Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. అందుకు కారణం అనారోగ్యకరమైన జీవనశైలే అని చెప్పడంలో సందేహం లేదు. కేవలం మగవారిలోనే కాదు.. ఆడవారిలోనూ ఇలాంటి సమస్యలొస్తున్నాయి. అందుకు మహిళల్లో తలెత్తే పీసీఓఎస్, నెలసరి క్రమంగా రాకపోవడం.. వంటి వివిధ ప్రత్యుత్పత్తి సమస్యలు కూడా ఓ కారణమే అంటున్నారు నిపుణులు.
ప్రస్తుతం చాలామంది ఆడవారు ఎదుర్కొంటోన్న సమస్యల్లో ఇర్రెగ్యులర్ పిరియడ్స్ కూడా ఒకటి. అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి-ఆందోళనలు.. వంటివన్నీ ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అయితే దీని కారణంగా గర్భం ధరించడంలో సమస్యలు తలెత్తడం, బరువు పెరిగిపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. దీనికి తోడు సక్రమంగా నెలసరి రాకపోవడం వల్ల దీర్ఘకాలంలో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. అందుకే ఇర్రెగ్యులర్ పిరియడ్స్తో బాధపడే మహిళలు గుండెకు సంబంధించి ఏవైనా సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకోవాలి.
ఇటీవల పీసీఓఎస్ బారిన పడే మహిళల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీని కారణంగా శరీరంలో ఆండ్రోజెన్స్ (పురుష హార్మోన్ల) స్థాయులు పెరిగిపోతాయి. తద్వారా నెలసరి క్రమం తప్పడం, అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం, హైపర్టెన్షన్.. వంటి సమస్యలన్నీ మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇలా ఈ అనారోగ్యాలు క్రమంగా గుండె ఆరోగ్యాన్నీ దెబ్బతీసే అవకాశం ఎక్కువ. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా మేరకు సరైన మందులు వాడడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, జీవన శైలి ద్వారా పీసీఓఎస్ను అదుపు చేసుకోవడం అత్యవసరమం.