Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగునాట స్వాతంత్య్ర, కమ్యూనిస్టు ఉద్యమాలు మట్టిలో మాణిక్యాల వంటి ఎందరినో వెలుగులోకి తెచ్చాయి. ఇలాంటి వారు మన చుట్టూ ఉన్నారా అని నేటి తరాలు ముక్కున వేలేసుకొనే విధంగా వారి జీవితాలున్నాయి. అసమాన త్యాగాలకు వారు వెనుకా ముందూ ఆలోచించలేదు. ఎందరో మహిళలు సాంప్రదాయ బంధనాలను పక్కకు నెట్టి మేము సైతం తక్కువేమీ కాదు అన్నట్టుగా తమవంతు పాత్రలను పోషించారు. అలాంటి మణిపూసలలో ఒకరు ఉద్దరాజు మాణిక్యాంబ. కాంగ్రెస్, కమ్యూనిస్టు ఉద్యమాలు రెండింటిలోనూ పాల్గొన్న కొద్ది మందిలో ఆమె ఒకరు. ఈరోజు ఆమె వర్థంతి సందర్భంగా ఆ స్ఫూర్తి ప్రధాత పరిచయం మానవి పాఠకులకు ప్రత్యేకం...
పల్లెటూర్లలో పుట్టి వీధి మొహం ఎరగకుండా పరదా చాటున ఉన్న క్షత్రియ సామాజిక తరగతిలో జన్మించారు మాణిక్యాంబ. అలాంటి కుటుంబంలో పుట్టిన ఓ సాధారణ అమ్మాయి పోలీసుల కన్నుగప్పి భీమవరం తాలుకా ఆఫీసుపై జాతీయ జెండాను ఎగురవేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. దానికిగాను ఆమె రెండు సంవత్సరాలపాటు జైలు జీవితం అనుభవించారు. ఆ జిల్లాలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా, శాసనోల్లంఘన, విదేశీ వస్త్ర బహిష్కరణ, కాళీపట్నం భూ పోరాట ఉద్యమాల్లో పాల్గొని మరోసారి జైలు జీవితం గడిపారు. జైలులో పురుషుల బ్లాకులో ఉన్న స్వాతంత్య్ర ఉద్యమనేతలకు వెలుపలి నుంచి వచ్చిన రహస్య సమాచారాన్ని తమ బ్లాకులో ఉన్న చెట్లు ఎక్కి కాగితాలను అవతలివైపుకు వెళ్లేట్టు చేసిన సాహసి ఆమె. ఇలాంటివన్నీ ఇప్పుడు సినిమాల్లో చిత్రీకరిస్తే చూసే వారికి ఉత్సాహాన్ని ఇవ్వవచ్చుగానీ ఆరోజు అలాంటి పనులకు పాల్పడిన వారు ప్రాణాలకు తెగించారని ఈ తరం వారు అర్ధం చేసుకోవాలి.
పెద్ద సంచలనం
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని వన్నెచింతల పూడి గ్రామంలో నడింపల్లి బాపిరాజు, వెంకమ్మల చిన్న బిడ్డ మాణిక్యాంబ. సహజంగానే ఇంట్లో చిన్నవారిని గారాబంగా పెంచుతారు. ఆమెకు పదహారవ ఏట, పద్దెనిమిదేండ్ల ఉద్దరాజు రామం(తర్వాత రాష్ట్ర కమ్యూనిస్టునేతలలో ఒకరుగా మారారు. ఎంపీగా, ఆలిండియా కిసాన్ సభ అధ్యక్షుడిగా పనిచేశారు)తో వివాహం జరిగింది. పాలకొల్లు సమీపంలోని వాలమర్రులో అత్తారింటికి వచ్చిన వెంటనే భర్త రామం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటూ తనతో పాటు ఆమెను కూడా తీసుకువెళ్లారు. ఆ ఉదంతం ఆగ్రామంతో పాటు చుట్టుపక్కల ఒక పెద్ద సంచలనం. ఎవరేమనుకున్నప్పటికీ ఎత్తిన జండా దించమోయి అన్నట్టుగా ఆ దంపతులు వెనుదిరగలేదు.
