Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీషెల్స్ అంటే సముద్రపు గవ్వలతో ఎన్నో కళా ఖండాలు చూస్తుంటాము. సీషెల్స్ అంటే సముద్రంలో నివసించే జీవులన్నమాట. మొలస్కా కుటుంబానికి చెందిన చిన్న చిన్న సముద్ర జీవుల శరీరాలపై రక్షణ కోసం ఏర్పరచుకునే ఎండోస్కెలిటన్లు ఇవి. నత్తలు కూడా సర్పిలాకారంలో అమరి ఉండే గవ్వల లోపల ఉంటాయి. బిఎస్సీ చదువుకునేటపుడు గవ్వల్లోంచి నత్తల్ని జాగ్రత్తగా బయటకు తీసి డిసెక్షన్ చేసే వాళ్ళం. అప్పటి వరకూ గవ్వల్లో జీవులు, నత్తలు ఉంటాయని తెలీదు. ఇలాంటి కర్పరాల్లో ఉండే జీవులు చాలా మెత్తగా సున్నితంగా ఇలాంటి గట్టి నిర్మాణాలను తమ శరీరానికి రక్షణ కవచంగా ఏర్పాటు చేసుకుంటాయి. నేను నత్తకు పొడుపు కథను రాస్తూ ''ఒళ్ళేమో మెత్తని మాంసం ముద్ద, వేసుకుందేమో బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్, నెత్తినేమో రెండు కొమ్ములు' అని పెట్టాను. కాల్షియం కార్బోనేట్‌తో పొరను ఏర్పాటు చేసుకొని దాని శరీరానికి తగిన విధంగా ఆకృతుల్ని తయారు చేసుకుంటుంది. అందుకే సముద్రపు ఒడ్డున మనకు రకరకాల ఆకృతుల్లో సముద్ర గవ్వలు దొరుకుతాయి. వీటితో ఎన్నో అద్భుత కళాఖండాలను చేసి అమ్ముతుంటారు. మనమూ ప్రయత్నిద్దాం.
అందమైన అద్దం
చాలా చోట్ల ఎక్కువగా కనిపించే ఐటమ్ అద్దం. అద్దానికి సీషెల్స్ అతికించి అందంగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. సముద్ర తీర ప్రాంతాలలో మరీ ముఖ్యంగా అక్కడి పల్లె వాసులు ఎన్నో కళాఖండాలను తయారు చేస్తుంటారు. నేను మహాబలిపురం వెళ్ళినపుడు సీషెల్స్‌తో చేసిన పెద్ద షాండ్లియర్‌ను కొనుక్కున్నాను. దానిని ఫ్లైట్‌లో తేవడానికి చాలా అవస్థ పడ్డాను. దాదాపు నాలుగు అడుగుల షాండ్లియర్ అది. నేను కొని ఇరవై ఏళ్ళయింది. మధ్యలో పాడయితే కట్ చేసి తీసేసి రెండడుగుల షాండ్లియర్‌గా మార్చాను. అక్కడి హ్యాండీ క్రాప్ట్స్ దుకాణాలలో ఎన్నో రకాల వస్తువులు అమ్ముతుంటారు. కొన్నిటిని మనమనూ తయారు చేసుకోవచ్చు. బాగా గట్టిగా ఉన్న అట్టను తీసుకొని దానిని గుండ్రంగా కత్తిరించాలి. ఈ అట్ట మీద ఒక అద్దాన్ని అతికించాలి. అద్దం అతికించగా కొద్దిగా అట్ట మిగిలేలా చూసుకోవాలి. ఆ ఖాళీలో పురికొసను తీసుకొని గుండ్రంగా చుడుతూ అతికించుకోవాలి. ఎందుకంటే గవ్వలు అతికిస్తే ఊడిపోకుండా ఉండడానికి అవసరం. ఇప్పుడు వెడల్పుగా ఉండే గవ్వలను తీసుకొని ఒక్కొక్కటి పెడుతూ అతికించాలి. అద్దానికి, గవ్వలకు మధ్య ఖాళీని మూసేసేలా ముత్యాల చైనును అతికించాలి. ఇంకా మిగిలిన ఖాళీలో చిన్న చిన్న గవ్వల్ని అతికించాలి. రంగుల ముత్యాలు కూడా దొరుకుతాయి. అవసరాన్ని బట్టి అతికిస్తే అందంగా ఉంటుంది.
