Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలానుగుణంగా సమాజంలో ఎన్నో మార్పులు... రోజు రోజుకీ ఆధునికంగా మనమెంతో అభివృద్ధి చెందుతున్నాం. అయినా ఆడపిల్లల పట్ల వివక్ష, వారిపై అన్యాయాలు ఇప్పటికీ అనాగరికంగా కొనసాగుతూనే ఉన్నాయి. గర్భంలో ఆడపుట్టుక జీవం పోసుకుందని తెలిసిన మరుక్షణమే ఓ భ్రూణహత్య పురుడు పోసుకుంటోంది. ఆడపిల్లలను అక్షరానికి దూరం చేసి వారి ఎదుగుదలను ప్రశ్నార్థకంగా మార్చబడుతోంది. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేసి ఏదో విధంగా వారిని వదిలించుకునే ప్రయత్నాలు మానడం లేదు. ఎందరో ఆడపిల్లలు పుట్టగానే చెత్తకుప్పల పాలవుతున్నారు. నిత్యం ఇటువంటి పరిస్థితులకు బలవుతున్న ఎందరో అమాయకపు ఆడబిడ్డల గాధలనే తన కలం ద్వారా అక్షరీకరిస్తున్నారు. ఆ అక్షరాల మూటను తన మొదటి నవల రూపుదిద్దారు వర్ధమాన యువ రచయిత్రి స్ఫూర్తి కందివనం. ఆమె పరిచయం నేటి మానవిలో...
మీ కుటుంబ నేపథ్యం?
నా స్వస్థలం మహబూబ్ నగర్. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా అక్కడే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాను. మా నాన్న కందివనం రఘురామయ్య, పాత్రికేయ వృత్తి. అనేక పత్రికల్లో పని చేశారు. మా అమ్మ వరలక్ష్మి, విశ్రాంత ఉపాధ్యాయురాలు. నాకు అక్క, తముడు ఉన్నారు. నా సహచరుడు నరేంద్రకుమార్ థాయిలాండ్ సురనరీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. మాకు హైదరాబాద్‌లో సొంతంగా 'యువ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్' అనే స్టార్ట్ అప్ కంపెనీ కూడా ఉంది. మా ఇంట్లో మా తాతయ్య, మా నాన్న ఇద్దరూ పుస్తక ప్రియులే. నాన్న గదంతా జర్నలిజం, రాజకీయం, వివిధ ప్రాంతాల చరిత్ర పుస్తకాలు ముఖ్యంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలే ఎక్కువగా కనిపించేవి. వాటితో పాటు ఇంగ్లీష్, తెలుగు నవలలు, కథలు, కవిత్వం పుస్తకాలు కూడా ఉండేవి. తాతయ్య దగ్గర వందలకొద్ది ఆధ్యాత్మిక పుస్తకాలు ఉండేవి. ఇంట్లో హాల్ నిండా తాతయ్య పుస్తకాలే. వీళ్లిద్దరి చేతుల్లో ఎప్పుడూ పుస్తకమో, వార్తా పత్రికనో ఎదో ఒకటి కచ్చితంగా ఉండేవి. పుస్తక పఠనం మీద వాళ్లకున్న అంకిత భావం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరిచేది. అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళ పుస్తకాలను పూర్తిగా చదవకున్నా పైపైన అలా తిరగేసేదాన్ని. కానీ వాళ్ళలా సీరియస్‌గా పుస్తకం పట్టింది లేదు. నాన్న వార్తలు రాసేటప్పుడు 'ఎలా ఇలా రాయగలుగుతున్నారు' అని రాసేంతసేపూ ఆత్రంగా ఆయన్నే గమనిస్తూ ఉండేదాన్ని. బహుశా అందుకేనేమో నాకు తెలీకుండానే ఎక్కడో సాహిత్యం, రాయడం అనే వాటి పట్ల ప్రభావితమయ్యాను. కానీ అది నా నుండి బయటపడటానికి ఇన్నేళ్ళ సమయం పట్టి మొత్తానికి 201 లో నేను సాహిత్య రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది.
రచనలు ఎప్పుడు ప్రారంభించారు?
