Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. నేటికీ కొంతమంది మహిళలు ఆర్థిక విషయాల్లో మాత్రం భర్తపైనో, తండ్రిపైనా ఆధారపడుతుంటారు. ఆర్థిక అంశాల పట్ల సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. మరికొంతమంది మహిళలు తాము సంపాదించిన మొత్తాన్ని పరిస్థితుల రీత్యా తమ భర్త చేతిలో పెట్టడం వల్ల చిన్న చిన్న అవసరాలకు కూడా వాళ్ల వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలా చేతినిండా సంపాదన ఉన్నా.. చాలామంది మహిళలు ఆర్థికంగా పురుషులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇకనైనా మేల్కొని ఈ ధోరణిని మార్చుకోకపోతే.. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే పెళ్లైనప్పటి నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమంటున్నారు. అవేంటో తెలుసుకుందాం...
కొంతమంది మహిళలు కుటుంబ పరిస్థితుల రీత్యా అప్పటిదాకా తాము చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. మరికొంతమంది సంపాదించాల్సిన అవసరం లేదంటూ ఈ నిర్ణయం తీసుకుంటుంటారు. ఈ రెండూ ఆర్థికంగా చేటు చేసే నిర్ణయాలే అంటున్నారు నిపుణులు. దీనివల్ల మొదట్లో బాగానే ఉన్నా భవిష్యత్తులో ప్రతి చిన్న అవసరానికీ భర్త మీదే ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి పెళ్లైనా ఉద్యోగం మానకపోవడమే ఉత్తమం. భవిష్యత్తులో ఒంటరిగా జీవించాల్సి వచ్చినా ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు.
అవగాహన పెంచుకోండి
ఆర్థిక విషయాలలో పెళ్లి కాక ముందు తండ్రిపై, పెళ్లయ్యాక భర్తపై ఆధారపడే అమ్మాయిలు ఈ కాలంలోనూ కొందరున్నారు. ఆర్జన వరకు బాగానే ఉన్నా డబ్బు పొదుపు విషయాల్లో అవగాహన లోపమే ఇందుకు కారణం. అయితే ఇలా ప్రతి చిన్న దానికీ వారిపైనే ఆధారపడడం వల్ల వాళ్లు అందుబాటులో లేనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి డబ్బుల్ని ఎందులో పొదుపు చేయాలి? లాభాలు ఆర్జించాలంటే వేటిలో పెట్టుబడులు పెట్టాలి? వంటి ప్రాథమిక విషయాలపై అవగాహన పెంచుకోవడం అత్యవసరం అంటున్నారు నిపుణులు. అలాగని ఒకేసారి అన్ని విషయాల గురించి తెలుసుకోవడం ఎవరి వల్లా సాధ్యం కాదు. కాబట్టి నిపుణుల సలహాలు పాటిస్తూ ఒక్కో విషయాన్ని అర్థం చేసుకుంటే ఆర్థిక విషయాల్లో మరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి రాదు.
మీకంటూ ఆస్తిపాస్తులు
మహిళలు ఉద్యోగం చేస్తున్నా ఆర్థిక పరమైన విషయాల్లో ఇంట్లోని మగవాళ్ల ఆధిపత్యమే ఎక్కువగా ఉంటోందని.. దానివల్ల పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు.. వంటి నిర్ణయాలను పురుషులే ఎక్కువగా తీసుకుంటున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ విషయంలో కొందరు మహిళలు సాటి స్త్రీలలో స్ఫూర్తి నింపుతున్నారని చెప్పాలి. రియల్ ఎస్టేట్, ఇతర ఆస్తుల కొనుగోళ్ల విషయంలో మహిళల శాతం క్రమంగా పెరుగుతున్నట్టు ఇటీవల వెల్లడైన పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. కాబట్టి మీరూ మీకంటూ స్థిరాస్తి ఏర్పరచుకోవడం మంచిది. మీ సంపాదనతో కొన్న ఆస్తుల్ని మీ పేరిటే రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల మీ కంటూ సొంత ఆస్తిపాస్తులు ఉన్నాయన్న ధీమా ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిలుదొక్కుకోగలరన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మహిళలు తప్పకుండా వైద్య బీమా చేయించుకోవాలి. ఇవి అనుకోని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా కాపాడతాయి. మీ అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులు.. ఏవైనా పత్రాలపై సంతకం చేయమని అడిగితే గుడ్డిగా చేసేయకండి. వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాతే చేయాలా, వద్దా నిర్ణయించుకోండి. ఒకవేళ ఆ పత్రాలు దేనికి సంబంధించినవో మీకు అవగాహన లేకపోతే నిపుణుల్ని సంప్రదించడంలో తప్పు లేదు. పెళ్లికి ముందు, తర్వాత మహిళలకు పుట్టింటి వారు, మెట్టినింటి వారి నుంచి వచ్చే బహుమతులు, కానుకలను స్త్రీధన్ అంటారు. అవి పెట్టుబడులు, స్థిరాస్తి, చరాస్తి, డబ్బు, బంగారం.. ఇలా ఏ రూపంలోనైనా ఉండచ్చు. వీటిని, వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరచుకోవడమూ చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి.