Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నతనం నుండి కష్టపడి చదువుకుంది. అందుకే శ్రమ విలువ ఆమెకు బాగా తెలుసు. కళారూపాల ద్వారా ప్రజా సమస్యలను సమాజానికి చాటింది. విద్యార్థి పోరాటాల్లో భాగమై వివక్షను ప్రశ్నించింది. జర్నలిస్టుగా తోటి ఉద్యోగుల సమస్యలపై గళమెత్తింది. అటు గొంతుని, ఇటు అక్షరాన్ని తన ఆయుధంగా మలుచుకుంది. ఇలా అనేక ఉద్యమాల్లో రాటుదేలింది. ఎంతో మంది జర్నలిస్టుల జీవితాలను ప్రపంచానికి పరిచయం చేసింది. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తి గాథలను అక్షరీకరించింది. కన్నడ, తెలుగు అనువాదాలు చేస్తూ సాహిత్యానికి విశేషమైన కృషి చేస్తుంది. ఆమే ప్రముఖ కన్నడ రచయిత్రి శాంతకుమారి. ఆమె పరిచయం నేటి మానవిలో...
బెంగుళూరులో పుట్టి పెరిగాను. అమ్మ కమలమ్మ, నాన్న కృష్ణప్ప. నాన్న మేస్త్రీ పని చేసేవాడు. అయితే ఇల్లు పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు ఇల్లు వదిలి ఎటో పోతూ వుండేవాడు. దాంతో ఇంటి బాధ్యత మొత్తం మా అమ్మనే చూసుకునేది. కూలి పనులు చేసి మమ్మల్ని కష్టపడి పెంచింది. మేము ఐదుగురం పిల్లలం. అందరికంటే నేనే పెద్దదాన్ని. ఇద్దరం ఆడపిల్లం. ముగ్గురు మగపిల్లలు. మా పెద్ద తమ్ముడు, చిన్న తమ్ము చిన్నతనంలోనే చనిపోయారు. అప్పట్లో అమ్మ దగ్గర వైద్యం చేయించడానికి డబ్బులు కూడా లేవు. సరైన వైద్యం అందించలేక వాళ్ళను పోగొట్టుకున్నాము.
గంజి తాగి బతికేవాళ్ళం
నేను ఆరో తరగతికి వచ్చే సరికి మా నాన్న మమ్మల్ని బళ్ళారి తీసుకుపోయాడు. అక్కడ కూడా మాకు ఇవే కష్టాలు. నేను చెల్లిని, తమ్ముడిని చూసుకుంటూ మూడు కిలో మీటర్ల దూరం వుండే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకునేదాన్ని. ఉదయం స్కూల్‌కు బన్ను, టీ తాగి వుండేవాళ్ళం. బాక్సులో గంజి తీసుకుపోయే వాళ్ళం. మా ఇబ్బంది చూసి మా టీచర్ మా కోసం ఇంటి నుండి బాక్సు తీసుకొచ్చేవారు. ఎనిమిదో తరగతి నుండి చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను. దాంతో కొంత ఆదాయం వచ్చేది. అమ్మ కూలీ డబ్బుతో పాటు ఇది కూడా ఇంటి ఖర్చులకు ఉపయోగపడేది. ఇలా చదువుకుని పదోతరగతి జిల్లా ఫస్ట్ వచ్చాను. దాంతో నా పేరు పత్రికలో వచ్చింది. అప్పుడే జైనుల్లా అనే ఒక రిపోర్ట్ర్ పరిచయం అయ్యారు. అప్పట్లో కన్నడలో ఓరాట(పోరాటం) అనే పత్రిక ఉండేది. దాని కోసం నాతోటి చిన్న చిన్న ఆర్టికల్స్ ఆయనే రాయించే వారు. స్కూల్ లైబ్రరీలో ఉండే పుస్తకాలన్నీ చదివేదాన్ని. చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం.