ఇందాక చెప్పినట్టు ఈ విషయంలో నాన్న ప్రభావం నాపై కొంతైతే, నేను ఉద్యోగం చేసేటప్పుడు నా కొలీగ్స్‌లో ఇద్దరు ఇంగ్లీష్ నవలలు బాగా చదివేవాళ్ళు. వాళ్లిద్దరూ తరచూ వాటి గురించే చర్చించేవాళ్ళు. ఒకసారి వాళ్ళ దగ్గరున్న పుస్తకాలు రెండు మూడు ఇంటికి తెచ్చుకున్నాను. కానీ రెండ్రోజుల్లో వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. పూర్తిగా చదవలేకపోయా. కాస్త నిరాశగానే వాళ్ళ పుస్తకాలు వాళ్ళకి తిరిగి ఇచ్చేశాను. అది గమనించిన మా వారు చేతన్ భగత్ నవలతో పాటు మరో రెండు పుస్తకాలు గిఫ్ట్‌గా ఇచ్చారు. అవి చదివాక నేను కూడా నవలలు రాసి ఎలాగైనా నా రచనను కూడా పుస్తకంగా తీసుకురావాలని ఆ రోజే ఫిక్సయ్యాను. ఆ విధంగా 2019లో సాహిత్య రంగంలోకి అడుగుపెట్టాను. తొలి రోజుల్లో ఓ సెల్ఫ్ పబ్లిషింగ్ ప్లాట్ఫారంలో రాసేదాన్ని. మొదట ఇంగ్లీష్‌లో చిన్న చిన్న రైటప్స్, కొన్ని కథలు రాశాను. ఒక సిరీస్ కూడా మొదలు పెట్టి పూర్తిచేయలేక వదిలేశాను. ఆ తర్వాత తెలుగులో రాయడం మొదలుపెట్టి వెంట వెంటనే రెండు నవలలు, ముప్పైదాక కథలు రాశాను. ఈ మధ్యే మరో నవల రాశాను. నా మొదటి నవల 'చైత్ర'ను పుస్తకంగా వెలువరించాను. రాయడం మొదలుపెట్టిన కొత్తలో దూకుడుగా రాసేదాన్ని. కానీ ఇప్పుడు ఆ దూకుడుని తగ్గించి ఏది పడితే అది రాసేయకుండ బాగా ఆలోచించి తగిన సమయం తీసుకొని కథాంశాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని రాస్తున్నాను.
మీకు స్ఫూర్తి నిచ్చిన అంశాలు?
మాములుగా ఎవరైనా ఏదైనా సంఘటనను గురించి విన్నప్పుడో లేదా నేరుగా చూసినప్పుడో, అది బాధైనా, సంతోషమైనా ఒకటి రెండు రోజులు దాని గురించి ఆలోచించి, ఆ తర్వాత మర్చిపొడమో, వదిలేయడమో చేస్తుంటారు. కానీ అటువంటి వాటికి చలించి, తన మెదడులో బలంగా రేగే ఆలోచనలు, మనసులో పడే సంఘర్షణలతో సతమతమయ్యి, తనలోతానే పడే వేదనను అక్షరాలుగా మలిచేవాడే రచయిత. బడుగు బలహీన వర్గాల నిస్సహాయత, వారి పట్ల అసమానతలు, కుల మత విద్వేషాలు, మహిళల పట్ల జరిగే అన్యాయాలు, ఆకృత్యాలు, పితృస్వామ్య భావజాలం, ప్రస్తుతం సమాజంలో మనం చూస్తున్న వింత పోకడాలు వికృత చేష్టలు వంటి అనేక అంశాలు నన్ను ఎక్కువశాతం ప్రభావితం చేసే అంశాలు. అటువంటి సమస్యలను, పరిస్థితులను ఎదురుకుంటూ పోరాడే వాళ్ళు, పోరాడలేక నిస్సహాయంగా మిగిలిపోయిన వారి జీవితాలే నా కథలకు ప్రేరణ.
సాహిత్యంలో మహిళల పాత్రపై మీ అభిప్రాయం?
