Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు వ్యాపారంలో స్థానాన్ని దక్కించుకోవడం అంత సులువు కాదంటున్నాయి అధ్యయనాలు. నేషనల్ ఎకనామిక్ సర్వే ప్రకారం దేశంలో 14 శాతం వ్యాపారాలను మాత్రమే మహిళలు నిర్వహిస్తున్నట్టు తేలింది. కాలు మోపాలనుకున్న దశ నుంచే మహిళలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. మొదట లింగ వివక్ష, పక్షపాతం వంటి అడ్డంకులను దాటాలి. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని నిరూపించుకోవడానికి సామర్థ్యాలు పెంచుకోవాలి. మరో ప్రధాన సమస్య ఆర్థిక పక్షపాతం. పెట్టుబడిదారులు మగవారిని నమ్మినంతగా మహిళలపై నమ్మకం ఉంచరని కూడా అధ్యయనాలు తేల్చాయి. దీన్నుంచి గట్టెక్కాలంటే... చిరు వ్యాపారాలు చేయడమో, లేదా ప్రభుత్వ పథకాల ద్వారా రుణాన్ని పొందడానికో ప్రయత్నించొచ్చు. ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చేటప్పుడు ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తే విజయం ఖాయం.
మనం వ్యాపారంతో పాటు ఇంటినీ సమన్వయం చేయాల్సి ఉంటుంది. పిల్లల చదువు, వంట వంటివన్నీ సమయానుసారం పూర్తిచేయాలి. వ్యాపారవేత్తగా ఏకాగ్రత చూపడానికి సమయం సరిపోదు. దీంతో రెండు పడవలపై ప్రయాణంలా అనిపించొచ్చు. పరిష్కారంగా ఇంటి పనిలో కుటుంబ సభ్యులనూ భాగస్వాములను చేయాలి. వ్యాపారంలో మెంటర్ సాయం తీసుకోవాలి.
పిల్లల స్కూల్ ప్రాజెక్టు చేయించడంలో తల్లిగా ఎంత కష్టపడతామో, వ్యాపారవేత్తగా క్లైంట్ ప్రెజెంటేషన్స్ రూపొందించడంలోనూ అంతే శ్రమపడాలి. అవతలి వారిని మెప్పించలేకపోతే తిరిగి ప్రయత్నించాలే కానీ వెనుకడుగు వేయకూడదు. ఒక్కసారి నిరాశను మనసులో వస్తే అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వ్యాపారవేత్తగా నిలబడాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి వైఫల్యాల నుంచి కొత్త పాఠాలను నేర్చుకుంటూ ముందడుగు వేయాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో మనం అనుకున్నది సాధించి చూపగలం.