డ్రామా అంటే భయం వేసింది
ఇంటర్ చదివేటపుడు సిద్దప్ప అనే ఒక దళిత కవి ఉండేవారు. ఆయన పీహెచ్డీ చేస్తూ మా ప్రాంతానికి వచ్చారు. మా ఏరియాలో ఉండే లోకల్ లీడర్ నా గురించి చెబితే నన్ను కలవడానికి వచ్చారు. నన్ను ఓ కల్చరల్ టీం వేస్తున్న డ్రామాలో చేయమన్నారు. డ్రామా అంటే ముందు ఒప్పుకోలేదు. నేను డ్రామాలు వేయడమేంటి అని భయం వేసింది. కానీ వచ్చింది పెద్దవాళ్ళు కదా అని కాదనలేకప ఒప్పుకున్నాను. ఓ నాలుగు రోజులు వెళ్ళి చూద్దామనుకున్నాను. అక్కడకు వెళ్ళిన తర్వాత అర్థమయింది. సమాజంలోని సమస్యలపై వాళ్ళు వీధి నాటిక వేస్తున్నారని. అది నాకు బాగా నచ్చింది. దాంతో ఆ వీధి నాటికల్లో నేనూ కొన్ని పాత్రలు వేయడం మొదలుపెట్టాను. కొన్ని రోజులకు కల్చరల్ కన్వీనర్‌గా నన్ను పెట్టుకున్నారు. అది 'సముదాయా' కళాకారుల సంస్థ.
అగ్రకుల పెత్తనానికి వ్యతిరేకంగా
అప్పుడు నేను ఇంటర్ చదివుతున్నాను. దాంతో ఎస్.ఎఫ్.ఐ వాళ్ళు పరిచయం అయ్యారు. ఆ కార్యక్రమాలకు కూడా నన్ను తీసుకుపోతుండేవారు. స్టూడెంట్‌ని కాబట్టి విద్యార్థి సంఘంలోనే పని చేయాలని ఎస్.ఎఫ్.ఐ నాయకులు నన్ను 1981లో బళ్ళారి జిల్లా ఎస్.ఎఫ్.ఐ కన్వీనర్‌గా బాధ్యతలు ఇచ్చారు. అప్పట్లో కాలేజీలో పెద్ద సమస్య వుండేది. లింగాయిస్ అనే అగ్రకులం వారికి కాలేజీలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కింది కుల విద్యార్థుల పట్ల చాలా వివక్ష చూపించేవారు. దీనిపై ఎన్నో పోరాటాలు చేశాము. ఇలా విద్యార్థి సంఘంలో ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం.
పుస్తకాలు బాగా చదివేదాన్ని
ఇంటర్లో నాకు స్కాలర్షిప్ వచ్చింది. అందులోని 500 పెట్టి అమ్మ ఓ మేకను కొన్నది. దాని పిల్లలు, వాటి పిల్లలు కలిపి కొంత కాలానికి మొత్తం 40 మేకలు అయ్యాయి. ఆ మేకలే మాకు జీవనాధారం అయ్యాయి. స్మాశాన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకొని అందులో ఉండేవాళ్ళం. ఎస్.ఎఫ్.ఐ లోకి వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం బాగా పెరిగింది. కారల్ మార్క్స్ జీవితం, మాక్సిమ్ గోర్కి అమ్మ లాంటిప ఉస్తకాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. ఈ పుస్తకాలు ఎంతటి ప్రభావం చూపించేవంటే ఒక ఆర్ఎస్ఎస్ ఆయన కూడా వీటిని చదివి కమ్యూనిస్టుగా మారిపోయాడు. నేనైతే రోజుకొక పుస్తకం చదివేదాన్ని.
అక్రమంగా అరెస్టు చేశారు
సెకండ్ పీయూసీ చదివేటపుడు ఎస్.ఎఫ్.ఐ తరపున మా కాలేజీలో లింగాయిస్కు వ్యతిరేకంగా ఒక కరపత్రం వేశారు. దాంతో నన్ను, నాతో పాటు మరో ఎస్.ఎఫ్.ఐ లీడర్ని అరెస్టు చేసి స్టేషన్‌కి తీసుకుపోయారు. అతన్ని బాగా కొట్టారు. అప్పుడు సీపీఎం పార్టీలో ఉండే లాయర్ వచ్చి మాకు బెయిల్ ఇచ్చి తీసుకుపోయారు. మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేశారని తర్వాత రోజు కాలేజీలో బంద్ చేశాం. వాళ్ళు మమ్మల్ని నక్సలైట్స్ అనుకున్నారు. పోలీసులకు కనీస రాజకీయ అవగాహనే లేదు. 144 సెక్షన్ కూడా పెట్టారు. స్టూడెంట్స్ ఎవరైనా పోలీస్ స్టేషన్ ముందుగా పోతుంటే చాలు కొట్టేవాళ్ళు. దాంతో మేము కూడా పోలీసులపైన కేసు వేశాము. ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు. చివరికి నన్ను అరెస్టు చేసిన ఇనిస్పెక్టర్ని సప్పెండ్ చేశారు.