తొలి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్కతో మొదలుపెడితే ఇప్పటి కవయిత్రులు, రచయిత్రుల వరకు చెప్పాలంటే ఇది కాస్త పెద్ద టాపికే. దీన్ని లోతుగా విశ్లేషించి చెప్పగలిగేంత అనుభవం గాని, అవగాహన గాని నాకు లేదు. కాకపోతే ప్రస్తుతం రాస్తున్న కవయిత్రులు, రచయిత్రులు ముఖ్యంగా యువత మూస ధోరణి రచనలు కాకుండా ప్రస్తుతం సమాజ స్థితిగతులపై ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తూ వాళ్ళు చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా, నిక్కచ్చిగా, నిర్భయంగా వాళ్ళ రచనల్లో ప్రెసెంట్ చేస్తుండడం గమనించాను. ఇది నిజంగా మంచి పరిణామం. అయితే ఇక్కడ సమస్యల్లా కొన్నిసార్లు అలా రాయడం వల్ల ఫలానా రచయిత్రి పట్ల వ్యక్తిగతంగానూ ఆమె పైన ఒక నెగటివ్ ఇంప్రెషన్ డెవలప్ అవుతూంటుంది పాఠకులకు. అటువంటి పరిస్థితులను ఎదురుకున్నా వారి అభిప్రాయాల పట్ల స్థిరంగా వ్యవహరించే రచయిత్రులను మెచ్చుకోవాల్సిందే. నిజం చెప్పాలంటే కొన్ని బోల్డ్‌గా రాసే కథల్లో అవి ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నవే అయినా ఒక బౌండరీలో ఉండిపోయిన మన ఆలోచనా విధానం వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండదు. మనము విధించుకున్న ఆ బౌండరీని దాటి చూస్తే తప్ప అందులోని సారాన్ని గ్రహించలేరు పాఠకులు.
మీ రచనల గురించి చెప్పండి?
తెలుగులో ఇప్పటివరకు ముప్పైకి పైగా కథలు, 3 నవలలు రాశాను. నా మొదటి నవల 'చైత్ర'ను 2020లో పుస్తకంగా వెలువరించాను. ఈ నవలకు ఇటీవలే 'తెలంగాణ సారస్వత పరిషత్తు యువ పురస్కారం' మరియు 'అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ప్రథమ నవలా పురస్కారం' అందుకున్నాను. ఈ ఆధునిక యుగంలో కూడా ఇంకా ఆడపిల్లల పట్ల జరుగుతున్న వివక్ష, అసమానతలు వంటి అంశాలను ఎత్తిచూపుతూనే, ఒక ఆడపిల్లకు సరైన ప్రోత్సాహం లభిస్తే ఏదైనా సాధించగలదన్న విషయాన్ని ఓ సైనికురాలి పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. అదే విధంగా ఇండియన్ ఆర్మీలో మహిళల పాత్ర, శిక్షణా సమయంలో, విధులను నిర్వహించే క్రమంలో మగవాళ్లకు సమానంగా వాళ్ళు ఎదురుకునే సవాళ్ళను కూడా చూపించే ప్రయత్నం చేశాను. మన మహిళా ఆర్మీ ఆఫీసుర్లు మితాలి మధుమిత, ప్రియ జింగన్, దివ్య అజిత్ కుమార్, భావన కస్తూరి వంటి అనేక మంది వీరనారులే నా నవలలోని కథానాయిక పాత్రకు ప్రేరణ. ఈ నవలను పుస్తకంగా తీసుకొచ్చే క్రమంలో ముందుగా నవలను చదివి, వారి అభిప్రాయాలను పంచుకుని, తగిన సలహాలు సూచనలు ఇచ్చి నన్ను ప్రోత్సహించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ గారికి, అలాగే రచయిత శ్రీచరణ్ మిత్ర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కథల విషయానికొస్తే... నేను మొదటిసారి పత్రికలకు రాసిన కథలు చీకటి వెలుగులు, నాయిన చెప్పిన అబద్ధం, నేను...మీ..! వరుసగా నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం వారి కథ 2020, ఈనాడు కథా విజయం 2020, అరసం యువ కథా పురస్కారం 2021 పోటీల్లో బహుమతులు అందుకోడమే కాకుండా నేననే ఒక రచయిత్రిని ఉన్నానని నన్ను ప్రపంచానికి పరిచయం చేశాయి. 'డిమ్కి' కథకు నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం వారి కథ 2021 పోటీలో ప్రథమ బహుమతి అందుకోడం మర్చిపోలేని అనుభూతి. కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఆధునీకీకరణ, జానపద కళాకారుల జీవితాలను ఛిద్రం చేయడంతో పాటు, సమున్నత కళారూపాల ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చింది. తరతరాలుగా కూడు పెట్టిన కళారూపం నేడు ఆకలి దప్పులనే మిగిలిస్తున్నప్పటికీ, అటు టెక్నాలజీతో పోటీ పడలేక, ఇటు కులవృత్తులను వదిలి ప్రత్యామ్నాయ బ్రతుకు తెరువులను ఎంచుకోలేక కొట్టుమిట్టాడుతున్న వారిలో బుడిగె జంగాలు కూడా ఒకరు. వారి దయనీయ గాథను ఈ కథ ద్వారా పాఠకుల ముందుంచే ప్రయత్నం చేశాను. ఈ కథ అత్యంత పాఠకాదరణ పొందడమే కాకుండా, ఎందరో మన్ననలు పొందింది. సాహిత్యంలో నాకు ఈ కథ ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.
