Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీహార్ రాష్ట్రంలోని మైథిలి అనే ఒక కుగ్రామంలో ఉద్భవించింది 'మధుబని ఆర్ట్'. భారతీయ సంప్రదాయ కళారూపాలలో మధుబని ఆర్ట్ ఒకటి. ఈ కళ మైథిలి గ్రామం నుంచి పుట్టటం వల్ల దీనిని మైథిలి ఆర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ పెయింటింగును 'మిథిలా పెయింటింగ్స్' అంటారు. గ్రామాల్లోని మహిళలు తమ మనసులోని ఆలోచనలను ఊహాలను గోడలపై చిత్రాలుగా గీస్తారు. పండుగలు, శుభకార్యాలు వంటి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక ఇతివృత్తాలను ఎంచుకొని తమ కలలకు ప్రతీకలుగా చిత్రిస్తారు. మధుబని అంటే 'తేనె అడవి' అని అర్థం. మధుబని అనే పట్టణం బీహార్ రాష్ట్రంలోని దర్భంగా డివిజన్ పరిధిలో ఉంటుంది. ఈ కళలో సూర్యుడు, చంద్రుడు, తాబేళ్ళు, తామర పువ్వులు వంటి వాటిని చిహ్నాలుగా ఉపయోగిస్తారు. వీటికి వేసే రంగులు కూడా ప్రకృతి నుంచి సేకరించినవే వేస్తారు. మొక్కల నుంచి తీసుకున్న రంగులను గోడల మీద చిత్రాలకు వాడేవారు. మధుబని ఆర్ట్‌లో నెమలి బొమ్మ ఎలా అందాలు సంతరించుకుంటూందో చూద్దాం.
ఈ ఆర్ట్ మాత్రం మా అమ్మా వాళ్ళకు రాదు. కాబట్టి ఎవ్వరూ నేర్పలేదు. నేను పెద్దయ్యాకే ప్రయత్నించి చూశాను. నేను బీహార్‌లోని పాట్నా వెళ్ళాను గానీ అక్కడ క్రాఫ్ట్స్ షాపుకు వెళ్ళలేదు. నేను ఏ రాష్ట్రం వెళ్ళినా అక్కడి సంప్రదాయ జానపద చేతి కళాకారుల బొమ్మల్ని తెచ్చుకుంటాను. నాకదొక హాబీ. కానీ ఇక్కడెందుకు తెచ్చుకోలేదో గుర్తులేదు.
నాట్య మమూరిని గీద్దాం
మొదటగా ఒక కార్డు బోర్డును తీసుకొని ఒక నెమలి బొమ్మను పెన్సిల్‌తో గీసుకోవాలి. మామూలుగా రేఖా చిత్రం గీసినట్టుగా కేవలం ఆకారం వెయ్యటం కాదు. నెమలి శరీరాన్ని మొత్తం గీతలతో, వంపులతో, సున్నాలతో నింపేలా గీయాలి. అంటే అడుగున ఉన్న తెల్ల పేపర్ ఎక్కువగా కనిపించకుండా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే చేతి మీద వేసుకునే గోరింటాకు డిజైన్‌లాగా నింపాలి. ఇలా పూర్తిగా నింపిన తర్వాత రంగులు వేయటం మొదలు పెట్టాలి. ఒకవేళ పెయింటింగ్ బ్రష్‌తో కుదరకపోతే మొదటగా స్కెచ్‌పెన్నులతో ప్రయత్నించవచ్చు. దీనికి చుట్టూ బార్డర్ కూడా నిండుగా ఉండాలి. ఎక్కడా ఎక్కువ ఖాళీ కనిపించ కూడదు. నాక్కూడా ఇలా ఖాళీ కనిపించకుండా పేపర్ నింపేయడమంటే చాలా ఇష్టం. అందుకే నాకీ పెయింటింగ్ స్టైల్ నచ్చింది.
పెండ్లి సందడి
భారతీయ ఇతిహాసాలయిన రామాణ, భాగవతాల్లోని కొన్ని ఘట్టాలను ఈ పెయింటింగ్‌లో ఎంచుకుని వేస్తారు. వీటిని గోడల మీద వేస్తారనుకున్నాం కదా! పూర్తి గోడను చీమంత ఖాళీ లేకుండా రేఖలతో రంగులతో నింపడం చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఖాళీలలో రకరకాల రంగులు నింపడం వల్ల ఇందులో ఒక వింత అందం గోచరిస్తుంది. పూర్వకాలపు గోడల స్థానంలో కాన్వాసుగా పేపర్, వస్త్రం వచ్చి చేరాయి. కానీ ఇప్పుడు కూడా ఒక గోడకు మొత్తం ఇలా మధుబనితో చిత్రించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఒక రూములోని మూడు గోడలు లేత రంగుల్లో మునిగి మరొక గోడ ముదురు రంగులో ముస్తాబవడం ఫ్యాషన్‌గా ఉంది. అందులో ముదురు రంగు వేసుకునే గోడకు ఈ మధుబనిని ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. సీతారామ కళ్యాణం ఘట్టాన్ని చిత్రించుకోవచ్చు. నేనిలా వేసుకున్నా మీరు మామూలు పెండ్లి ఘట్టాన్ని చిత్రించుకోవచ్చు. చాలా మంది హస్త కళాకారులు పెండ్లి ఘట్టాలను అద్భుతమైన 3డి బొమ్మలతో చిత్రిస్తున్నారు. పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు, అతిధులు, పురోహితుడు, కుటుంబ సభ్యులు, పెండ్లి మండపం, అక్కడికి కావాల్సిన సామాన్లు ఎన్నో వెయ్య వలసి ఉంటుంది. అయితే సమయం తీసుకున్నా తయారయ్యాక దాని అందం ముందు మన శ్రమ బలాదూరవుతుంది. కొద్దిగా ప్రాక్టీసు అయ్యాక దీనిని ప్రయత్నించవచ్చు. పెద్ద కాన్వాసులో అందం ద్విగుణీకృతమవుతుంది.
