Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అర చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అనేదానికి ఆమె ఓ నిలువెత్తు నిదర్శనం. విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుంది. భరించలేని మతోన్మాద గుండాలు ఆమె రక్తాన్ని కండ్ల చూశారు. భయపడి పారిపోతుందని భ్రమించారు. అధ్యయనం - పోరాటం నినాదంతో 40 లక్షల మంది విద్యార్థుల అండ ఆమెకు దొరికింది. అంతే సముద్రపు కెరటమై ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉన్మాదులపై తారజువ్వై దూసుకెళ్ళింది. ఆమే జేఎన్‌యూ విద్యార్థి సంఘ అధ్యక్షురాలు ఆయీషా ఘోష్. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఎస్.ఎఫ్.ఐ అఖిల భారత మహాసభలకు ప్రతినిధిగా హాజరైన ఆమెతో మానవి సంభాషణ...
మీ బాల్యం గురించి చెప్పండి?
నేను పుట్టింది, పెరిగింది మొత్తం పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్ అనే చిన్నపట్టణంలో జరిగింది. ఇంటర్ వరకు అక్కడే చదువుకున్నాను. డిగ్రీ కోసం ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చాను. తర్వాత పీజీ జేఎన్‌యూలో చేశాను. ప్రస్తుతం పీహెచ్డీ కూడా అక్కడే చేస్తున్నాను. పశ్చిమబెంగాల్లో లెఫ్ట్ పార్టీలు చాలా బలంగా ఉంటాయి. ప్రస్తుతం అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయడంలో మాత్రం ముందు భాగంలో ఉంటారు. మా నాన్న కూడా సీఐటీయూలో పని చేస్తారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా మనం పార్టీతోనే ఉండాలి అనేది మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు.
ఎస్.ఎఫ్.ఐలో ఎప్పటి నుండి పని చేస్తున్నారు?
చిన్నప్పటి నుండి ఎస్.ఎఫ్.ఐ గురించి తెలిసినా ఉద్యమాల్లో పెద్దగా పాల్గొనలేదు. ఢిల్లీ వచ్చిన తర్వాతనే యాక్టివ్‌గా పని చేయడం మొదలుపెట్టాను. నాకు ఒక చెల్లి ఉంది. చిన్ననప్పటి నుండి మా ఇంట్లో లింగ వివక్ష ఉండేది కాదు. కానీ మా చుట్టూ ఉన్న సమాజంలో మాత్రం ఉంది. బెంగాల్లో చాలా కాలం లెఫ్ట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ మహిళల పట్ల వివక్ష పెద్దగా ఉండదు అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ మన చుట్టూ ఉన్న పురుషాధిక్య సమాజ ప్రభావం అక్కడ కూడా ఉంది. మా రాష్ట్రంలో మహిళలు ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. అతెందుకు నా విషయంలోనే జరిగింది.
మీ చదువుకు ఆటంకాలు ఎదురయ్యాయా?
అవును, నేను పై చదువులకు ఢిల్లీ వస్తున్నప్పుడు మా కుటుంబాల్లో పెద్ద చర్చ జరిగింది. నేను చదువుతుంది ఆర్ట్స్. దీని కోసం ఢిల్లీ వరకు వెళ్ళడం అవసరమా అని ఎంతో మంది అన్నారు. పైగా కోల్‌కత లాంటి పెద్ద సిటీ నుండి నేను రాలేదు. మాది చిన్న పట్టణం. 2013లో డిగ్రీ కోసం ఢిల్లీ వచ్చాను. దానికంటే ముందు అంటే 2012లో నిర్భయ ఘటన జరిగింది. దాని ప్రభావం దేశ వ్యాప్తంగా ఎలా పడిందో మాపై కూడా అలాగే పడింది. ఆలాంటి చోటకు ఆడపిల్లను పంపించడం అవసరమా అని అమ్మానాన్నతో మా బంధువుల్లో చాలామంది అన్నారు. ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం నాకు సపోర్ట్ చేశారు.
ఢిల్లీ వెళ్ళిన తర్వాత మీ అనుభవం ఎలా ఉంది?