జంకని ధైర్యవంతురాలు
మహాత్మాగాంధీ పశ్చిమ గోదావరి జిల్లాలో సత్యాగ్రహ శిబిరాలను సందర్శించినపుడు ఆమె తన వంటి మీద ఉన్న 70కాసుల బంగారు నగలను విరాళంగా ఇచ్చారు. మరోసారి పసిడిని ధరించను అని వాగ్దానం చేస్తేనే వాటిని స్వీకరిస్తానని గాంధీ అనటంతో ఆమేరకు ప్రతిన బూనిన ఆమె జీవితాంతం వరకు దానికి కట్టుబడి ఉన్నారు. తర్వాత తల్లి ఇచ్చిన మరో 70కాసుల బంగారు నగలను కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చివేశారు. అలాంటి ధనిక కుటుంబం నేపధ్యం ఉన్న ఆమె రామంగారితో కలసి విజయవాడలో ఒక చిన్న పూరింటిలో, వేరే చోట్ల అనామకంగా పిల్లలతో ఒంటరిగా ఉన్నారంటే చాలా మంది నమ్మకపోవచ్చు, కానీ అది నిజం. అంతేనా.. కమ్యూనిస్టులపై నిర్భంధకాండకు ప్రభుత్వం పూనుకోవటంతో రామం అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. అప్పుడు పిల్లలతో కుటుంబపోషణకు ఆమె కూడా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. పిల్లి సంసారం అంటూ కొందరు ఎద్దేవ చేసినా కూడా వాటినామె పట్టించుకోలేదు. జైలులో డాక్టర్ అచ్చమాంబ వద్ద నేర్చుకున్న ప్రసూతి, శిశుపోషణ ఆధారంగా పురుళ్లు పోశారు. తర్వాత నేర్చుకున్న హౌమియో వైద్యం వంటి వాటితో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. పోలీసులు ఆమె ఎక్కడ ఉన్నదీ తెలుసుకొని రామం జాడచెప్పాలని వేధించినా, మీ భర్తను కాల్చివేశామని చెప్పి భయపెట్టేందుకు చూసినా జంకని ధైర్యవంతురాలు.
భర్తకు అండగా...
మనలాంటి వెనుక బడిన సమాజాలలో స్త్రీలను ఉద్యమాల్లోకి రప్పించేందుకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అవసరం. అలాంటి ఆసరా మాణిక్యాంబకు భర్త నుంచి లభించింది. తర్వాత అటు పుట్టింటి వారు, ఇటు మెట్టినింటి వారు కూడా ప్రోత్సహించారు. పోలీసుల వేధింపులు, వత్తిళ్లను తట్టుకొని ధనిక బంధువుల వైపు చూడకుండా పేదరికంతో జీవనం గడపటం ఆమె ప్రత్యేకం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెబుతారు. విజయం సంగతి పక్కన పెడితే రామం దంపతులు స్వాతంత్య్ర ఉద్యమంలోకి దూకినపుడు లాఠీ దెబ్బలు, నిర్బంధాలు, జైళ్లు తప్ప కనుచూపు మేరలో స్వతంత్ర భారతం వారికి కనిపించలేదు. తర్వాత తెలంగాణాలో రైతాంగ సాయుధ పోరాటానికి మద్దతు ఇచ్చిన ఆంధ్ర ప్రాంత జిల్లాల్లో కమ్యూనిస్టులను వేధించారు, నిర్బంధ శిబిరాల్లోకి నెట్టారు, స్రీ పురుషులను బట్టలిప్పించి గాంధీ విగ్రహాల ముందు నిలబెట్టిన దుర్మార్గాలు ఒకవైపు. అజ్ఞాతవాసంలో ఉన్న వందలాది మందిని కాల్చిచంపిన స్థితి మరోవైపు. మాణిక్యాంబ వంటి వారు ఎందరో అలాంటి స్థితిలో భర్తలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఫలితాల గురించి పట్టించుకోలేదు. తమ కర్తవ్యంగా భావించారు.
చైతన్యవంతురాలు...
ప్రతి వంటగత్తె విప్లవకారిణి కావాలని ప్రముఖ కమ్యూనిస్టు నేత లెనిన్ చెప్పారు. లెనిన్ రచనలను లేదా మహత్తర త్యాగాల గురించి చదవకుండానే వంటింటికి పరిమితమైన ఎందరో ఉద్యమాల స్ఫూర్తితో కదనరంగంలోకి దుమికారు. అవసరమైనపుడు తుపాకి పట్టిన వారే విప్లవకారులు కాదు. విప్లవాత్మక మార్పులను కోరుకొని అలాంటి పరిస్థితులకు దోహదం చేసేందుకు ఉద్యమించిన వారు కూడా వారితో సమానులే. వారికి వెన్నుదన్నుగా నిలిచి వెనక్కు లాగకుండా చూసిన ప్రతిఒక్కరూ ఆదర్శనీయులే. ఉన్నంతలోనే కమ్యూనిస్టు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినైనా ఒకే విధంగా చూసిన చైతన్యవంతురాలు. చిన్న తనంలో నోములు, పూజలు, పునస్కారాలు, మంగళహారతుల గతం ఉన్న మాణిక్యాంబ వివాహానంతరం మరణించే వరకు వాటి ఊసే లేకుండా గడిపారు. మారిన ఆమె జీవితంలో ఎదురైన వాటిని తవ్వితే ఆమె జీవిత గని నుంచి ఎన్నో ఉద్యమ అనుభవాలు, మెదిలిస్తే ఆగని స్వాతంత్య్ర గీతాలు ఎన్నో ఆమె నోటి వెంట జాలువారేవి. వయసులో ఉన్నపుడు పట్టుకున్న కాన్సర్ భూతాన్ని ఆమె ధైర్యంగా తరిమివేశారు. 2008 డిసెంబరు 24న 94వ ఏట మరణించారు. వజ్రాలు, మాణిక్యాలకు మరణం ఉండదు. మాణిక్యాంబ జీవితమూ అంతే.
- గాదిరాజు శారద