Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యమాలంటే అబ్బాయిలకే సాధ్యం... అమ్మాయిలు అంతగా బయటకు రాలేరు. పైగా బాధ్యతలు తీసుకోవడానికి వెనకాడతారు. ప్రతి దానికీ భయపడతారు... మహిళల పట్ల ఇలాంటి ఆలోచనలు ఇంకా మన సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇకపై వీటికి కాలం చెల్లిపోయింది అంటూ ఎంతో మంది మహిళా నాయకులు ముందుకు వస్తున్నారు. ఉద్యమాల హౌరులో ఆణిముత్యాల్లా వెలిగిపోతున్నారు. వారిలో సంగీత ఒకరు. ప్రస్తుతం ఎస్.ఎఫ్.ఐ అస్సాం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్నారు. ఇటీవల తమ సంఘ అఖిల భారత మహాసభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆమెతో మానవి సంభాషణ...
విద్యార్థి ఉద్యమంలోకి ఎలా వచ్చారు?
చిన్నప్పుడు మా అమ్మానాన్నతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. నాన్న డాక్టర్ అపూర్వ కుమార్ దాస్. అమ్మ గులాప్పీ దాస్, టీచర్‌గా చేసేవారు. వీళ్ళు కూడా ఎస్.ఎఫ్.ఐలో పని చేశారు. హైస్కూల్లో చదివేటపుడే ఎస్.ఎఫ్.ఐలో సభ్యత్వం తీసుకున్నాను. అప్పట్లో స్కూల్ కెప్టెన్‌గా ఉండేదాన్ని. సభ్యత్వం తీసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన రిసిట్ వెనుక వైపు సంఘం లక్ష్యాలు ఉండేవి. అవి నాకు బాగా నచ్చాయి. అందరికీ ఉచిత విద్య అందించాలనే డిమాండ్ నన్ను బాగా ఆకర్షించింది. ఇంటర్‌కి వచ్చే వరకు కమిటీల్లో లేకపోయినా సీనియర్ అక్క వాళ్ళతో కలిసి కార్యక్రమాలకు మాత్రం వెళ్ళేదాన్ని. డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా కేవలం కార్యక్రమాలకు మాత్రమే తీసుకెళ్ళేవారు. ఎలాంటి సమావేశాలకు నన్ను తీసుకుపోయేవారు కాదు. దాంతో కోపం వచ్చి నన్ను కార్యక్రమాలకు తప్ప సమావేశాలకు తీసుకుపోవడం లేదని, కమిటీలో పెట్టుకోవడం లేదని మా అమ్మ వాళ్ళకు కంప్లెయింట్ ఇచ్చాను. అప్పుడు ''నీకు కమిటీలో ఉండడం ఇష్టమేనే'' అని అడిగారు. వుంటానని చెప్పాను. అప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉన్నాను. నా సబ్జెక్ట్ సైన్స్. అందరితో కలిసి మహాసభలకు వెళ్ళాను. సైన్స్ కోర్సులో ఉన్న వాళ్ళు అక్కడకు చాలా మంది వచ్చారు. అంతకు ముందు వరకు సంఘాలంటే కేవలం ఆర్ట్స్ వాళ్ళే ఉంటారు అనే ఒక పొరపాటు ధోరణి ఉండేది. అక్కడకు వెళ్ళాక నా ఆలోచన మారిపోయింది. అప్పటి నుండి యాక్టివ్‌గా పని చేయడం మొదలుపెట్టాను. పోటీ పడి మరీ మా కాలేజీలో సభ్యత్వం చేసేదాన్ని.
మీ కాలేజీలో ఎస్.ఎఫ్.ఐకి అనుకూలమైన వాతావరణం ఉండేదా?
లేదు. సభ్యత్వ చేస్తుంటే మా ప్రిన్సిపల్ నన్ను కోప్పడేవారు. కాలేజీలోకి రాజకీయాలు ఎందుకు తీసుకొస్తున్నావు అనేవారు. సైన్స్ వాళ్లు మీరు చదువుకోవాలి ఇవన్నీ మీకు అవసరమా అనేవారు. కానీ నేను మాత్రం ఇవి రాజకీయాలు కాదు. విద్యార్థుల సమస్యలపై పని చేసే సంఘం అనేదాన్ని. పైగా స్టూడెంట్స్‌ను మేమేమీ సభ్యత్వం కోసం బలవంతం చేయడంలేదు. వాళ్ళ ఇష్ట ప్రకారమే తీసుకుంటున్నారు. ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముందని వాదించేదాన్ని. దాంతో ఏమీ అనేవారు కాదు.
మీరు చదివిన యూనివర్సిటీలో అనుభవాలు?
