Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ కాలపు దంపతుల్లో భాగస్వామి కోసం నేనెందుకు మారాలన్న స్వార్థ పూరిత ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు మితిమీరిన స్వీయ ప్రేమతో పాటు మరెన్నో కాణాలుగా వుంటున్నాయి. అయితే ఇద్దరి మధ్య అన్ని విషయాల్లో ఈ స్వార్థం పనికి రాదంటున్నారు మానసిక నిపుణులు. ఇది అర్థం చేసుకోలేక చాలామంది దంపతులు తమ వైవాహిక జీవితంలో తొలి ఏడాదే కొన్ని చేదు అనుభవాలు, కష్టాలు కొనితెచ్చుకుంటున్నారని చెబుతున్నారు. తద్వారా దీని ప్రభావం వాళ్ల అనుబంధం పైనే పడచ్చు. కాబట్టి వీటి గురించి ముందే అవగాహన పెంచుకొని.. పరిణతితో ముందడుగు వేస్తే నిండు నూరేండ్ల దాంపత్య బంధానికి తొలి ఏడాదే గట్టి పునాది వేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి..
పెండ్లయ్యాక అమ్మాయిలు మాత్రమే తమ ఇంటి పేరు మార్చుకోవడం పాత ట్రెండ్. భార్యాభర్తలిద్దరూ ఒకరి పేరు వెనకాల మరొకరి పేరు జోడించుకోవడం ఇప్పుడున్న కొత్త ట్రెండ్. నిజానికి ఇది దాంపత్య బంధంలోని సమానత్వాన్ని చాటుతుంది. అయితే అందరూ ఇలా ఉండచ్చు.. ఉండకపోవచ్చు. కొంతమంది 'ఇది నా జీవితం.. నాకు నచ్చినట్టుగా ఉంటా.. పెండ్లయితే పేరు మార్చుకోవాల్సిన అవసరమేముంది' అన్నట్టుగా ముక్కు సూటి ధోరణిలో వెళ్తుంటారు. ఇలాంటి మొండితనం పెండ్లయిన తొలి ఏడాదిలో దంపతుల్లో ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఇదే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య తగాదాలకు దారితీయచ్చు. కాబట్టి ఇంత చిన్న విషయాన్ని పెద్దది చేయకుండా.. ఎవరో ఒకరు సర్దుకుపోవడం లేదంటే ఏ సమస్యా లేకుండా ఒకరి పేరు మరొకరు జోడించుకోవడం.. వంటివి చేస్తే కలతల్లేకుండా కాపురం చేసుకోవచ్చు.
భరోసా కల్పించాలి
పెండ్లయిన తొలి ఏడాది చాలామంది దంపతులకు కష్టంగా అనిపించే మరో అంశం ఆర్థిక విషయాలు. ఎందుకంటే అప్పటిదాకా తమ సంపాదనతో స్వేచ్ఛగా గడిపిన వారు.. ఇప్పుడు కుటుంబం కోసం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. మరికొంతమందికి భవిష్యత్తు కోసం చేసే పొదుపు-మదుపుల గురించి సరైన అవగాహన ఉండకపోవచ్చు. ఇంకొంతమంది తక్కువ సంపాదనతో ఖర్చులన్నీ నెట్టుకురావాల్సిన పరిస్థితులు తలెత్తచ్చు. ఇలా కారణమేదైనా ఆర్థిక విషయాల్లో ఇద్దరికీ సరిపడక పలు భేదాభిప్రాయాలు రావచ్చు. ఇలాంటప్పుడు ఇద్దరూ గొడవపడడం మాని భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చిపుచ్చుకోవాలి. ముందు ముందు ఇద్దరికీ ఉన్న లక్ష్యాలు, ఆలోచనలు, ప్రణాళికలు.. వంటివన్నీ పంచుకొని.. చక్కటి ప్రణాళిక వేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. సంసారమూ సాఫీగా సాగుతుంది.
మొహమాటాలొద్దు
పెండ్లంటే రెండు కుటుంబాల కలయిక. కాబట్టి ఇకపై మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా కుటుంబాలను సైతం ప్రభావితం చేయచ్చు. అయితే పెండ్లయిన కొత్తలో చాలా జంటలు మొహమాటానికి పోయి ఇరు కుటుంబాలను సంతృప్తిపరిచే క్రమంలో కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వారి దాంపత్య జీవితం పైనా ప్రభావం చూపచ్చు. కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ ఇద్దరికీ నచ్చినట్లుగా, పెద్దవాళ్లను నొప్పించకుండా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. తద్వారా మీరూ సంతోషంగా ఉండచ్చు.. అనుబంధాన్నీ దృఢం చేసుకోవచ్చు.
వాళ్లూ ముఖ్యమే
వైవాహిక బంధం శాశ్వతం కావాలంటే దంపతులిద్దరూ సర్దుకుపోవడం ఎంతో ముఖ్యం. అలాగని ప్రతి విషయంలోనూ సర్దుకుపోయినా.. ఒకరంటే మరొకరికి లోకువై.. క్రమంగా గొడవలకు దారితీయచ్చు. అలాగే కొత్తగా పెండ్లయిన మోజులో ఎక్కువ సమయం భాగస్వామితో గడపడం మంచిదే అయినా.. కొన్నాళ్లకు ఇది బోర్ కొట్టచ్చు. కాబట్టి ఈ రెండు విషయాలు మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. దీన్ని బ్రేక్ చేయాలంటే ఎవరికి వారు కొంత వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవాలి. అలాంటప్పుడు మీ స్నేహితుల్ని కలవడం, మీకు నచ్చిన పనులు చేయడం, అభిరుచులకు పదును పెట్టడం.. వంటివి చేస్తే జీవితంలో బోర్ అనే ఫీలింగే రాదు.. ఈ సంతృప్తి దాంపత్య బంధం పైనా సానుకూల ప్రభావం చూపుతుంది.