Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి అన్యాయం జరిగినా స్పందించేందుకు సిద్ధంగా ఉండు'' అంటాడు చేగువేరా. దీన్ని అక్షరాలా పాటిస్తూ కుటుంబం అందించిన అభ్యుదయ భావాలను దేశమంతా వెదజల్లేందుకు విద్యార్థి ఉద్యమంలోకి వచ్చింది దీప్సితా థర్. కండ్ల ముందే విద్యార్థి సంఘ నాయకులపై జరుగుతున్న దాడులను చూసి చలించిపోయింది. ఇప్పుడు కదా ఉద్యమానికి తోడుగా నిలవాల్సిన సమయం అంటూ ఎస్.ఎఫ్.ఐ జెండా చేతపట్టింది. ప్రస్తుతం ఎస్.ఎఫ్.ఐ ఆల్ ఇండియా గర్ల్స్ కన్వీనర్‌గా బాధ్యతలు చేస్తుంది. ఇటీవల ఆ సంఘ అఖిల భారత మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆమెతో మానవి సంభాషణ...
మీ కుటుంబం గురించి చెప్పండి?
మా తాతయ్య పద్మనిధీ థర్. 15 ఏండ్లు ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు బెంగాల్లో వామపక్ష పార్టీ అధికారంలో ఉండేది. తాతయ్య అప్పట్లో ఎడ్యుకేషన్ కమిటి చైర్మెన్‌గా కూడా ఉండేవారు. దాంతో మా పిల్లలు చదివితే ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి అనేవారు. ''మా పిల్లల్ని సర్కారు బడిలే చదివించకపోతే మా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగోలేదనే కదా అర్థం'' అనేవారు. అలా నేను డిగ్రీ వరకు బంగ్లా మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాను. ఇప్పటికీ నా కుటుంబం మొత్తం ప్రజా ఉద్యమాల్లోనే ఉన్నారు. మా అమ్మ దీపికా ఠాగూర్ చక్రవర్తి ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉంది. మా నాన్న ప్యూజ్ థర్ ట్రేడ్ యూనియన్‌లో ఉన్నారు. మా నాయనమ్మ కూడా పార్టీలోనే ఉన్నారు.
ఎస్.ఎఫ్.ఐలో ఎప్పటి నుండి పని చేస్తున్నారు?
చిన్నప్పటి నుండి ఉద్యమాలతో పరిచయం ఉంది. అయితే చిన్నప్పటి నుండి అమ్మా, నాన్న, తాతయ్య, నాయనమ్మ ఎప్పుడూ బిజీగా ఉండడం చూశాను. మాతో పెద్దగా గడిపేవారు కాదు. మాతో ఆడుకునేవారు కాదు. వాళ్ళ బిజీ జీవితాలు చూసి నేను ఇలా ఉండకూడదు అనుకునేదాన్ని. దీని వల్ల మన జీవితంలో సంతోషం ఉండదు అనేకునేదాన్ని. అలాంటి ఆలోచనలతోనే 2010లో కాలేజీకి వచ్చాను. 2011లో బెంగాల్లో లెఫ్ట్ గవర్నమెంట్ పడిపోయింది. అప్పుడు విపరీతమైన దాడులు జరిగేవి. ఎస్.ఎఫ్.ఐలో పని చేసే వాళ్ళను కొట్టేవాళ్ళు. కాలేజీలోకి రానిచ్చేవారు కాదు. అప్పుడు అనిపించింది ఇలాంటి కష్టకాలంలోనే నేనూ ఉద్యమంలో ఉండాలి. నా లాంటి వాళ్ళ అవసరం ఇప్పుడు ఉద్యమానికి అవసరం ఉంది. అంతకు ముందు నా అవసరం ఏమీ లేదు. ప్రభుత్వం అధికారంలో ఉంది. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు ఉద్యమం కష్ట కాలంలో ఉంది. ఇలాంటప్పుడు ఉద్యమాన్ని కాపాడుకోవాలి అనిపించింది. మా కాలేజీలో ఎస్.ఎఫ్.ఐ పై దాడులు జరిగేవి. అప్పుడు నేనూ ఉద్యమంలో పని చేయాలని గట్టిగా నిర్ణయించుకుని వచ్చాను. అప్పటి నుండి ఎస్.ఎస్.ఐలో పని చేస్తున్నాను. డిగ్రీ తర్వాత పీజీ కోసం 2015లో జేఎన్‌యూ వచ్చాను. నా సబ్జక్ట్ జాగ్రఫీ. ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నాను. కేరళలో గల్ఫ్ వలస కార్మికుల పరిస్థితి గురించి రీసెర్చ్ చేస్తున్నాను.