ఐక్యరంగలో పని చేశాను
1983లో నేను తిరిగి బెంగుళూరు వచ్చాను. మా అమ్మ వాళ్ళు మాత్రం బళ్ళారిలోనే ఉండేవారు. నేను బెంగుళూరులోని పిన్ని వాళ్ళ దగ్గర ఉండేదాన్ని. అప్పుడు బెంగుళూరులో 'ఐక్యరంగ' అనే వామపక్ష పత్రిక ఉండేది. అందులో పని చేయమని అడిగారు. రాత్రంత పార్టీ ఆఫీసులో ఉండి టైప్ చేసి పత్రిక వచ్చిన తర్వాత పోస్ట్ చేసి ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ సమయంలో విజయవాడ నుండి మురళి అనే ఎస్.ఎఫ్.ఐ పూర్తి కాలం కార్యకర్త వాళ్ళ అమ్మను హాస్పిటల్లో చూపించడానికి బెంగుళూరు వచ్చి పార్టీ ఆఫీసులో ఉండేవారు. నాకు తెగులు కొద్దికొద్దిగా వచ్చు. తెలుగులో నాకేమైనా అనుమానాలు ఉంటే మురళిని అడిగి తెలుసుకునేదాన్ని. కొంత కాలానికి ఆయన వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నాకు సుందరయ్యగారి పుస్తకం ఇచ్చి వెళ్ళారు. అప్పటికే వాళ్ళ అమ్మ చనిపోయారని తెలిసి బాధపడ్డాను.
ఆర్థిక ఇబ్బందులతో...
పత్రికలో పని చేస్తూనే ఎస్.ఎఫ్.ఐ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ఆ సమయంలోనే పెండ్లి గురించి పార్టీ నాయకులు నన్ను అడిగారు. నేనింకా దాని గురించి ఆలోచించలేదని, చెల్లి, తమ్ముడి బాధ్యత నాకుందని చెప్పాను. అయితే పార్టీ నాయకులు ఒక అబ్బాయి ఉన్నాడు. నిన్ను పెండ్లి చేసుకుంటానంటున్నాడు. నీకు బాగా తెలిసిన అతనే అన్నారు. మీకు ఇష్టమైతే నాకూ ఇష్టమే అన్నాను. ఇంతకీ నాకు తెలిసిన అబ్బాయి ఎవరా అనుకుంటే అతను మురళి. పార్టీ వాళ్లే మాకు దండలు మార్చి పెండ్లి చేశారు. ఆయన కూడా మాతో పాటు బెంగుళూరులోనే ఉండిపోయారు. తర్వాత మాకు బాబు పుట్టాడు. మురళి పని చేస్తున్న ఫ్యాక్టరీ లాకౌట్ అయ్యింది. దాంతో ఇల్లు గడవడం కష్టమయింది. తింటానికి తిండి కూడా ఉండేది కాదు. ఒక పక్క బాబు కాళ్ళు వంకరతో పుట్టాడు. వైౖద్యం చేయించాల్సి వచ్చింది. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేను ఐద్వాలో పని చేస్తుండేదాన్ని. తర్వాత పాప పుట్టడంతో ఖర్చులు మరింత పెరిగాయి. ఆర్థిక ఇబ్బందులతో 'రెడ్ పేర్' అనే పత్రికలో కొంత కాలం పని చేశాను. తర్వాత 'సంయుక్త కర్నాటక' అనే పత్రిక పెడితే అందులో చేరాను.
జర్నలిస్టుగా పదహారేండ్లు...
నాకు తెలిసిన వారి ద్వారా మురళి ఈనాడులో చేరారు. అందులో 12 ఏండ్లు చేశారు. తర్వాత వార్తలో అసెంబ్లీ న్యూస్ చూసేవారు. అక్కడ 16 ఏండ్లు చేశారు. నేనైతే 16 ఏండ్లు పత్రికా రంగంలో ఉన్నాను. జర్నలిస్టు యూనియన్‌లో ఎక్కువగా పని చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా 7000 మంది జర్నలిస్టులు ఉన్నారు. 'కర్నాటక కార్య నిరతా పత్రకర్త సంఘం'(కర్నాటక వర్కింగ్ జర్నలిస్టు యూనియన్) వుండేది. అందులో 20 ఏండ్లు పని చేశాను. ఇప్పుడు ఐఎఫ్‌డబ్ల్యూజే ఆలిండియా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. జర్నలిస్టుల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పెన్షన్ కమిటీలో ఉన్నాను. 16 ఏండ్లు పని చేసిన తర్వాత సంయుక్త కర్నాటక పత్రిక వాళ్ళు నన్ను అక్రమంగా తొలిగించారు. దాంతో కేసు వేసి పోరాటం చేసి గెలిచాను. బీదర్‌లో పోస్టింగ్ ఇచ్చారు కానీ ఆ ప్రాంతం పిల్లలకు అనుకూలం కాదని వదిలేశాను. నష్టపరిహారం మాత్రం తీసుకున్నాను.