పూల కొమ్మలు, కుండీలు
చాలా సాధారణంగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. కానీ కొద్దిగా వెరైటీగా ప్రయత్నిద్దాం. వెడల్పుగా గీతలు గీతలుగా ఉండే గవ్వలతో పువ్వులు చేయవచ్చు. ఇష్టమైతే వీటికి రంగులు కూడా వేసుకోవచ్చు. దీనిని గ్లూగన్ సహాయంతో అతికించుకోవాలి. ఐదారు రెక్కలు ఉండేలా అతికించుకుని మధ్యలో రంగు పూసను అతికిస్తే పువ్వు అయిపోతుంది. ఈ పువ్వుకు కింది భాగాన ఒక ఇనుప తీగను అతికిస్తే ఫ్లవర్‌వేజ్‌లో పెట్టుకోవడానికి బాగుంటుంది. నేను ఐదారు పువ్వులు చేశాను. ఎక్కువ కావాలంటే అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు పూలకుండీని చేద్దాం. ఒక గాజు సీసాను తీసుకుని పూలకుండీగా మార్చాలి. గాజు సీసా మీద బోర్లాగా పడుకోబెట్టి గవ్వల్ని అతికించాలి. ఇవి కూడా వెడల్పాటి గవ్వలు పెట్టవచ్చు. లేదంటే సర్పిలా కారంలో ఉండే చిన్ని గవ్వల్ని అతికించుకోవచ్చు. నేను మొదటిసారిగా గవ్వల బొమ్మల్ని నాగార్జునసాగర్‌లో చూశాను. అక్కడ పిల్లి, కందేలు, పక్షులు, నెమలి, ఆకారాల్లో తయారు చేసి అమ్మేవారు. నా స్కూల్‌డేస్‌లో నాగార్జునసాగర్ ఎక్స్‌కర్షన్‌కు వెళ్ళినపుడు కొన్ని బొమ్మలు కొనుక్కున్నాను. వాటిని చూసి నేనూ తయారు చేయాలనుకుంటే గమ్‌కు అతుక్కోలేదు. అంత పెద్ద గవ్వలు కూడా దొరకలేదు. అందుకని మా ఊరి సముద్రంలో దొరికే చిన్ని చిన్ని గవ్వలతో సీనరీ తయారు చేశాను. లేత గోధుమరంగుతో చిన్ని చిన్ని గవ్వలు దొరుకుతాయి మా వాడరేవులో.
కాస్త కొత్తగా
రోటీన్‌గా షాప్ప్లో కనిపించే వస్తువులు కాకుండా కొద్దిగా వెరైటీగా ప్రయత్నిద్దాం. దీనిలో ఇంట్లోని వ్యర్థాలు కూడా ఉపయోగించవచ్చు. అంటే కొద్దిగా పగుళ్ళు వచ్చి వాడుకోవడానికి ఉపయోగపడని గాజు గ్లాసులను మనమీ బొమ్మలో వాడుకోవచ్చు. మూడు గ్లాసుల్ని తీసుకుని పక్కనుంచుకోవాలి. వీటిలో ఒకటి పొడవుగా, రెండు కొద్దిగా తక్కువ పొడవుగా ఉంటే బాగుంటుంది. ఈ గ్లాసుల్లో నీలి రంగు ఇసుకను పోసి, దానిపై మరల గులాబీ రంగు ఇసుకను పోసి, మరల ఆకుపచ్చ రంగు ఇసుకను వెయ్యాలి. రంగు రంగుల ఇసుక గ్లాసు బయట నుంచి కనిపిస్తూ కనువిందు చేస్తుంది. ఇప్పుడు రకరకాల ఆకారాల గవ్వలను తీసుకొని గ్లాసులోపలి గోడలకు అతికించాలి. తెల్లని శంఖం లాంటి చిన్ని చిన్ని గవ్వలు మామూలు తీర ప్రాంతరాలలో దొరుకుతాయి. వాటిని కూడా అతికించుకోవచ్చు. నేను గోవా సముద్రం నుంచి కొంత వెరైటీ గవ్వల్ని తీసుకువచ్చి వాటిపై పెయింటింగులు చేశాను. చాలా అద్భుతంగా వచ్చాయి. గోవా నుంచి తెచ్చిన గవ్వల ఉపరితలాలు నున్నగా పెయింట్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయి. నా దగ్గర ఉన్న గవ్వల బొమ్మల్ని నాకున్న హస్తకళల అభిరుచినీ గమనించిన మా తోటి డాక్టర్లు కన్యాకుమారి నుంచి కొన్ని అందమైన గవ్వల సెట్టింగులు తెచ్చిచ్చారు.
