Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పని ఒత్తిడో... అల్పాహారమంటే చిన్నచూపో కానీ... చాలామంది పొద్దున్నే దాన్నే దాటేస్తుంటారు. కానీ అదే అతి ముఖ్యమైంది అంటారు పోషకాహార నిపుణులు. సులువుగా చేసుకోగలిగే, తినగలిగే అల్పాహారాలు ఏమున్నాయో వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుని ఎంచక్కా లాగించేయండి...
గుడ్లు: వ్యాధి కారకాలతో పోరాడే పోషకాలున్న సూపర్ ఫుడ్ ఇది. ఇదొక శక్తిమంతమైన అల్పాహారం. ఒక గుడ్డు నుంచి దాదాపు 7 గ్రాముల ప్రొటీన్, 75 కెలొరీల శక్తి లభిస్తాయి. ఆకుకూరలతో కలిపి ఆమ్లెట్‌గా, మఫిన్స్‌గా, కేవలం ఉడికించి... నచ్చిన విధంగా తప్పక తీసుకోండి మరి.
ఓట్స్: పీచుతో కూడిన వీటిని తీసుకుంటే పొట్ట నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. శరీరానికి కావాల్సిన పోషణా, శక్తీ కూడా అందుతాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీన్ని ఉప్మాలా చేసుకోవచ్చు. పిండిలో కలిపి దోసెలు, ఉతప్పం వంటివీ వేసుకోవచ్చు. ప్రాసెస్ చేయని ఓట్స్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి.
పండ్లు, పెరుగు: వీటి సమ్మేళనమే ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పొచ్చు. పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ను అంతం చేస్తాయి. పెరుగులోని ప్రొబయోటిక్స్, పీచు, పాలీఫినాల్స్ జీర్ణక్రియకు తోడ్పడతాయి. అంతేకాదు పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.
దోసెలు, ఇడ్లీలు: ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. ఇవి త్వరగా జీర్ణమవడమే కాకుండా రోగనిరోధక శక్తిని ఇస్తాయి. రుచి గానూ ఉంటాయి. ఈ పిండి పులవడం వల్ల వచ్చే ప్రొబయోటిక్స్;;క్యాన్సర్ నిరోధకంగానూ పని చేస్తాయి.