2010లో పీజీ కోసం గౌహతి యూనివర్సిటీలో చేరాను. నా ఉద్యమ జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. అక్కడ పని చేయడం చాలా కష్టంగా ఉండేది. అల్ అస్సాం స్టూడెండ్స్ యూనియన్(ఏఏఎస్యు) అని ఉండేది. వాళ్ళు బాగా డామినేట్ చేసేవారు. అంతా వాళ్ళ హవానే నడిచేది. ఎస్.ఎఫ్.ఐ మీటింగ్ జరుగుతుంటే వచ్చి వార్నింగ్ ఇచ్చేవారు. హాస్టల్‌కి వెళ్ళి బెదిరించేవారు. దాంతో కొంత మంది భయపడి వెళ్ళిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో పని చేశాం. అయితే మా క్లాస్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేసేవారు. సైన్స్ కోర్సు కాబట్టి నేను కార్యక్రమాల కోసం వెళ్ళినపుడు టెండెన్స్ విషయంలో కూడా హెల్ప్ చేసేవారు.
మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు?
2012లో మధురైలో జరిగిన ఎస్.ఎఫ్.ఐ ఆలిండియా మహాసభలకు ఆహ్వనితురాలిగా వెళ్ళాను. అది నా జీవితంలో చాలా మార్పు తీసుకొచ్చింది. అంతకు ముందే పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నాను. మధురై నుండి అటు నుండి అటే ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ అంతా బాగా జరిగింది. కానీ తర్వాత తెలిసింది. ఎవరికి సీటు ఇవ్వాలో ముందే నిర్ణయించుకున్నారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మా నాన్న ప్రమాదవశాత్తు చనిపోయారు. చాలా కుంగిపోయాను. ఆ సమయంలోనే పూర్తికాలం కార్యకర్తగా పని చేయాలని నిర్ణయించుకున్నాను. ముందు మా అమ్మ ఒప్పుకోలేదు. బాగా వ్యతిరేకించింది. ఉద్యోగం లేకపోతే ఎలా బతుకుతావు, తర్వాత నీ జీవితం ఏంటి అంటూ బాధపడింది. చావనైతే చావను కచ్చితంగా బతికే ఉంటాను'' అని సమాధానం చెప్పాను. దాంతో ఇక ఏమీ అనలేపోయింది. ఎస్.ఎఫ్.ఐలో పని చేస్తూనే కొంత కాలం ట్యూషన్లు చెప్పుకునేదాన్ని. డబ్బు కోసం ఇంట్లో అడగటం ఇష్టం లేదు. వాటితోనే నా అవసరాలు తీర్చుకునేదాన్ని. మిగిలిన డబ్బు ఎస్.ఎఫ్.ఐ కార్యక్రమాలకు వాడేదాన్ని. ఒక కోచింగ్ సెంటర్ కూడా ప్రారంభించాను. ఇందులో ఎక్కువ మంది ఎస్.ఎఫ్.ఐ వాళ్ళే ఉండేవారు. కానీ ఇటు ఉద్యమాలు, అటు కోచింగ్ సెంటర్ సమయం సరిపోయేది కాదు. దాంతో దాన్ని వెరే వాళ్ళకు ఇచ్చేసి పూర్తిగా ఎస్.ఎఫ్.ఐకే సమయం కేటాయించేదాన్ని. అస్సాంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మూడో స్థానంలో వచ్చాము. ఈ సమయంలో ప్రజల్లో తిరుగుతూ చాలా నేర్చుకునే అవకాశం వచ్చింది.
ప్రస్తుతం మీ రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి ఏంటి?
2016లో రాష్ట్రంలో చాలా మార్పు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్లిపోయారు. విద్యా రంగంలో కూడా చాలా మార్పు వచ్చింది. స్కాలర్ షిప్‌లు తగ్గిపోయాయి. మహిళలపై వివక్ష, దాడులు పెరిగిపోయాయి. జోర్హాత్ జిల్లాలో సుబ్బలక్ష్మి అనే అమ్మాయి ఉండేది. హాస్టల్‌కి వెళుతుంటే అబ్బాయిలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ రాత్రి అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఆమె ఒక రచయిత. దాంతో చాలా మంది ఆ పోస్ట్‌ను షేర్ చేశారు. సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయ్యింది. అప్పుడు ఎస్.ఎఫ్.ఐగా దీనిపై పెద్ద పోరాటం చేశాము. స్టాండ్ విత్ సుబ్బలక్ష్మి అనే నినాదంతో ఉద్యమం మొదలుపెట్టాము. అన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులను సమీకరించాము. అనేక కమిటీలు ఏర్పాటు చేసి వారిని ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చాము. ఫలితంగా వీధి లైట్లు వచ్చాయి. నగర శివార్లలో, హాస్టల్స్ దగ్గర, కాలేజీల దగ్గర సెక్యురిటీ పెట్టారు. యూనివర్సిటీలో ఈ ఉద్యమం బాగా జరిగింది. అమ్మాయిల్లో కాస్త ధైర్యం వచ్చింది. వారి సమస్యలను బయటకు వచ్చి చెప్పుకోవాలనే ఆలోచన వచ్చింది. తమకు ఏదైనా సమస్య వస్తే ఎస్.ఎఫ్.ఐ అండగా ఉంటుంది అనే నమ్మకం వారికి వచ్చింది. తర్వాత కూడా అనేక ఉద్యమాలు చేశాం. నాపైన మూడు కేసులు కూడా పెట్టారు.