మీకు ప్రేరణ ఎవరు?
వ్యక్తిగతంగా అయితే చాలా విషయాల్లో నాకు మా నాన్నే ప్రేరణ. సాహిత్యంలో అయితే.. మొదటినుండి నవలా రచనపై ఉన్న అభిలాషతోనే సాహిత్యంలోకి అడుగుపెట్టిన నాకు, నేను చదివిన వాళ్ళల్లో అంపశయ్య నవీన్, పెద్దింటి అశోక్ కుమార్, కేశవరెడ్డి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, సయ్యద్ సలీం, యద్దనపూడి సులోచనారాణి, కె.ఎన్ మల్లీశ్వరి, గీతాంజలి, అంగులూరి అంజనీదేవి వంటి వారి నవలలు నిత్య ప్రేరణలు. నాకు పరిచయం లేని సాహిత్య ప్రపంచంలో ఎటు నడవాలో తెలియని గజిబిజి దారిలో అడుగులేస్తున్న నాకు వీరి రచనలు ఒక సరైన మార్గాన్ని చూపించాయి. ప్రస్తుతం ఎటువంటి రచనలు అవసరమో ఒక అవగాహనకు రాగలిగాను.
సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందా? దీనిపై మీ అభిప్రాయం?
కచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కథలు, నవలలు చదివి తమ సమస్యకు పరిష్కారం వెతుక్కునే వాళ్లు కొందరైతే, ఆ పాత్రలలో తమని చూసుకుని ఎమోషనల్ అయ్యే వాళ్ళు కొందరు. తెలియని విషయాలను గురించి తెలుసుకునేవాళ్ళు కొందరైతే, తెలిసిన విషయాన్నే వాళ్లకు తెలియని కొత్త కోణంలో తెలుసుకుని వాళ్ళ ఆలోచనా ధోరణిని మార్చుకునేవాళ్ళు కొందరు. అటువంటి మార్పులు తీసుకొచ్చిన కథలు, నవలలు ఎన్నో ఉన్నాయి.; నా 'డిమ్కి' కథ చదివి ఒక పాఠకుడు 'ఇన్నిరోజులు ఇంటి ముందు నిలబడి డబ్బులు అడిగే బుర్ర కథలు చెప్పేవాళ్లను చూసి చిరాకు పడేవాడిని. కానీ మీ కథ చదివాక వారి పట్ల నా ప్రవర్తనకు గిల్టీగా ఫీలవుతున్నాను. ఇకపై అలా ఉండను' అంటూ మెసేజ్ చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. మనం రాసే రచన మొత్తం సమాజాన్నే మార్చేయలేకపోవొచ్చేమో కానీ ఏ ఒక్కరిలోనైనా కనీసం ఒక ఆలోచనను రేకెత్తించగలితే మన రచన సక్సెస్ అయినట్లే. ప్రతి రచయిత కోరుకునేది కూడా అదే. ఆ దిశగానే రాసే ప్రయత్నం చేస్తుంటారు ఏ రచయితైనా.
- తలారి శ్రీనివాసరావు,
ఓయూ రిపోర్టర్, నవతెలంగాణ