Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివాహ బంధం శాశ్వతమైంది. ఈ విషయం తెలిసినా కొన్ని జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ.. నూరేండ్ల అనుబంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అయితే ఇందుకు వారు తమ అనుబంధంలో కొన్ని అంశాల్ని స్వీకరించలేకపోవడం, జీర్ణించుకోలేకపోవడమే కారణమంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. అదే కాస్త ఓపిక వహించి కొంత సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తే ఆలుమగలు తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవచ్చంటున్నారు. మరి ఇంతకీ ఏంటా అంశాలు? ఈరోజు మనమూ తెలుసుకుందాం.
'తప్పులు చేయడం మానవ సహజం..' అంటుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి. ఇందులో కొన్ని తెలిసి చేయచ్చు.. మరికొన్ని తెలియకుండా జరిగిపోవచ్చు. అయితే కొంతమంది వీటిని జీర్ణించుకోలేరు. ఉదాహరణకు.. మీ ప్రమేయం లేకుండా, మీ అనుమతి తీసుకోకుండా మీ భాగస్వామి మీ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారనుకోండి.. ఇలాంటప్పుడు అవతలి వ్యక్తిపై కోపం రావడం సహజం. అలాగని చీటికీ మాటికీ కోపగించుకుంటూ పోతే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. అదే ఈ విషయం గురించి భాగస్వామితో నెమ్మదిగా మాట్లాడి చూడండి. తనకు తెలియకుండా తన డబ్బును మీరు వాడితే తను ఎలా ఫీలవుతారో ఒక్కసారి అడిగి చూడండి.. అప్పుడు మీ బాధేంటో వారికి అర్థమవుతుంది. దాంతో ఆ పొరపాటు మరోసారి చేయకపోవచ్చు. ఇదొక్కటనే కాదు.. ప్రతి విషయంలోనూ ఒకరికొకరు క్షమాగుణంతో వ్యవహరిస్తే.. చాలా సమస్యలు నాలుగ్గోడల మధ్యే పరిష్కారమవుతాయి. కాబట్టి ఆలుమగలు తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటే కాస్త కష్టమైనా సరే.. ఒకరినొకరు క్షమించుకోగలగాలంటున్నారు నిపుణులు.
మనం మార్చుకోవాల్సినవి
పెండ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు.. భాగస్వామి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కావచ్చు. ఇలా కారణమేదైనా కొన్ని విషయాల్లో ఎదుటివారి ఆలోచనల్ని బట్టి మనల్ని మనం మార్చుకోవాల్సి రావచ్చు. కానీ కొంతమంది 'తనకోసం నేనెందుకు మారాలి? నా ఇష్టాయిష్టాల్ని ఎందుకు పక్కన పెట్టాలి?' అన్న మొండి పట్టుదలతో వ్యవహరిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ పంతం పనికిరాదంటున్నారు నిపుణులు. కొన్ని విషయాల్లో మనకు నచ్చకపోయినా భాగస్వామి కోసం సర్దుకుపోవడంలో తప్పు లేదంటున్నారు. ఇలా ఒకరి కోసం మరొకరు చేసే ఈ త్యాగమే ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచడంలో దోహదం చేస్తుందంటున్నారు.
దాపరికాలు లేకుండా
భార్యాభర్తలన్నాక గొడవలు పడడం, కాసేపటికే తిరిగి కలిసిపోవడం సహజం. అయితే కొంతమంది వీటిని భూతద్దంలో పెట్టి మరీ భాగస్వామిలోని లోపాల్ని, వారు చేసిన తప్పుల్ని వెతుకుతుంటారు. నిజానికి ఇలా మీ మనసంతా ప్రతికూల ఆలోచనలతో నిండిపోతే.. ప్రతిదీ నెగెటివ్గానే కనిపిస్తుంది. అంతేకాదు.. ప్రతిదానికీ అవతలి వారి మీద అనుమానం పెరిగిపోతుంది. ఈ పెనుభూతం వల్లే చాలా జంటలు విడిపోతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకరిపై ఒకరికి అనుమానం లేకుండా ఉండాలంటే.. ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు పారదర్శకంగా వ్యవహరించడం ముఖ్యమంటున్నారు. ఇది కాస్త కష్టమే అయినా.. ఇద్దరూ దాపరికాల్లేకుండా ముందుకు సాగుతున్న కొద్దీ ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ఇదే ఇద్దరినీ శాశ్వతంగా కలిపి ఉంచుతుంది.
ఇవి కూడా గుర్తుపెట్టుకోండి
చిన్న సాయాలు, గుర్తుంచుకొని మీకోసమంటూ ప్రత్యేకంగా ఏదైనా తెచ్చినప్పుడు ఆనందించడం, 'థాంక్యూ' చెప్పడం సహజం. ఒక అడుగు ముందుకేసి దాన్ని చూడగానే మీకనిపించిన అనుభూతిని మాటల్లో చెప్పండి. అందుకున్న మీకే కాదు.. వారికీ మధురానుభూతిగా మారుతుందా క్షణం.
భాగస్వామిలో నచ్చేవీ, నచ్చనివీ రెండూ ఉంటాయి. 'నాకు ఫలానాది చేస్తే నచ్చుతుంది, నచ్చదు' అని చెబుతుంటారు కదా! ఎందుకు నచ్చుతుందో? ఎందుకు నచ్చదో వివరంగా చెప్పండి. మంచిదైతే అభివృద్ధి పరచుకుంటారు. కాదనుకుంటే మారడానికి ప్రయత్నిస్తారు. రెండూ మంచివేగా!
సంతోషాన్నిచ్చిన సందర్భం ఉంది.. మీకు సంతోషం కలిగించిందేదో చెప్పండి. పోనీ అవతలి వ్యక్తి మీరు చేసిన దానికి థాంక్యూ చెప్పారనుకోండి. వారికి సాయం చేయడంలో మీకష్టం చెప్పండి. కృతజ్ఞతగా ఉంటారు. నచ్చకపోయినా చేశారా.. దాన్నీ పంచుకోండి. లేదూ తనకి సాయం చేయడంలో మీకు సంతృప్తి ఉంటే చెప్పండి. మీ తీరేదో అర్థమవుతుంది.
అందరూ అన్నీ చెప్పలేరు. ఎంతసేపూ మీరు చెప్పడమే కాదు.. అవతలి వారి ఆసక్తులు, ఇష్టాయిష్టాలనూ కనుక్కోండి. అప్పుడు వాళ్లూ నోరుతెరుస్తారు. అభిప్రాయాలను చెబుతారు. సంతోషం, దుఃఖం గురించి పంచుకుంటారు. ఇవన్నీ భార్యాభర్తల మధ్య సహజంగా జరిగేవే.. చిరునవ్వు, కోపం, అలక, చిన్నమాటకు బదులు వివరంగా భాగస్వామి ముందుంచుతున్నారంతే! మాట అనే ఈ చిన్న మంత్రాన్ని పాటించి చూడండి.. మీరు కోరుకున్న విధంగా జీవితం సాగుతూనే.. బంధం బలపడటాన్ని స్పష్టంగా గమనిస్తారు.