చాలా బాగా ఉంది. జేఎన్‌యూకి వెళ్ళిన తర్వాతనే నేను ఎస్.ఎఫ్.ఐలో యాక్టివ్‌గా పని చేయడం మొదలుపెట్టాను. మొదటి సారి అంత పెద్ద యూనివర్సిటీకి వెళ్ళినపుడు ఎవరికైనా గైడెన్స్ చాలా అవసరం. ఒక కొత్త విద్యార్థికి కావల్సిన అన్ని రకాల సపోర్ట్ అక్కడి ఎస్.ఎఫ్.ఐ నాయకులు నాకు చేశారు. అది చాలా ఇన్సిపిరేషన్‌గా అనిపించింది. వాళ్ళంతా పీహెచ్డీ, ఎంఫిల్ చేసే వాళ్ళు. కానీ ఎంబీఏ, ఎంసీఏ చేసే వాళ్ళకు సహకారం అందించేవారు. ఇలాంటి విద్యార్థి ప్రతినిథులు యూనివర్సిటీలో చాలా అవసరం అనిపించింది.
మీరు ఎస్.ఎఫ్.ఐలోనే ఎందుకు పని చేస్తున్నారు?
ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడుగుతుంటారు. యూనివర్సిటీలో ఎన్నో వామపక్ష విద్యార్థి సంఘాలు ఉండగా ఎస్.ఎఫ్.ఐలోనే నువ్వు ఎందుకు పని చేస్తున్నావంటారు. అన్ని విద్యార్థి సంఘాలకు ఎస్.ఎఫ్.ఐకు తేడా ఉంది. ఈ సంఘం కేవలం విద్యార్థుల సమస్యల పట్లనే కాదు రోజువారి ప్రజల జీవితాల్లో వచ్చే సమస్యలపై కూడా గొంతు విప్పుతుంది. ప్రశ్నిస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. రాజకీయ విషయాలతో పాటు విద్యార్థి సమస్యలపట్ల కూడా సమాన బాధ్యత తీసుకుంటుంది. అందుకే నాకు ఎస్.ఎఫ్.ఐ అంటే చాలా ఇష్టం.
ఉన్నత విద్యలో అమ్మాయిల స్థానం?
ప్రస్తుతం అమ్మాయిల చదువుపై తీవ్రమైన దాడి జరుగుతుంది. ముఖ్యంగా ఉన్నత విద్యపై. అయితే దీనికి ఓ చారిత్ర కారణం ఉంది. మనది పురుషాధిక్య సమాజం. మహిళలు బయటకు రావడం, చదువుకోవడం, అభివృద్ధి చెండదం భరించలేరు. ప్రస్తుతం మనల్ని పాలిస్తున్న ప్రభుత్వ విధానం కూడా ఇదే. అందుకే దాడి మరింత పెరిగింది. రోజురోజుకు పబ్లిక్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం తగ్గిపోయింది. ప్రభుత్వ విద్యా సంస్థలు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా 1991 తర్వాత పరిస్థితి బాగా దిగజారిపోయింది. చదువు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. దాంతో అమ్మాయిలకు చదువు అవసరమా అనే చర్చ ముందుకు వచ్చింది. అంత ఖర్చు పెట్టి చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేసి బాగా సంపాదించాలి. అమ్మాయిల విషయానికి వచ్చేసరికి బయటకు పంపించరు, ఉద్యోగాలు చేయించారు. మొత్తానికి చదువు అనేది లాభ నష్టాలను బేరూజు వేసుకునే ఓ వ్యాపారంగా మారిపోయింది. చదువు కోసం పెట్టే ఆ ఖర్చుతో ఆమ్మాయికి పెండ్లి చేయొచ్చు అని భావిస్తారు. మహిళలల్లో కూడా మైనార్టీ, దళితులు, వెనుకబడిన కులాల వారు పై చదువుకు దూరమైపోతున్నారు.
గతంలో మీపై దాడి జరిగింది. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు భయపడలేదా?
