Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతమంది చిన్నారుల్లో చర్మమంతా లేదంటే అక్కడక్కడా పొడిగా, ఎర్రగా మారడం.. దురదతో వారు అసౌకర్యంగా ఫీలవడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి చర్మ సమస్యను 'ఎగ్జిమా'గా పిలుస్తారు. పదిమంది పిల్లల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే చర్మం పైపొరల్లో ఫిలాగ్రిన్ అనే ప్రత్యేకమైన ప్రొటీన్ లోపించడమే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్కు ప్రధాన కారణం. ఫలితంగా చర్మం త్వరగా తేమను కోల్పోవడం.. వేడి, చలి వంటి వాతావరణ మార్పులతో పాటు బ్యాక్టీరియా నుంచి చర్మాన్ని రక్షించే సామర్థ్యం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. పసి పిల్లల్లో అయితే భుజాలు, ముఖం, కుదుళ్లు, కాళ్లు.. తదితర భాగాల్లో ఈ సమస్య వస్తుంటుంది. ఇక ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలన్నా, ఇది రాకుండా జాగ్రత్తపడాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
పిల్ల్లల చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజింగ్ సబ్బును వాడాల్సి ఉంటుంది.
చర్మానికి అసౌకర్యంగా ఉండే దుస్తుల్ని పిల్లలకు వేయకూడదు.
దురద పెట్టి గోకినప్పుడు చిన్నారుల గోళ్లలో ఉండే మురికి సైతం చర్మంలోకి చేరే ప్రమాదం ఉంది. కాబట్టి వారి గోళ్లను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తుండాలి.
పిల్లల చర్మానికి అలర్జీ కలిగించే ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
చిన్నారుల చర్మం తేమగా ఉండడం కోసం వారితో తగినన్ని నీళ్లు తాగించాలి. ఒకవేళ మరీ పసి పిల్లలైతే డాక్టర్ సలహా మేరకు నీళ్లు తాగించడం మంచిది.
ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు మీ చిన్నారిని రెగ్యులర్ చెకప్స్కి తీసుకెళ్లడం.. నిపుణులు సూచించిన మందులు, క్రీమ్స్, లోషన్స్.. వంటివి వాడడం తప్పనిసరి.