Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మతనం గొప్ప అనుభూతి. మాతృత్వాన్ని పొందాలంటే ఎన్నో రకాల సమస్యలను ఎదురుకోక తప్పదు. కొంత మంది నెల తప్పిన దగ్గరనుండి వికారం వాంతులతో బాధపడతారు. మరికొందరికి చర్మం పొడిబారినట్టుగా అయ్యి దురదలు మొదలవుతాయి. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా చర్మాన్ని గోక్కోకుండా ఉండలేరు. దాని ఫలితంగా వచ్చే రేషేస్ ఇంకా చికాకు తెప్పిస్తాయి. అసలీ దురద ఎందుకు వస్తుందా అని ఆలోచిస్తే మాములుగా ఉన్నప్పటి కన్నా ప్రెగెన్సీ టైంలో మన శరీరంలో కొన్ని హార్మోనియల్ చేంజెస్ రావటం వల్ల ఇలా చర్మం పొడిబారే అవకాశం ఉంటుంది. దాని వల్ల దురద వస్తుంది. అదీకాక చర్మం సాగుతూ ఉండటం వల్ల చర్మానికి తగినంత తేమ అందక దురదలు వచ్చే అవకాశం ఉంది. దీని పర్యవసానమే కడుపు మీద చారలు ఏర్పడి అవి ఎప్పటికి అలానే ఉండిపోతాయి. ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి మీరు హాయిగా మాతృత్వపు ఆనందాన్ని అనుభవించాలంటే ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించాలి.
ఎక్కువ మందికి కడుపు మీద లేదా మొహం మీద చర్మం పొడిగా అవుతుంది. చర్మం పొడిబారుతోంది అని అనిపించిన దగ్గర నుండి ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసుకుంటే మంచిది. రెండు మూడు చుక్కల ఆలివ్ ఆయిల్లో కాసిని నీళ్ళు కలిపి దానిని కావాల్సిన చోట రాసుకుంటూ ఉంటే సరిపోతుంది.
అలాగే వెన్న కూడా ఈ సమస్యకి మంచి పరిష్కారం చూపిస్తుంది. ఇంట్లో వెన్న ఉన్నా లేదా పాల మీగడ ఉన్నా దానిని చర్మానికి రాసుకుంటే త్వరిత ఫలితం కనిపిస్తుంది.
రోజూ వాడే సబ్బులు కూడా చర్మం పొడిబారటానికి కారణం అవుతాయి. అందుకే కెమికల్స్ ఎక్కువగా ఉండే సబ్బులు వాడకుండా జాగ్రత్త పడాలి. సబ్బులకి బదులు ఆపిల్ సైడర్ వెనిగర్ వాడటం మంచిది. దీనిని నీటిలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పొడి చర్మాన్ని పోగొట్టటానికి పెరుగు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కడయితే చర్మం పొడిగా ఉందో అక్కడ పెరుగు రాసుకుని ఒక 10నిమిషాలు ఉంచి తర్వాత కడిగేసుకుంటే చాలు.
ఎక్కువగా వేడి ఉన్న నీళ్ళు కాకుండా కాస్త గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది.
చర్మం పొడిబారిపోయి గరుకుగా తయారయితే రెండు కోడిగుడ్ల తెల్లసొనలో పావు కప్పు జొన్నపిండి, నాలుగు చెంచాల చక్కెరపొడి వేసి కలిపి రాసుకుని బాగా ఆరిన తర్వాత కడిగేసుకుంటే చాలు.
స్నానం తర్వాత చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ రాసుకోండి. అందువల్ల చర్మం ఎక్కువ సమయం తేమగా ఉంటుంది. అప్పుడు దురదలు కూడా రావు.
అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువగా నీళ్ళు తాగటం. మాములుగా ఉన్నప్పటికన్నా ప్రెగేన్సీతో ఉన్నప్పుడు నీళ్ళు మరిన్ని తాగాలి. అప్పుడు చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంటుంది.
ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ పొడిబారే చర్మానికి కూడా ఇలా చాలా నివారణా మార్గాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి పాటించి ఇంట్లోనే మన సమస్యని మనమే దూరం చేసుకుని హాయిగా ఉండచ్చు.