105 మందిని లిస్ట్ చేశారు
ప్రస్తుతం కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పేదలకు రావల్సిన అన్ని సౌకర్యాలను కట్ చేస్తున్నారు. ఏ కొత్త కట్టడం ప్రారంభించినా సావర్కర్ పేరు పెడుతున్నారు. ఎక్కడైనా జాతరలు జరిగితే ముస్లింలను అంగడి పెట్టుకోనీయరు. మంగుళూరు అని సెన్సిటివ్ ప్రాంతం ఉంది. అక్కడ అల్లరు సృష్టిస్తున్నారు. ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి కలిసి మాట్లాడకూడదు. ఆర్.ఎస్.ఎస్ ఎక్కడ బలంగా ఉంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి. అభ్యుదయ రచయిత గౌరీ లంకేష్‌ను చంపేశారు. ప్రస్తుతం అభ్యుదయ వాదులైన 105 మందిని లిస్ట్ చేశారు. వాళ్ళపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు.
పన్నెండు పుస్తకాలు
ఇప్పటి వరకు నేను రాసిన పుస్తకాలన్నీ ఎక్కువగా జర్నలిస్టుల జీవితాల గురించే ఉన్నాయి. మొత్తం 12 పుస్తకాలు వచ్చాయి. అందులో ఎనిమిదిటికి అవార్డులు వచ్చాయి. వాటిలో ఒకటి 'మానవీయ ముత్తగళ'. అంతర్జాతీయ స్థాయిలో పని చేసిన జర్నలిస్టుల జీవితాలను కన్నడలోకి అనువాదం కూడా చేశాను. తెలంగాణ సాహితి వారు తీసుకొచ్చిన 'తెలుగెత్తి జైకొట్టు' పుస్తకాన్ని కన్నడలోకి అనువాదం చేశాను. మహిళల్లో ఎంతో మంది గొప్ప గొప్ప జర్నలిస్టులు ఉన్నారు. కానీ వారి గురించి ప్రపంచానికి తెలియడం లేదు. వాళ్ళ గురించి పుస్తకాలు తీసుకొచ్చాను. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల గురించి వంద స్టోరీలను సేకరించి త్వరంలో పుస్తకంగా తీసుకురాబోతున్నాను. నిస్సిమ కన్నడతి, గురూజీ రాజ్య లక్ష్మమ్మ స్మారక ప్రశస్తి, కరునాడ కన్మణి అవార్డ్, కన్నడ రాజ్య ఉత్సవ అవార్డ్, కవి రత్న కాళిదాస అవార్డ్, నవ చైతన్య ధీర మహిళే అవార్డ్, సావిత్రిబాయి పూలే అవార్డు, ఆసియా ఉమెన్ సబ్స్టాన్షనల్ 2019 అవార్డు ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నాను.
జర్నలిస్టుల కోసం పని చేస్తా
మా అబ్బాయి గవర్నమెంట్ లెక్చరర్‌గా చేస్తున్నాడు. మా అమ్మాయి మెడికల్ ఫీల్డ్‌లో ఉంది. మా చెల్లి అంగన్వాడీ టీచర్‌గా చేస్తూ బళ్ళారి జిల్లా సిఐటీయూలో పని చేస్తుంది. తను దేవదాసీల సమస్యలపై బాగా పని చేస్తుంది. జర్నలిస్టుల సమస్యలపై నా జీవితమంతా పని చేస్తాను. భవన నిర్మాణ కార్మికులకు ఎలాగైతే కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయో అలాగే జర్నలిస్టులకు కూడా రావాలి. దీనిపై సీరియస్‌గా ఉద్యమం చేయాలి. మహిళలు బాగా చదవాలి. బయటకు రావాలి. ఉద్యమాల్లో భాగస్వాములు కావాలి. అప్పుడే ఆత్మస్థైర్యం వస్తుంది. పోరాటాలే మనల్ని రాటుదేలుస్తాయి.
- సలీమ