Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుట్టు తేమను కోల్పోవడానికి, నిర్జీవమైపోవడానికి వాతావరణం కూడా ఓ కారణమే. ప్రత్యేకించి శీతాకాలంలో వీచే చల్లగాలులు, మంచు వల్ల జుట్టు తేమను కోల్పోతుంది. అదే కర్లీ హెయిర్ అయితే మరిన్ని సమస్యలు..! ఇలాంటప్పుడు బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ ధరించడం, స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది. అదేవిధంగా ఈ చలికాలంలో కర్లీ హెయిర్‌ను కాపాడుకోవడానికి మరికొన్ని సహజసిద్ధమైన చిట్కాల్ని సైతం ప్రయత్నించచ్చు.
సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు నీరు తాగాలనిపించదు. కానీ రింగుల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజూ తగినంత నీటిని తాగే విషయంలో అశ్రద్ధ చేయకూడదు.
అలాగే కనీసం ఏడెనిమిది గంటలు ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రాధాన్యమివ్వాలి. తద్వారా ఒత్తిడి, ఆందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండచ్చు.
అప్పుడప్పుడూ కొన్ని చుక్కల హెయిర్ సీరంను రాసుకోవడం వల్ల కూడా కర్లీ హెయిర్‌ను సంరక్షించుకోవచ్చు.
రింగుల జుట్టు ఉన్న వారు ఎక్కువగా బాధపడేది చిట్లిన చివర్లతోనే! దానివల్ల కేశాలు నిర్జీవంగా కనిపిస్తాయి కూడా. కాబట్టి ప్రతి మూడు నెలలకోసారి చివర్లను కత్తిరిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు త్వరగా ఎదగడంతో పాటు ఆరోగ్యంగానూ ఉంటుంది.
జుట్టుకు తేమనందించడంలో కలబంద చక్కగా పని చేస్తుంది. కాబట్టి వారానికి రెండుసార్లు కలబంద గుజ్జును జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ఆపై 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
జుట్టు తేమను కోల్పోకుండా చేయడంలో తేనె పాత్ర కీలకం. అందుకే జుట్టుకు పోషణనందించే కండిషనర్లు, డీప్ కండిషనర్లతో పాటు క్లెన్సర్లలోనూ కాస్త తేనెను కలుపుకొని అప్లై చేసుకుంటే జుట్టు పొడిబారకుండా జాగ్రత్తపడచ్చు.