Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మ్యూరల్ ఆర్ట్ అంటే కుడ్య చిత్రకళ అని అర్థం. మానవుడు గుహలలో నివసించే పాలియోలిథిక్ యుంగం నుంచీ ఈ కుడ్య చిత్రాలున్నాయి. మానవులు తమ మనసులోని అనంతమైన భావాలను చెప్పడానికి అందుబాటులో ఉన్న రాతిగుహల్ని కాన్వాసుగా ఉపయోగించుకున్నాడు. తాను చెప్పదలుచుకున్న ఒక కథను మొత్తం తగిన చిత్రాల ద్వారా వివరించడానికి గోడల్ని వాడుకున్నాడు. పూర్వ కాలపు రాజ భవనాలను గమనించినట్లైతే భవనం గోడలు, పైకప్పులు, తలుపులు, ద్వారాలు, కిటికీలు ఏవీ వదలకుండా చిత్రాలతో నింపేశారు. పూరాతన కాలం నుంచీ వస్తున్న మ్యూరల్ ఆర్ట్ మన గత చరిత్రను భవిష్యత్తరాలకు అందించడానికి పనికి వస్తున్నది. ఆధునికంగా కూడా ఈ కుడ్య చిత్రాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇప్పుడు మనం నిర్మించుకుంటున్న భవనాల పైకప్పులకు ఫాల్స్ సీలింగ్ వేసి అనేక డిజైన్లను వేయించుకుంటున్నాం. భవన ముందు భాగంలో సైతం అనేక పెయింటింగులను వాడుతున్నారు. ఫ్రెస్కో, మొజాయికో, స్టెయిన్ట్గ్లాస్, ఎన్‌కాస్టిక్ అనే రకాలు కుడ్య చిత్రాల్లో ప్రసిద్ధి చెందినవి. కొచ్చిలోని మట్టాన్ చెరీ ప్యాలెస్‌లోని మ్యూరల్ చిత్రాలు అద్భుతంగా ఉంటాయి. నేను కొచ్చి వెళ్ళినపుడు ఆ చిత్రాన్ని ఫొటోలు తీసుకున్నాను.
మ్యూరల్ పెయింటింగ్‌కు కేరళ రాష్ట్రం ప్రసిద్ధి చెందినది. అక్కడ హిందూ పురాణాలను వర్ణించే మ్యూరల్ ఆర్ట్స్ ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. ఈ కుడ్య కళకు రాచరికపు ఆదరణ ఎక్కువగా లభించింది. కేరళ రాష్ట్రలోని పురాతన దేవాలయాలు, రాజ భవనాలు ఈ రకమైన కుడ్య చిత్రకరళను కలిగి ఉన్నాయి. ఈ పెయింటింగ్‌లో ఎక్కువగా దేవతా చిత్రాలు, నెమలి, హంస, సీతాకోక చిలుక వంటి పక్షుల అందాలు కనువిందు చేస్తాయి. ఇలాంటి బొమ్మల్ని మొదటగా ప్రయత్నించేటపుడు చపాతీ కోసం కలుపుకున్న గోధుమపిండి ముద్దతో చేయవచ్చు. నేను ఇలా చాలా జంతువుల్ని తయారు చేశాను. మామూలుగా జంతువును చేసి వదిలేస్తే 'క్లే ఆర్ట్' అవుతుంది. అదే ఒక సమానమైన ఉపరితలంపై అతికిస్తే అది మ్యూరల్ ఆర్ట్ అవుతుంది. రెండు పెద్ద పువ్వుల్ని చేస్తే బావుంటుంది. ఏ4 సైజు కార్డ్‌బోర్డులో రెండు పువ్వులు రెండు ఆకులు తయారు చేసి పెడితే బాగుంటుంది. పూల రెక్కల మీద గీతల్ని గీసినట్టుగా సన్నని సూదితో కూడా గీసుకోవచ్చు. సైజును బట్టి గీతల్ని గీయడానికి సూది, పెన్ను, రీఫిల్ లాంటివి వాడుకోవాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో కూడా చేయవచ్చు. కొంతమంది వైట్ సిమెంట్‌తో కూడా చేస్తున్నారు. మా చిన్నప్పుడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తప్ప వేరేవేవీ అందుబాటులో లేవు. ఇప్పుడు ఎన్నో రకాలు దొరుకుతున్నాయి.
రాధాకృష్ణులు, హంస చిత్రం
ఇది మామూలు పెయింటింగ్ లానే అనిపిస్తుంది. ఎక్కువ ముదురు రంగులు కనిపించవు. ఒక అట్ట మీద హంస చిత్రాన్ని గీసి ఉంచుకోవాలి. మొదటగా హంస రేఖా చిత్రాన్ని బ్రష్‌తో లేత రంగుతో వేయాలి. ఆ తర్వాత లేత పసుపు రంగును మొత్తం హంసకు వేసేయాలి. ఇప్పుడు బాక్గ్రౌండ్గా కొద్దిగా డార్క్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు హంసను మరల నిండు కాఫీ రంగుతో గీయాలి. రేఖలకు బాగా అలంకారం ఉంటుంది. రాధాకృష్ణుల ఫొటోను కూడా చూడండి. ఇందులో కృష్ణునికి లేత నీలం రంగుతో నింపాలి. మిగతా చిత్రమంతా ఎక్కువగా పసుపు, లేత గోధుమ వర్ణాలతోనే ఉంటుంది. రేఖలకే ఎక్కువ వంపులు, అలంకారాలు ఉంటాయి. నగలు కూడా సాధారణంగానే ఉండి ఎక్కువ మెరుపు లేకుండా ఉంటాయి.
