎండుమిర్చి, చింతపండు వేసి వేయించి చివరగా కొబ్బరి తురుము కూడా వేసి స్టౌని కట్టేయాలి. ఈ తాలింపు వేడి చల్లారాక మిక్సిలో తీసుకుని కొద్దిగ నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టౌమీద ఎండుమిర్చి వేయించి ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలకు, కందిపప్పు, పసుపు, ముందుగా చేసుకున్న మసాలా వేసి మరోసారి కలిపి దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి.
వడ
కావల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు - కప్పు, సెనగపప్పు - అరకప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, వెల్లుల్లిరెబ్బలు - రెండు, అల్లం తరుగు - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా, కొత్తిమీర తురుగు - రెండు టేబుల్‌స్పూన్లు.
తయారు చేసే విధానం: సెనగపప్పును నాలుగు గంటల ముందు నానబెట్టుకుని ఆ నీటిని వంపేసి మిక్సీలో వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న వడల్లా చేసుకుని వేడెక్కిన నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. అంతే వేడి వేడి అరటి వడలు రెడీ.
మసాలా వేపుడు
కావల్సిన పదార్థాలు: అరటికాయలు - రెండు, పసుపు - అరచెంచా, నూనె - పావుకప్పు, ఆవాలు - చెంచా, మినప్పప్పు - చెంచా, కరివేపాకు రెబ్బలు - రెండు, ఉప్పు - తగినంత, ఉల్లిగడ్డ - ఒకటి, కొబ్బరి తురుము - పావుకప్పు, దనియాలు - రెండు టేబుల్ స్పూన్లు, మిరియాలు - ఒకటిన్నర చెంచా, జీలకర్ర - చెంచా, ఎండుమిర్చి - నాలుగు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు.
తయారు చేసే విధానం: అరటికాయల చెక్కు తీసి ముక్కల్లా కోసి నీళ్లల్లో వేసుకోవాలి. మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సిలో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించి ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. అవి కూడా వేగాయనుకున్నాక అరటికాయ ముక్కల్ని వేసి బాగా కలిపి పావుకప్పు నీళ్లు, ముందుగా చేసుకున్న మసాలా, తగినంత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టాలి. అరటికాయముక్కలు ఉడికి నీళ్లన్నీ ఆవిరైపోయాక మిగిలిన నూనె వేసి బాగా వేయించుకుని తీసుకోవాలి.
కోఫ్తా కర్రీ
కావల్సిన పదార్థాలు: అరటికాయలు - రెండు, పనీర్ తురుము - అరకప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, సెనగపిండి - టేబుల్‌స్పూను, అల్లం, పచ్చిమిర్చి ముద్ద - చెంచా, దనియాల పొడి - అరచెంచా, కొత్తిమీర - కట్ట, నూనె - వేయించేందుకు సరిపడా, దాల్చిన చెక్క - పావుచెంచా, కారం - చెంచా, దనియాల పొడి - అరచెంచా, జీలకర్ర పొడి - చెంచా, గరంమసాలా - పావుచెంచా, జీడిపప్పు - పది (పావుగంటముందు నానబెట్టుకుని తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి), క్రీమ్ - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: అరటికాయలను ఉడికించుకుని చెక్కు తీసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ ముక్కలు, పనీర్ తురుము, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, దనియాలపొడి, కొత్తిమీర, సెనగపిండి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు బాణలిని మళ్లీ స్టౌమీద పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి దాల్చిన చెక్క, యాలకులు వేయించి ఉల్లిగడ్డ ముక్కలు వేయాలి. అవి వేగాక పసుపు, జీలకర్రపొడి, దనియాలపొడి, కారం, తగినంత ఉప్పు, టామాటో పేస్ట్ వేయాలి. అది కూడా ఉడికాక జీడిపప్పు ముద్ద వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి. అన్నీ ఉడికి దగ్గరకు అవుతున్నప్పుడు ముందుగా చేసుకున్న ఉండలు, క్రీమ్ వేసి బాగా కలిపి దింపేయాలి.