అమ్మాయిలపై రోజురోజుకు దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిపై ఎస్.ఎఫ్.ఐ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది?
ఏదో దాడి జరిగినపుడు పోరాటం చేసి ఆపడం కాదు. వీటిపై నిత్యం అవగాహన కల్పించాలి. అందుకే మేము ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు జరుపుతూనే ఉన్నాము. వీటికోసమే ప్రత్యేకంగా దేశ వ్యాప్తంగా విద్యార్థినుల సబ్ కమిటీలు ఏర్పాటు చేశాం. అనేక రాష్ట్రాల్లో అవి బలంగా పని చేస్తున్నాయి. అమ్మాయిలకు ప్రత్యేకంగా క్లాసులు పెడుతున్నాము. చాలా మంది పిల్లలకు అసలు వాళ్ళు లైంగిక దాడికి గురవుతున్నారని కూడా తెలియదు. అందుకే అసలు వేధింపులు అంటే ఏమిటో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.
ఈ దాడులపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది?
అసలు ప్రభుత్వానికి ఆడా, మగా సమానంగా ఉండడం నచ్చదు. ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి. ఆర్.ఎస్.ఎస్, హిందుత్వవాద భావాలు ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం మనల్ని పరిపాలిస్తుంది. వీళ్ళు పితృస్వామ్య భావాజాలాన్ని పెంచి పోషించేవారు. అమ్మాయిలు పుట్టింది మరొకరి కోసం, ఇంటికే పరిమితం కావాలి, పిల్లల్ని కని పెంచితే చాలు అంటారు. వీళ్ళ ప్రకారం అమ్మాయిలు బయటకు వచ్చి మనసుకు నచ్చిన బట్టలు వేసుకోకూడదు, మనసుకు నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకోకూడదు. బయటకు వచ్చినందుకే దాడులు జరుగుతున్నాయి, వేసుకున్న బట్టలే దీనికి కారణం అని ప్రచారం చేస్తున్నారు. మగవాళ్ళ ఆలోచనలు నియంత్రించడం చేతగాక అమ్మాయిలను నియంత్రిస్తున్నారు. ఆ బట్టలు వేసుకోవద్దు, బయటకు రావొద్దు అని అమ్మాయిలకు పరిమితులు విధిస్తున్నారు. మరి ఆరు నెలల పిల్లలపై కూడా దాడులు చేస్తున్నారు. వారేం బట్టలు వేసుకుంటున్నారు. కాబట్టి ఈ దాడులకు బట్టలు ఎప్పుడూ కారణం కాదు. వాళ్ళ ఆలోచనే కారణం. కాబట్టి ముందు మగవాళ్ళ ఆలోచనా విధానం మారాలి. ప్రభుత్వం ముందు ఆ ప్రయత్నం చేయాలి.
లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయాలనే సుప్రీం కోర్టు తీర్పు ఎక్కడా అమలవుతున్నట్టు కనిపించడం లేదు. దీనిపై ఎస్.ఎఫ్.ఐ చేస్తున్న కృషి ఏంటీ?
1996లో సుప్రీం కోర్టు దీనిపై తీర్పు ఇచ్చింది. మహిళలు చదువుకునే చోట, పని చేసేచోట ఈ లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెప్పింది. కానీ ఎక్కడా ఇది అమలు కావడం లేదు. మేమెక్కడైతా పోరాడుతున్నామో అక్కడ మాత్రం కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చోట కచ్చితంగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుండో పోరాడుతూనే ఉన్నాం.
మహిళల జీవితాల్లో ఎలాంటి మార్పు అవసరమంటారు?
