Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉప్పు మన జీవితంలో భాగమైపోయింది. వంటల్లో ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా తినలేం. ఇంట్లో ఇలా జరిగితే కస్సున లేచి ఇంట్లో వారిపై అరుస్తుంటాం. మీకు తెలుసా అలా అరవడానికి కూడా కారణం ఉప్పేనని. నిజమే ఉప్పుతో చాలా ముప్పు పొంచి ఉందని వైద్యులు చెబుతున్నారు. ఓ సాధారణ మనిషి రోజులో 2400 ఎంజీ ఉప్పును మాత్రమే తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది కేవలం ఓ టేబుల్ స్పూన్ ఉప్పుతో సమానం. కానీ మనం ఒక్క పెరుగన్నంలోనే దీన్ని వాడేస్తాం. కాబట్టి మనమంతా కచ్చితంగా ఓ రోజులో మోతాదు కంటే ఎక్కువ ఉప్పును వినియోగిస్తున్నాం. అయితే అధికంగా ఉప్పును వాడితే ఏమవుతుందో? తెలుసుకుందాం...
ఉప్పు ఎక్కువైతే: ఉప్పును అధికంగా తీసుకుంటే అది నేరుగా రక్త ప్రసరణను ఇబ్బంది పెడుతుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే అధికంగా ఎలక్ట్రోలైట్లను నియంత్రించడం వల్ల రక్తపోటుకు కారణమవుతుంది. ఉప్పు అడ్రినల్ గ్రంధులను ఉత్తేజ పరుస్తుంది. దీంతో వడదెబ్బకు గురైన వారికి ఉప్పు మేలు చేస్తుంది. ఉప్పు శరీరంలోని మినరల్స్‌ను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువగా ఉప్పు తీసుకుంటే దాని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చు కానీ క్రమేపి తీవ్రమైన సమస్యలకు గురవుతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గుండె జబ్బులు: అధికంగా ఉప్పును వినియోగిస్తే రక్తనాళాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో బీపీ పెరుగుతుంది. ఈ కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అయితే రోగ నిరోధక శక్తి ఉన్నవారికి ఇలా జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
కిడ్నీ వ్యాధి: మనం ఎక్కువగా ఉప్పును తీసుకుంటే శరీరం నుంచి నీటిని ఫిల్టర్ చేసే మూత్రపిండాల సామర్థ్యం కోల్పోవచ్చు. కిడ్నీలు రక్తంలో అధిక ఉప్పును నియంత్రించడానికి అధికంగా ప్రయత్నిస్తుంది. దాంతో వాటికి అదనపు ఒత్తిడి పెరిగి మూత్ర పిండాల వ్యాధికి కారణమవుతుంది.
ఎముకల వ్యాధి: ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటే అందులో ఉండే సోడియం ఎముకల్లో ఉండే కాల్షియానికి నష్టం చేస్తుంది. దీంతో ఎముకల్లోని బలం క్షీణించి ఓస్టియోపెరిసిస్ (బోలు ఎముకల వ్యాధి) వచ్చే అవకాశం ఉంది.