అందమైన పెయింటింగ్
మధుబనిలో తామర పూలు వేస్తారని చెప్పాను కదా. మన దేశ జాతీయ పుష్పం కమలాన్ని తయారు చేద్దాం. ఇది చాలా సింపుల్, పిల్లలు కూడా వేయవచ్చు. ఒక కార్డుబోర్డు మీద మొదటగా పెన్సిల్‌తో గీసుకోవాలి అనుకున్నాం కదా! రెండు తామర పువ్వులు, ఆకులు వేసుకుని మిగతా డిజైనంతా నింపితే సరిపోతుంది. గుండ్రటి నున్నటి తామర ఆకులు, ఎర్రగా విచ్చిన తామర పూలను వేసుకోవాలి. ఇంకా వాటి మధ్యలో ఆకులు, కొమ్మలున్న మొక్కల్ని వేసుకోవాలి. ఈ తామర పువ్వులో ఎక్కువగా నింపకుండా ఖాళీ వదిలాను. కొద్ది డిజైనును మాత్రమే వాడాను. రంగులు కూడా ఎక్కువ వేయలేదు. పెయింటింగ్‌ను సులభం చేయాలని మాత్రమే ఇలా చేశాను. ఇలా తయారయిన కార్డుబోర్డును ఫ్రేమ్ చేయించుకోవచ్చు. లేదా పేపర్ మీద గీస్తే గోడకు వేలాడదీసుకోవచ్చు.
బుద్ధుని ప్రతిమ
జాపదులు తమ వేళ్ళతోనూ, చెట్ల కొమ్మలతోనూ అగ్గి పుల్లలతోనూ వేసేవారు. ఈ కాలంలో ఈ పెయింటింగ్‌లను నిబ్ పెన్నులు, బ్రష్‌ల సాయంతో వేస్తున్నారు. నేనింత సంప్రదాయంగా కాకున్నా కొన్ని రకాల పెన్నులు, మార్కర్ల సాయంతో చిత్రించాను. ఈ మధ్య పెన్నుల్లో జెల్ పెన్నులు, ఫ్లోర్‌సెంట్ పెన్నులు, మెరుపుల పెన్నులు అంటూ ఎన్నో రకాల పెన్నులు దొరుకుతున్నాయి. ఇందులో భర్ణి, కన్నీ, తాంత్రిక, గోడ్నా, కోహ్బార్ వంటి ప్రధానమైన శైలులున్నాయి. మిథిలాకళ ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచింది. మధుబనిలో బుద్ధుడి బొమ్మని ప్రయత్నిద్దాం. కండ్లు మూసుకుని ఉన్న బుద్ధుడి బొమ్మను వేద్దాం. కాకపోతే తపోదీక్షలో ఉన్న బుద్ధుడు కాదు. చాలా మామూలుగా ఉన్న బుద్ధ ప్రతిమ. ఇది కూడా సులభంగా వేయచ్చు. బుద్ధుని వెనక ఒక చెట్టును వేసుకోవాలి. నేను సారనాధ్ వెళ్ళినపుడు బుద్ధుడికి జ్ఞానోదయం కలిగించిన చెట్టు అంటూ చూపించారు. బౌద్ధమత పుణ్యక్షేత్రాలలో ప్రధానమైన నాలుగింటిలో ఇదొకటి.
రాధాకృష్ణులను చిత్రిద్ధాం
ఏ సంప్రదాయ కళలోనైనా రాధాకృష్ణుల చిత్రాలు లేకుండా ఉండవు. ఇప్పుడు రాధాకృష్ణులను చిత్రిద్ధాం. మధురానగరిలో, యమునా తీరాన బృందావనంలో రాధాకృష్ణుల్ని చిత్రించాలని ఎవరికి ఉండదు. నేను కూడా చెట్ల మధ్య నర్తించే రాధాకృష్ణుల్ని వేశాను. దీనిలో చెట్లకు ఆకులకు ఎక్కువ డిజైన్లు వేసి రాధాకృష్ణుల్ని మామూలుగా ఉంచాను. వారి దుస్తులకు మనోహరమైన రంగుల్ని అద్దాను. కండ్లకు ఇంపుగా నిండు రంగులను వాడితే ఎక్కువ అందం వస్తుంది. కృష్ణుని జన్మస్థలమని మధురను చూసినపుడు ఎంతో అద్భుతంగా అనిపించింది. కండ్లు చెదిరే వస్త్రాలంకరణలో రాధాకృష్ణులు దర్శనమిచ్చారు. రాధాకృష్ణుల చిత్రాలను రెండు మూడు చిత్రించాను. కృష్ణుడ్ని మాత్రం ఎన్నో చిత్రాలలో తయారుచేశాను.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్