Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొక్కలు పెంచే స్థలం లేదు... తీరికా లేదు అనేవారంతా ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంటీరియర్ డెకరేషన్లో వీటికి ప్రముఖ స్థానం దక్కడమే కారణం. అయితే ఇంట్లో మొక్కల్ని పెంచేప్పుడు కొన్ని ప్రాథమిక నియమాలు తెలుసుకుని ఉండాలి. అవేంటో చూద్దాం...
మొక్కల్ని తెచ్చిన కొత్తలో... కాస్త గాలి, కాంతి ధారళంగా తగిలే చోట వాటిని ఉంచడం మేలు. ఒకేసారి చీకట్లోకో, ఎండలోకో మారిస్తే ఆ వాతావరణానికి అలవాటు పడలేక చనిపోయే ప్రమాదం ఉంది.
ఇండోర్ మొక్కలే అయినా... అస్సలు కాంతి తగలకపోతే నిలదొక్కుకోవడం కష్టం. అప్పుడప్పుడూ అయినా కాస్త ఎండ తగిలేలా చూసుకోండి. అలాగని నేరుగా తగిలే ఎండలో పెట్టొద్దు. ఇండోర్ ప్లాంట్స్కి పాక్షికంగా ఎండ తగిలితే చాలు. అందుకోసం వాటిని చెట్టునీడనో, కిటికీ పక్కనో ఉంచితే సరిపోతుంది.
ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఒకే వాతావరణంలో, ఒకే తరహాలో పెరుగుతాయనుకోవడం పొరపాటు. కొన్నింటికి కొద్ది నీళ్లే సరిపోతాయి. ఇంకొన్నింటికి కాస్తయినా కాంతి కావాలి. అందుకే ఎంచుకునేప్పుడే అవి ఎలాంటి పరిస్థితుల్లో పెరుగుతాయో తెలుసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు సక్యులెంట్స్కి తరచూ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. పోసినా మట్టి తడిస్తే చాలు. అదే ఫిలడెండ్రాన్, ఫెర్న్ వంటి రకాలకు పదిహేను రోజులకోసారి పోస్తే చాలు. వాతావరణం పొడిగా ఉంటే తేమకోసం మొక్క చుట్టూ నీళ్లను స్ప్రే చేస్తే చాలు. కాస్త ఆకులు రంగు మారడం, రాలిపోవడం, అంచులు ఎండిపోవడం వంటివి కనిపిస్తుంటే నీళ్లు సరిపోవడం లేదని లెక్కే.
ఎండలో నాటిన మొక్కలు కాస్త వేగంగా ఎదుగుతాయి. అందుకే తరచూ ప్రూన్ చేయడం తప్పనిసరి. ఇండోర్ ప్లాంట్స్ ఎదిగే వేగం కాస్త నెమ్మదిగా ఉంటుంది. అయినా సరే, మొక్క పెరుగుతోందంటే... వేరే పెద్ద కుండీలోకి మార్చాలి.
ఎంత ఇంట్లో పెరిగే మొక్కలైనా వీటికీ చీడపీడల సమస్య ఉంటుంది. ఆ ఇబ్బంది ఎదురైనప్పుడు గాలి ధారళంగా తగిలే చోట ఉంచి... సర్ఫ్నీళ్లల్లో, కాస్త వంటసోడా కలిపి మొక్క ఆకులను తడిపాలి. ఆపై అరగంటాగి టిష్యూతో తుడిచేయాలి. లేదంటే ఆకులు కుళ్లిపోయే ప్రమాదం ఉంది.