Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది ఏదో అర్జంటు పని ఉందన్నట్టు చాలా వేగంగా, తక్కువ సమయంలోనే భోజనం చేస్తుంటారు. దీనికి నిజంగానే తగినంత సమయం లేకపోవడం ఓ కారణమైతే వేగంగా తినే అలవాటు కూడా ఇలా చేయడానికి మరో కారణం అయి ఉండచ్చు. అయితే ఇలా చేయడం మన ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవకపోవడమే కాకుండా ఇతర సమస్యలకు సైతం కారణమవుతుందని వివరిస్తున్నారు. కాబట్టి ఆహారాన్ని పూర్తిగా నమిలి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? అలా చేయకపోతే.. మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో చూద్దాం...
మనం ఎంత తక్కువ సమయంలో ఆహారాన్ని తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువగా బరువు పెరిగే అవకాశాలుంటాయి. అందుకే బరువు తగ్గాలనుకొనేవారికి నిపుణులు ఆహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినమని సూచిస్తుంటారు. వేగంగా, నమలకుండా తినేయడం వల్ల సరిపడినంత ఆహారం తిన్నామన్న భావన కలగదు. దీంతో మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాం. ఫలితంగా శరీర బరువు కూడా పెరిగిపోతుంది. అదే నిదానంగా.. ఆహారాన్ని బాగా నమిలి మింగడం ద్వారా అదనంగా ఆహారాన్ని తీసుకునే వీలుండదు. ఫలితంగా బరువు పెరిగే అవకాశం కూడా తక్కువే.
ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల అది పూర్తిగా జీర్ణమై దానిలోని పోషకాలన్నీ శరీరానికి సక్రమంగా అందుతాయి. మన లాలాజలంలో ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైములు ఉంటాయి. అవి ఆహారంతో కలవడం వల్ల అది తక్కువ సమయంలోనే జీర్ణమైపోతుంది. అలాగే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదురవకుండా ఉంటాయి. చాలా వేగంగా ఆహారాన్ని తీసుకొనేటప్పుడు దాన్ని సరిగ్గా నమిలే వీలుండదు. దీంతో అది జీర్ణమవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు కూడా. దీని కారణంగా శరీరానికి పోషకాలు సరిగ్గా అందవు. అలాగే ఇలాంటి సరిగ్గా నమలని ఆహారం కారణంగా జీర్ణాశయంలో హానికారక బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల కడుపుబ్బరంగా అనిపించడం, నొప్పి రావడం, మలబద్ధకం సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఆహారాన్ని బాగా నమిలి మింగడం మంచిది.
మనం ఆహారాన్ని ఎంత ఎక్కువగా నమిలితే మన దంతాలకు అంత ఎక్కువగా మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. నమలడం వల్ల దవడలకు మంచి వ్యాయామం దొరుకుతుంది. ఆహారాన్ని నమిలేటప్పుడు వెలువడే లాలాజలం దంతాలకు హాని చేసే బ్యాక్టీరియాను నాశనం చేసి దంతక్షయాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా నమలడం వల్ల ఆహారం రుచిని ఆస్వాదించడానికి సైతం వీలు కలుగుతుంది.
మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి ఎంతసేపు నమలాలనే విషయం ఆధారపడి ఉంటుంది. పండ్లు, కూరగాయలు వంటి వాటిని ఐదు నుంచి పదిసార్లు నమిలితే సరిపోతుంది. అదే చికెన్, మటన్ వంటి వాటినైతే.. మరికాస్త ఎక్కువ సమయం నమలాల్సి ఉంటుంది. అలాగే ఆహారాన్ని నమిలే విధానం కూడా ముఖ్యమే. నెమ్మదిగా ఆహారం పూర్తిగా ద్రవరూపంలోకి మారేంత వరకూ నమలాలి. దాన్ని పూర్తిగా మింగిన తర్వాతే ఆ తర్వాత ముద్ద తినడం ప్రారంభించాలి.