అమ్మాయిలు ఉద్యమాల్లో రావడానికి సిద్ధంగా ఉన్నారా?
ఉన్నారు. అయితే అనేక సమస్యల ఉన్నాయి. ముందు వాళ్ళకు నమ్మకం కల్పించాలి. అందుకే మేము అమ్మాయిలకు ప్రత్యేకంగా సబ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. ఈ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయాలి. వాళ్ళల్లో నాయకులు తయారు చేయాలి. మాకు అక్కడికి వెళితే రక్షణ ఉంటుంది, ధైర్యం వస్తుంది అనే నమ్మకం కల్పించాలి. ఆ నమ్మకాన్ని ఎస్.ఎఫ్.ఐ వాళ్ళకు ఇవ్వాలి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షకార్యదర్శులుగా, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా అమ్మాయిలు వస్తున్నారు. బాధ్యతలు తీసుకుంటున్నారు. ఎంతో చురుగ్గా పని చేస్తున్నారు. కాబట్టి అవకాశాలు ఇస్తే కచ్చితంగా తామేంటో నిరూపించుకునే శక్తి అమ్మాయిలకు ఉంది. అయితే సమాజ ప్రభావం అందరిపైనా ఉంటుంది. అలాగే పురుషాధిక్య భావజాలం మాలోపల కూడా ఉంటుంది. వాటి నుండి బయటపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో విషయం అమ్మాయిలను అమ్మాయిలే తీసుకురావాలి అనే ఆలోచన వుంది. ఇది సరైనది కాదు. కమిటీ మొత్తం దానిపై కృషి చేయాలి. బాధ్యత తీసుకోవాలి.
మీకు నచ్చిన నాయకులు?
నచ్చిన నాయకులంటే ఇద్దరు ఉన్నారు. ఫిడేల్ కాస్ట్రో, భగత్‌సింగ్. వీరు నా స్ఫూర్తిదాయక నాయకులు. అలాగే ఇక్కడకు వచ్చిన తర్వాత మల్లు స్వరాజ్యం గారి జీవితం గురించి తెలుసుకున్నాను. చాలా స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం ఆమెది. ఆమె గురించి వింటుంటే చాలా గర్వంగా అనిపించింది.
ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం విద్యార్థుల ఆలోచనా ధోరణి ఎలా ఉందంటారు?
నేటి విద్యార్థులు చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. క్రియేటివిటీగా ఉంటున్నారు. కొత్త కొత్త నినాదాలు సృష్టిస్తున్నారు. చక్కటి ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఎస్.ఎఫ్.ఐలోకి కూడా అలాంటి క్వాలిటీ నాయకులు వస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది.
మీ జీవిత భాగస్వామి గురించి చెప్పండి?
నా సహచరుడు నిరంకుశ్. ప్రస్తుతం డివైఎఫ్‌ఐలో ఉన్నారు. అంతకు ముందు ఎస్.ఎఫ్.ఐలో పని చేశాడు. అతను లా చేశాడు. మాది ప్రేమ వివాహం.
మీ పెండ్లికి పెద్దలు ఒప్పుకున్నారా?
ఒప్పుకున్నారు. అయితే ఓ సంఘటన జరిగింది. పెండ్లి రోజు భర్త కాళ్ళు భార్య పట్టుకోవాలి. నేను పట్టుకోనని చెప్పాను. దాంతో వాళ్ళ బంధువులు కాస్త ఫీలయ్యారు. దీని గురించి చర్చ కూడా జరిగింది. కాని నేను మాత్రం ఆ పని చెయ్యలేదు. తర్వాత వాళ్ళే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నాతో చాలా అభిమానంగా, ప్రేమగా ఉంటారు. అతని తల్లిదండ్రులు మాత్రం ప్రోగ్రెసివ్‌గా ఉంటారు.
మీ భవిష్యత్ లక్ష్యాలు?
పూర్తికాలం కార్యకర్తగా ఉద్యమాల్లో కొనసాగాలి. లింగ వివక్షపై పని చేయాలి. సమానత్వం సాధించడం కోసం నా వంతు ప్రయత్నం చేయాలి. విద్య, వైద్యం అందరికీ అందేలా చూడాలి. మా కలలను నిజం చేసుకోవాలి. అయితే ఈ దారి అంత సులభమేమీ కాదు. మేము జీవించి ఉన్నప్పుడు మా కల నిజం కాకపోవచ్చు. మా తర్వాత తరాల వారైనా సుఖమైన జీవితం గడిపేందుకు అవసరమైన మార్గం వేయాలి. అయితే ఇవన్నీ ఒంటరిగా చేయలేం. అందరినీ కలుపుకొని ఉద్యమాలు చేయాలి. ఐకమత్యంతో సమానత్వం సాధించాలి.
- సలీమ
ఫొటోలు :హరి