Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొలకెత్తిన విత్తనాలు తింటే ఎన్నో పోషకాలు లభిస్తాయని నిపుణుల సూచన. అయితే మొలకలు తినడానికి కొందరు ఇష్టపడరు. అలాంటి వారు మొలకలను నేరుగా తినకుండా రుచికరమైన పదార్థాలను వండుకుని తింటే చాలా బాగుంటుంది. అందుకే ఈరోజు మొలకతో చేసిన కొన్ని రకాల వంటల గురించి తెలుసుకుందాం. ఒక సారి మీరూ ట్రై చేసి చూడండి.
శనగ మొలకల వడ
కావల్సిన పదార్థాలు: శనగ మొలకలు - పావు కిలో, బియ్యంపిండి - అరకప్పు, ఉల్లిగడ్డ - రెండు, పచ్చిమిర్చి - మూడు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీస్పూన్లు, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు - కొన్ని, ఉప్పు, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం: ఉల్లిగడ్డ సన్నగా తరగాలి. శనగ మొలకలు, పచ్చిమిర్చి, కారం, మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. దీనికి ఉల్లి ముక్కలు, బియ్యంపిండి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు కలపాలి. బాండీలో నూనె వేడిచేసి ఈ పిండిని చిన్న ముద్దలు తీసుకుని వడల్లా వేసి వేయించుకోవాలి.
మొలకల చట్నీ
కావల్సిన పదార్థాలు: పెసర మొలకలు - కప్పు, వెల్లుల్లి - రెండు రెబ్బలు, చింతపండు - నిమ్మకాయంత, అల్లం - చిన్న ముక్క, ఉల్లిగడ్డ - ఒకటి, కందిపప్పు - మూడు టీస్పూన్లు, ధనియాలు - టీస్పూను, పండు మిర్చి - నాలుగు, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం: ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి సన్నగా తరగాలి. బాండీలో నూనె వేడి చేసి కందిపప్పు, ధనియాలు, పండు మిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కనుంచాలి. బాండీలో మిగిలిన నూనెలో తరిగిన వెల్లుల్లి, ఉల్లి, అల్లం ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే బాండీలో మొలకలు వేసి దోరగా వేయించి తీయాలి. అన్నీ చల్లారాక మొదట కందిపప్పు, ధనియాలు, పండు మిర్చి, కరివేపాకు, చింతపండు, ఉప్పు మిక్సీలో వేసి తిప్పాలి. తర్వాత వెల్లులి, అల్లం, ఉల్లి మిశ్రమం వేసి తిప్పాలి. చివర్లో మొలకలు వేసి పలుకగా మారాక తీసి వేడి అన్నంతో తినాలి.
మొలకల సలాడ్
కావల్సిన పదార్థాలు: పెసర మొలకలు - అర కిలో, ఉల్లిగడ్డ - ఒకటి, టమోట - ఒకటి (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి - ఒకటి (సన్నగా తరగాలి), కారం - పావు టీస్పూను, చాట్ మసాలా -టీస్పూను, నిమ్మరసం - టీ స్పూను, ఆలూ లేదా మోరంగడ్డ - ఒకటి (ఉడికించాలి), కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: మొలకల్ని నీళ్లతో కడగాలి. నీళ్లు చేర్చి ఉడకబెట్టాలి. వీటికి నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర కూడా చేర్చి కలిపి సర్వ్ చేయాలి.
చపాతి
కావల్సిన పదార్థాలు: పెసర మొలకలు - కప్పు, గోధుమపిండి - రెండు కప్పులు, పనీర్ తురుము - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, వెల్లుల్లి - మూడు రెబ్బలు, ఉప్పు, నెయ్యి, నూనె - తగినంత.
తయారు చేసే విధానం: గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, నీళ్లు చేర్చి పిండిని ముద్దగా కలిపి పెట్టుకోవాలి. మొలకల్ని ఉడికించి పలుకుగా రుబ్బి పక్కనుంచాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. పాన్లో నూనె వేడిచేసి అల్లం, వెల్లుల్లి, పేస్ట్ వేసి వేయించి మొలకల ముద్ద, పనీర్, ఉప్పు వేసి కలిపి పొయ్యి నుంచి దింపాలి. తర్వాత పిండితో చపాతీలు ఒత్తుకోవాలి. రెండు చపాతీల మధ్య చేసి పెట్టుకున్న మొలకల మిశ్రమం ఉంచి అంచులు మూసేయాలి. పెనం మీద నూనె వేసి ఈ చపాతీలు రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేయాలి.