Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చర్మతత్వం, కాలంతో సంబంధం లేకుండా కొంతమంది తమ ముఖం తాజాగా ఉండాలన్న ఉద్దేశంతో రోజులో ఎక్కువ సార్లు కడుగుతూనే ఉంటారు. అది కూడా రసాయనాలు అధికంగా ఉండే ఫేస్‌వాష్‌లతో! ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారిపోయి నిర్జీవమై పోతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. ఒక్కో చర్మతత్వం ఉన్న వారు తమ ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి..
మేకప్ వేసుకునే వారు ఇంటికొచ్చాక ముందుగా మేకప్ రిమూవర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాతే ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవాలి. అప్పుడే చర్మ రంధ్రాల్లోకి చేరిన మేకప్ అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి.
ఎలాంటి చర్మతత్వం ఉన్న వారైనా సరే ముఖం శుభ్రం చేసుకోవడానికి గోరువెచ్చగా ఉండే నీళ్లు లేదంటే చల్లటి నీళ్లను ఉపయోగించాలి. అదే మరీ వేడి ఎక్కువగా ఉండే నీటిని వాడితే చర్మం మరింత పొడిబారి నిర్జీవమైపోతుంది.
ముఖమంటే బుగ్గల వరకే రుద్దుకొని శుభ్రం చేసుకుంటారు చాలామంది. కానీ గడ్డం కింద, మెడ కూడా అందులో భాగమే! అక్కడ చేరిన దుమ్ము, ధూళి కూడా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ముఖం కడుక్కున్న ప్రతిసారీ గడ్డం కింద, మెడను కూడా శుభ్రం చేసుకోవాలి.
ముఖం కడుక్కున్న తర్వాత త్వరగా ఆరిపోవాలని టవల్‌తో బాగా రుద్దడం కాకుండా మృదువైన టవల్‌తో నెమ్మదిగా అద్దుతూ తుడుచుకోవాలి. ఫలితంగా ముఖ చర్మం దెబ్బతినకుండా జాగ్రత్తపడచ్చు.
ముఖం కడుక్కోవడానికి ఉపయోగించే ఫేస్‌వాష్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఈ విషయంలో మీ చర్మతత్వాన్ని బట్టి ఎంత ఫేస్‌వాష్ వాడడం మంచిదో నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. లేదంటే మీరు ఎంచుకునే ఫేస్‌వాష్ లేబుల్‌ని ఓసారి పరిశీలించినా సరిపోతుంది.
ఇక ముఖం కడుక్కున్న తర్వాత చర్మం పొడిబారిపోకుండా, ఎక్కువ సమయం తాజాగా ఉండాలంటే మాయిశ్చరైజర్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రమంలో జిడ్డు చర్మం ఉన్న వారు ఆయిల్ రహిత మాయిశ్చరైజర్స్ వాడాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. లేదంటే మీ ముఖం మరింత జిడ్డుగా మారుతుంది.