అమ్మ చాలా భయపడింది. అమ్మనే కాదు నాన్న కూడా భయపడ్డారు. జనవరి 2020లో ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు మాపై దాడి చేశారు. అయితే దాడి జరిగింది నా ఒక్కదానిపైనే కాదు నాతో పాటు నా స్నేహితులు, ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. దాడి జరిగిన తర్వాత మాకు తోడుగా ఎంతో మంది నిలబడ్డారు. దాంతో మా అమ్మాయి ఒంటరిగా లేదు, తనకు తోడుగా 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అనే ధైర్యం అమ్మానాన్నలో వచ్చింది. ఇప్పటికీ మేము జేఎన్‌యూలో ఆర్.ఎస్.ఎస్తో పోరాడుతూనే ఉన్నాం. ఈ పోరాటం ఒక్క జేఎన్యూలోనే కాదు దేశ వ్యాప్తంగా నడుస్తుంది.
అంత పెద్ద దాడి జరిగినా, బెదిరించినా ఏ మాత్రం భయపడలేదు. ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది?
ఎస్.ఎఫ్.ఐ నుండే వచ్చింది. ఏ ఉద్యమమైనా వ్యక్తితో మొదలవదు. సమూహంతోనే మొదలవుతుంది. ఈ దాడి కూడా జరిగింది వ్యక్తిపైనో, వ్యక్తులపైనో కాదు. భావజాలంపైన జరిగింది. ఏంటి ఆ భావజాలం అంటే పబ్లిక్ ఎడ్యుకేషన్. మా ఎస్.ఎఫ్.ఐ నినాదం సేవ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. మేము అందరికీ విద్య అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నాం. అది వాళ్ళకు నచ్చలేదు. అందుకే దాడి చేశారు. ఈ ఉద్యమాన్ని ఎస్.ఎఫ్.ఐ నడుపుతుంది. ఆ బలం మాకు ఎస్.ఎఫ్.ఐ ఇచ్చిన అధ్యయనం - పోరాటం అనే నినాదం నుండి వచ్చింది.
యూనివర్సిటీ ఎన్నికల్లో గెలిచారు. ఆ అనుభవం ఎలా ఉంది?
ఇంత పెద్ద యూనివర్సిటీలో అధ్యక్షురాలిగా గెలవడం ఓ గొప్ప అనుభూతి. పైగా ఓ మహిళగా ఓ మంచి అనుభవం. యూనివర్సిటీలో అనేక దాడులు, పోరాటాలు జరుగుతున్నాయి. ఎస్.ఎఫ్.ఐ చేస్తున్న పోరాటాల ఫలితమే మా గెలుపుకు కారణం. యూనివర్సిటీలో అమ్మాయిలు ఎందులోనూ వెనకడుగు వేయరు. షాహిన్ బాగ్ పోరాటంలోనూ మంచి పాత్ర పోషించాము. యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా చాలా నేర్చుకుంటున్నాను. అందరినీ ఐక్యం చేయడం, సమస్యలపై అధ్యయనం చేయడం, వాటి పరిష్కర మార్గాలను వెదకడంలో ఈ అనుభవం ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉండడం వల్ల ఎంతో స్టడీ చేసే అవకాశం వచ్చింది. ఇతర విద్యార్థి సంఘాలతో కలిసి పని చేయగలిగాను. భవిష్యత్‌లో ఎస్.ఎఫ్.ఐ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కావల్సిన అనుభవాలు నేర్చుకున్నాను.
యూనివర్సిటీలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు..?
ముందు డ్రాఫౌట్స్ సంఖ్య బాగా పెరిగిపోతుంది. రీసెర్చ్ స్కాలర్స్‌కు స్కాలర్ఫిప్ల సమస్య ఎక్కువగా ఉంది. చాలా మంది అమ్మాయిలకు ఇంట్లో అంత సపోర్ట్ ఉండదు. రీసెర్చ్ అంటే ఖర్చు ఎక్కువ. వాళ్ళు స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో స్కాలర్షిప్లు పెంచాల్సింది పోయి తగ్గిస్తున్నారు. హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. రుతుస్రావ సమయంలో అమ్మాయిలకు అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు కనీస సౌకర్యాలు ఉండవు. రీసెర్చ్ చేసేవారికి హాస్టల్ సమస్య, ట్రావెలింగ్ సమస్య విపరీతంగా ఉంది. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నింటిపై ఎస్.ఎఫ్.ఐ నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంది.
