Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజూ మనం కలిసి మాట్లాడే స్నేహితురాలే.. అయినా ఉన్నట్టుండి ఒక్కొక్కసారి తన పేరు ఎంతకీ గుర్తు రాదు.. కొన్ని సందర్భాల్లో అయితే ఇంటి తాళం చెవి ఎక్కడ పెట్టామో కూడా గుర్తు రాదు. చాలామందికి ఈ పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది. వత్తిపరమైన ఆందోళన, ఇతరత్రా కారణాల వల్ల చిన్న చిన్న విషయాలను సైతం మరచిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో మతిమరపును పోగొట్టుకోవడమెలా? అయితే రోజూ కొన్ని పనులను చేయడం అలవాటుగా మార్చుకుంటే మతిమరపు నుంచి బయటపడచ్చంటున్నారు నిపుణులు.
రోజూ పత్రికలు చదవడం చాలామందికి ఉండే అలవాటు. అయితే చాలా పత్రికల్లో సుడోకు, పజిల్స్, పొడుపు కథలు, లాజిక్‌తో ముడిపడి ఉండే ప్రశ్నలు వంటి వాటిని కూడా ప్రచురిస్తారు. అయితే అవన్నీ పిల్లల కోసం అని కొందరు వదిలేస్తూ ఉంటారు. కానీ ఈ పజిల్స్ పూర్తి చేస్తున్నప్పుడు మన మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. ఎక్కడ ఏ పదం నింపామో కూడా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే రోజూ ఏదో ఒక సమయంలో వీటిని సాధన చేయడం ద్వారా మన మెదడుని కూడా చాలా విషయాలు గుర్తుంచుకునేలా చేయచ్చు.
మతిమరుపుకి మరో ప్రధాన కారణం తీవ్రమైన ఒత్తిడి. ఆఫీసులో ఎక్కువ సమయం విధులు నిర్వహించినా.. లేదంటే ఏ పనైనా సరిగా పూర్తికాకపోయినా.. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నించినా.. మన మెదడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఆ సమయంలో చేతికి అందుబాటులో ఉన్న పెన్ను కోసం కూడా చాలా వెతుక్కుంటాం. అంటే తెలియకుండానే మనకు మతిమరపు వచ్చేస్తుంది. దీనికి యోగా ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. దీనితో పాటు ఒత్తిడికి గురవుతున్నామనిపించిన సమయంలో దీర్ఘశ్వాస తీసుకోవడం ద్వారా కూడా ఒత్తిడిని అదుపు చేయచ్చు.
నిద్ర మెదడుకు పూర్తి విశ్రాంతినిస్తుంది. అందుకే సరిపడినంత సేపు నిద్రపోకపోతే మెదడు చురుగ్గా పనిచేయదు. ఫలితంగా సమయానికి ఏమీ గుర్తు రావు. అలాగే మెదడు కూడా ఒత్తిడికి గురవుతుంటుంది. కాబట్టి రోజూ ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. దీనివల్ల ఉదయం లేవగానే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తుంది. పైగా బద్ధకం లాంటి లక్షణాలు దరి చేరవు కాబట్టి మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా మతిమరపు అనే సమస్యే ఉండదు.
పై వాటితో పాటు రోజూ వ్యాయామం చేయడం, కాఫీ, టీలకు దూరంగా ఉండడం, చేసే పనిని కొత్తగా చేయడానికి ప్రయత్నించడం మొదలైన వాటి ద్వారా మెదడు మరింత హుషారుగా పనిచేస్తుంది. ఫలితంగా మతిమరపు సమస్య వేధించకుండా ఉంటుంది.