మహిళల జీవితాల్లో మార్పు రాకుండా సమాజంలో మార్పు రాదు. మహిళలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదు. అమ్మాయి తల్లి అవుతుంది. తల్లి చదువుకుంటే కుటుంబం చదువుకున్నట్టే అంటూ ప్రచారం చేస్తారు కదా. మరి మహిళలు చదువుకోకుండా, అభివృద్ధి చెందకుండా సమాజం అభివృద్ధి ఎలా చెందుతుంది. అందుకే మా కమిటీల్లో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. అయితే ఇంకా మార్పు రావాల్సి వుంది. ప్రస్తుత ప్రభుత్వం అమ్మాయిల హాస్టళ్లను మూసివేస్తుంది. స్కాలర్షిప్లు తీసేస్తుంది. వీటి వల్ల అమ్మాయిలు చదువులకు దూరం అవుతున్నారు. సమాజంలో ఎలాంటి దాడులు జరిగినా ముందు అమ్మాయిలపైనే ప్రభావం చూపుతుంది. అయినా ఎన్నో నిర్భందాలను తట్టుకొని అమ్మాయిలు అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అమ్మాయిలు ధైర్యంగా బయటకు వస్తున్నారు.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలవుతుందనే నమ్మకం మీకు ఉందా?
ఈ ప్రభుత్వం ఉండగా అది జరగదు. కానీ పార్లమెంటులో మహిళల రిజర్వేషన్ చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళకు మహిళలు బయటకు రాకూడదు, వంటింటికే పరిమితం చేయాలనే ఆలోచన వుంది. ఆ భావజాలానే పెంచి పోషిస్తుంది. ఇలాంటి వాళ్ళు 33 శాతం రిజర్వేషన్ ఎలా తీసుకొస్తారు. మహిళలంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే తప్ప దాన్ని సాధించుకోలేము.
మీలో స్ఫూర్తి నింపిన నాయకులు?
ఇంట్లో మా తాతయ్య, అమ్మ నాకు స్ఫూర్తి. అయితే మా రాష్ట్రంలో ఒకప్పుడు ఇలా మిత్ర అనే ఉద్యమ కారిణి ఉన్నారు. ఆమె జీవితం నాకు చాలా స్ఫూర్తినిస్తుంది. నేను పని చేసే క్రమంలో ఎప్పుడైనా కష్టంగా అనిపించినపుడు ఇలా మిత్ర జీవితం చదువుతాను. ఆమెను అప్పట్లో అరెస్టు చేస్తారు, సమూహికంగా లైంగిక దాడి చేస్తారు, ఉద్యమ కారకుల జాడచెప్పమని అనేక రకాలుగా చిత్ర హింసలకు గురి చేస్తారు. కానీ అమె శత్రువుల వద్ద నోరు తెరవలేదు. ఆమె ధైర్యం, ఉద్యమం పట్ల ఆమెకున్న ప్రేమ నాకు బాగా నచ్చాయి. ఆమె పడ్డ కష్టం ముందు నా కష్టం ఎంత అని నాకు నేను చెప్పుకుంటా.
నేటి విద్యార్థినులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
అన్నింటికంటే ముందు మనపై మనం విశ్వాసం వుంచాలి. అబ్బాయిలకంటే మనమేం తక్కువ కాదు అనేది నమ్మాలి. ఎవరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు. తలెత్తి మనం నడవడం మొదలుపెడితే ఎవరూ మనల్ని భయపెట్టే ప్రయత్నం చేయాలి. ఎస్ఎఫ్.ఐ అలాంటి ధైర్యాన్ని అమ్మాయిలకు ఇస్తుంది. మన బలం మన ఐక్యత అనేది గుర్తు పెట్టుకోవాలి.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. అనేక సార్లు ట్రోలింగ్ కూడా జరిగినట్టుంది, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు?
అవును. అన్యాయాన్ని ప్రశ్నించడం ఎస్.ఎఫ్.ఐలో నేర్చుకున్నాను. కానీ ప్రశ్నించిన ప్రతి సారీ నా రంగు గురించి కామెంట్ చేస్తారు. ఇంత నల్లగా ఉన్నావు, ఇంత అగ్లీగా ఉన్నావు అంటూ కొంత మంది కావాలని కామెంట్ చేస్తుంటారు. కానీ నేనలాంటివి పట్టించుకోను. నేను వాళ్ళకు నచ్చకపోతే అది వాళ్ళ తప్పు. అది నా తప్పు కాదు. కాబట్టి నా పని నేను చేసుకుపోతాను. ఎవరో ఏదో అన్నారని ఏడుస్తూ కూర్చునే తత్వం నాది కాదు. ఎస్.ఎఫ్.ఐలో ఉండి ఎదిరించడం నేర్చుకున్నాను. నేను చేసేది కరెక్ట్ అయినపుడు ఎవరికీ నేను భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ప్రజల కోసం, విద్యార్థుల కోసం పని చేస్తున్నాను. ఆ తృప్తి నాకు వుంది.
ఇంటర్వ్యూ: సలీమ
ఫొటో: హరి