విద్యార్థి సంఘాలకు ఎన్నికలు అవసరమంటారా?
చాలా అవసరం. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావలంటే ఎన్నికలు ఉండాలి. కానీ ఎన్నికలంటేనే విద్యార్థులు భయపడే వాతావరణం సృష్టించారు. దేశ ప్రజాస్వామ్యం కాపాడాలంటే కేవలం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల వల్లనే సాధ్యం కాదు. ప్రతి సంస్థలోనూ ఎన్నికలు అవసరం. ప్రతి చోట ప్రజాస్వామ్య వాతావరణం కనిపించాలి. జేఎన్‌యూలో మా సమస్యలపై గొంతు విప్పి ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఎన్నికల్లో గెలిచాం కాబట్టి విద్యార్థుల తరపున నిలబడాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. విద్యార్థులు తమ సమస్యలపై మాట్లాడాలంటే ఎన్నికల అవసరం చాలా ఉంది.
చాలా చిన్న వయసులో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎలా అనిపించింది?
2021లో బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీ చేసిన వారిలో నేను అత్యంత చిన్నదాన్ని. ఈ ఎన్నికల్లో పార్టీ యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో నాకు పోటీ చేసే అవకాశం వచ్చింది. చాలా మంచి అనుభవం ఇది. విద్యార్థులు చాలా మంది సపోర్ట్ చేశారు. యువత, విద్యార్థులు చాలా మంది పని చేయడానికి ముందుకు వచ్చారు. చాలా నేర్చుకున్నాను. కింది స్థాయి ప్రజలను కలుసుకున్నాను. మా రాష్ట్రంలో అవినీతి, నిరుద్యోగ సమస్య బాగా ఉంది. కింది స్థాయి నుండి ప్రజల్లో మతోన్మాదాన్ని పెంచి పోషించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అధ్యయనం చేశాను. ప్రజలను కలుపుపోయి అవినీతికి వ్యతిరేకంగా పని చేసి వామపక్ష ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ఉంది.
మీలో స్ఫూర్తినింపిన నాయకులు..?
చాలా మంది ఉన్నారు. అయితే ఈ సందర్భంలో మల్లు స్వరాజ్యం గారి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఆమె గొప్ప నాయకురాలు, ఉద్యమకారిణి. 10 ఏండ్ల వయసులో తుపాకీ పట్టి అడవుల్లోకి వెళ్ళి ప్రజల కోసం పని చేయడం గొప్పగా అనిపించింది. ఇలాంటి వారు సమజానికి చాలా అవసరం. అలాగే సబ్దర్ హష్మీ రాసిన పుస్తకం 'హల్లా బోల్' నాకెంతో స్ఫూర్తినిస్తుంది.
ఉన్నత విద్యలో అమ్మాయిల సంఖ్య పెరగాలంటే..?
ప్రభుత్వం తలచుకోవాలి. ఎందుకంటే చేతిలో అధికారం ఉంటుంది. కాబట్టి ప్రతి సమస్యపై ముందు ప్రభుత్వం స్పందించాలి. దీనికి కేరళ మన ముందు కనిపిస్తున్న చక్కటి ఉదాహరణ. అక్కడ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కోసం ఎంతో చేస్తుంది. ఇది అన్ని రాష్ట్రాలు చేయవచ్చు. కాబట్టి అమ్మాయిలను చదువు విషయంలో ప్రోత్సహించాలనే బాధ్యత ముందు ప్రభుత్వం తీసుకోవాలి. అయితే లెక్కలు చెప్పుకోవడం కోసం కొన్ని చోట్ల అమ్మాయిలను కేవలం పాఠశాలల్లో చేర్పించి వదిలేస్తున్నారు. కానీ డ్రాపౌట్స్ లేకుండా విద్యను కొనసాగించేలా చేయడం చాలా ముఖ్యం. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
- సలీమ