అందాల నెమలి
పూర్వ కాలంలోని ఈ మ్యూరల్ పెయింటింగ్‌ను ఆధునీకరించి చిన్న చిత్ర పటాలుగా రూపొందిస్తున్నారు. చిన్నది అంటే మామూలుగా ఏ4 సైజులో చేసుకోవచ్చు. కానీ 4 అడుగుల వెడల్పు, రెండు అడుగుల పొడవుతో తయారు చేసి డ్రాయింగు రూములో అలంకరించుకుంటున్నారు. హైదరాబాద్ లాంటి నగరాలలో ఒక పటం మ్యూరల్ పెయింటింగ్ నేర్పిస్తే వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. రామాయణ భారతాల్లోని ఘట్టాలను, పెండ్లి వేడుకలను చిత్రాలుగా మలుస్తున్నారు. చాక్ పౌడర్ ఫెవికాల్‌ను కలిపి ముద్దగా చేసుకొని తగిన ఆకారాన్ని సృష్టిస్తున్నారు. మనం తయారు చేసే నెమలి కోసం మొదటగా పెన్సిల్‌తో నెమలి బొమ్మను గీసి ఉంచుకోవాలి. దాని మీదున్న గీతల్ని బట్టి చాక్ పౌడర్ ముద్దను వత్తుకుంటూ రావాలి. ఒకేసారి అందంగా రావడం కష్టం. మొత్తం నెమలి ఆకారాన్ని ఎత్తుగా ఉబ్బెత్తుగా కార్డుబోర్డు మీద అతికించుకుంటూ రావాలి. మొత్తం బొమ్మ పూర్తయ్యాక పెన్ను రీఫిల్‌తో దాని మీద గీతలు గీయాలి. డిజైన్లన్నీ గీసినట్టుగా పెన్నుతో దిద్దితే కనిపిస్తాయి. తర్వాత రంగులు వేసినప్పుడు నెమలి ఆకారం స్పష్టంగా తెలుస్తుంది. లేకుంటే ముద్దలు పెట్టినట్టుగా అనిపిస్తుంది.
గోడకు వేసుకునే డిజైన్
దీని కోసం వాల్పుట్టీ వాడవలసి ఉంటుంది. నేనయితే ఇంటికి 'పుట్టి' పెట్టేటపుడు ఈ డిజైనును ప్రయత్నించాను. ఒకవేళ గోడకు కాకపోయినా ఒక సాదా టైల్ మీద ప్రయత్నించవచ్చు. ఇళ్ళు కట్టినపుడు టైల్స్ అదనంగా దాచి ఉంచుకోవాలి కదా! ఎందుకంటే మరల అదే డిజైన్ దొరకదని అదనంగా పెట్టుకోమని చెబుతారు. అలాంటి టైల్ మీద వాల్ పుట్టి మందంగా పూసి ఉంచాలి. గట్టి ప్లాస్టిక్ పేపర్ మీద డిజైన్ కత్తిరించి ఉంటుంది. అలాంటి పేపర్ తెచ్చుకుని మందంగా పూసిన పుట్టిపై పెట్టి గట్టిగా నొక్కాలి. డిజైన్ కన్నాల్లోంచి పుట్టి ఎత్తుగా బయటికి వచ్చి డిజైన్ ఏర్పడుతుంది. దానికి రంగులు వేసుకోవచ్చు లేదా అలాగే తెలుపు రంగులోనే ఉంచవచ్చు. నేను ప్లాస్టిక్ డిజైన్ పేపర్ బదులుగా ఎక్స్రేఫిల్మును వాడాను. అది చాలా గట్టిగా ఉండి డిజైన్ అందంగా వచ్చింది. మా ప్రహరీ గోడకు ఇలా తయారు చేసి పెట్టాను.
బుద్ధడిని చేద్దాం
ఈ మధ్య బిల్డింగ్ ఎలివేషన్స్‌కు బుద్దుడి బొమ్మల్ని బాగా వాడుతున్నారు. ఆకులు, పూలు, లతలు అన్నీ చేసి కాపర్, సిల్వర్, గోల్డ్ రంగులు వేస్తున్నారు. అయితే అంత పెద్ద బుద్దుడిని కాకుండా చిన్నగా టేబుల్ మీద పెట్టుకునే బుద్ధుడిని చేద్దాం. చాక్‌పౌడర్ గమ్ కలిసిన ముద్దను కార్డ్‌బోర్డు మీద బుద్దుడిలా మార్చేద్దాం. మన మదిలోని ఊహలను కాగితం మీద పరచినట్టే ఇక్కడ పరవాలి. నాకు చిన్ననాడు చేసుకున్న బంకమన్ను బొమ్మలు గుర్తొచ్చాయి. నేను చిన్నప్పుడు ఎద్దుల బొమ్మలు ఎక్కువగా చేసేదాన్ని. మా తమ్ముడు రోజూ ఎద్దులు కావాలని ఏడిస్తే అలా మట్టి బొమ్మల ఎద్దులు చేసేదాన్ని. మ్యూరల్ ఆర్ట్ వేస్తుంటే ఎన్ని జ్ఞాపకాలో...
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్