నైట్ ల్యాంప్
దీనికి గాను ఒక గాజు సీసా తీసుకోవాలి. ఈ సీసాను చుడుతూ ఉట్టిలా అల్లడానికి పురికొస కానీ, నులకవైరు గానీ తీసుకోవాలి. పురికొసతో సీసా చుట్టూతా అల్లకం అల్లాలి. చివరి కొచ్చే సరికి తాళ్ళను కత్తిరించి సీసాను అతికించేయాలి. ఈ తాళ్ళ మీదుగా గవ్వల్ని అతికించాలి. కొన్ని సన్నగా ఉండి పచ్చీసు ఆటలో ఆడుకునే తెల్లటి గవ్వల్ని కూడా అక్కడక్కడా అతికిస్తే బాగుంటుంది. దీని లోపల రంగుల ఇసుకను పోసి లైట్లు అమర్చుకుంటే నైట్ ల్యాంప్ వలె ఉపయోగపడుతుంది. నేను అండమాన్ దీవులకు వెళ్ళినపుడు అక్కడి క్రాఫ్ట్స్ షాపులలో ఎన్నో రకాల గవ్వల బొమ్మలు కనిపించాయి. 'సాగరిక' అనే గవర్నమెంట్ హ్యాండీ క్రాఫ్ట్స్‌లో గవ్వల కర్టెన్ను కొనుక్కున్నాను. అక్కడి తీర ప్రాంతంలో అండమాన్ సముద్రంలో దొరికే కొత్త రకపు గవ్వలున్నాయని కొన్నాను. ఒకవైపు బంగాళాఖాతం, ఒకవైపు అండమాన్ సముద్రం ఉంటాయి.
ఫౌంటెన్ చేద్దాం
కొమ్ము చెంబుకు రంగులు వేసుకుని దాన్లోంచి నీళ్ళు కారుతున్నట్టుగా వంచి పెట్టాలి. ఒక ప్లేట్ మీద తీగలు పెట్టి దాని మీద చెంబును పక్కకు పెట్టి అతికించాలి. ఈ తీగలు కన్పించకుండా ఆల్చిప్పలను అతికించాలి. నీళ్ళు పడుతున్నట్టుగా కన్పించడానికి గ్లూగన్తో గమ్‌ను పెట్టాలి. నేను దక్షిణాఫ్రికా టూరుకు వెళ్ళినపుడు అక్కడి అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రాలలో దొరికే గవ్వల్ని తెచ్చుకున్నాను. చాలా అరుదైన గవ్వలు దొరికాయి. ఆ గవ్వల్ని ఈ బొమ్మలో ఉపయోగించాను. ప్లేట్ కనిపించకుండా గవ్వల్ని అతికేసి మధ్య మధ్యలో ముత్యపు చైన్లను వేలాడదీయాలి. ముత్యాలు కూడా సముద్ర జీవుల్నించి లభించేవే కదా! ఫౌంటేన్ బాగుందా!
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్