Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ప్రతీ ఇంట్లోనూ పిండి వంటల ఘుమఘుమలే ఉంటాయి. ఈ సమయంలోనే సిటీల్లో ఉండేవారంతా పట్నం బాట పడతారు. ఇళ్ళన్ని కళకళలాడతాయి. దీంతో ప్రతీ ఒక్క ఇంట్లోనూ పిండివంటలు చేసుకుంటారు. ఇందులో ఎక్కువగా ఏమేం చేస్తారో ఇప్పుడు చూద్దాం.. సకినాలు, సక్కుబియ్యం చెక్కలు, నువ్వుల అరిసెలు, చంద్ర వంకలు.. ప్రాంతాలను బట్టి చాలా మంది ఇతర వంటలను కూడా చేస్తుంటారు. కానీ వీటినే ఎక్కువమంది చేసుకుంటారు. అయితే ఈ వంటల్లో ఒక్కో పిండి వంటకి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటిని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సకినాలు..
కావల్సిన పదార్థాలు: బియ్యం - కేజీ, నువ్వులు - వంద గ్రాములు, వాము - పది గ్రాములు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం: కొత్త బియ్యం లేదా పాత బియ్యాన్ని నీళ్ళల్లో ఒక రాత్రి మొత్తం నానబెట్టాలి లేదా కనీసం 5 గంటలైనా కచ్చితంగా నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యం పట్టించాలి. పిండిని కాస్త తడి ఆరే వరకు ఎండబెట్టాలి. అందులో నువ్వులు, వాము, ఉప్పు వేసుకుని మొత్తం కలపాలి. ఇప్పుడు ఏదైనా కాటన్ గుడ్డలో దీనిని వేసుకుని దాని పైన ఈ పిండితో గుండ్రంగా చుట్టాలి. ఇలా సకినాల ఆకారం వచ్చే దాకా చుట్టాలి. ఇప్పుడు వీటిని మరిగించుకున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చే దాక ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో సులువుగా వీటిని ఈ పండుగకి చేసేసుకోవచ్చు.
సగ్గుబియ్యం చెక్కలు
సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంట్లో వండే పిండి వంటల్లో సాధారణంగా ఉండేవి చెక్కలు. వివిధ రకాల్లో వీటిని వండుతారు. ఇప్పుడు సగ్గుబియ్యం చెక్కల తయారీని చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు: బియ్యం - నాలుగు కప్పులు, పెసరపప్పు - రెండు కప్పులు, సగ్గుబియం - కప్పు, నువ్వులు - మూడు టేబుల్ స్పూన్లు, జీలకర్ర - స్పూను, వెన్న - ఒక స్పూను, కారం, ఉప్పు - రుచికి తగినంత, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: బియ్యం, పెసరపప్పు, సగ్గుబియ్యాన్ని కలిపి మెత్తగా పిండి చేసుకోవాలి. అందులో నువ్వులు, జీలకర్ర, తగినంత ఉప్పు, కారం, వెన్న వేసుకుని బాగా కలుపుతు సరిపడా నీళ్ళు పోసుకుంటూ ముద్దలా చేసుకొవాలి. ఐదు నిమిషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న చెక్కల్లా ఆద్దుకుని వేడినూనెలో బాగా వేగాక తీసేస్తే సరిపోతుంది.హొ
నెలవంకలు
నెలవంకలు అనగానే అందరికి మూన్ బిస్కేట్స్ గుర్తొస్తాయి. కానీ ఇంట్లో వండే పిండి వంటల్లో కూడా ఈ వెరైటి ఉంటుందని తెలియదు కదూ. మరి అవి ఎలా చేస్తారో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు: సెనగపప్పు - ఒక కప్పు, బియ్యప్పిండి - పావుకప్పు, పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు, బెల్లం తురుము - ఒక కప్పు, యాలకుల పొడి - చెంచా, నూనె - వెయించడానికి సరిపడా.
తయారీ విధానం: సెనగపప్పు ఉడకబెట్టి ముద్దలుగా చేసుకోవాలి. అందులో బియ్యప్పిండీ, పచ్చికొబ్బరి తురుమూ కలుపుకోవాలి. దీన్ని కాస్త మందంగా చపాతీలా వత్తుకుని అర్ధచంద్రాకారంలో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటన్నింటినీ వేడినూనెలో వేసుకుని బాగా వేగాక తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం తురుమును మునిగేదాకా నీళ్ళు పోసుకుని తీగపాకం పట్టాలి. అందులో యాలకులపొడి వేసుకుని ముందుగా వేయించుకున్న నెలవంకల్ని అందులో వేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది.హొ
అరిసెలు
కావల్సిన పదార్థాలు: దొడ్డు బియ్యం - ఒకటిన్నర గ్లాసు, బెల్లం తురుము - ఒక గ్లాసు, నీళ్లు - పావు గ్లాసు, పంచదార - ఒక టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకు సరిపడా, నువ్వులు - నాలుగు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని రెండు నుండి మూడు సార్లు కడిగి తగినన్ని నీళ్లు పోసి రెండు రోజుల పాటు నాబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని మూడు పూటలా కడుగుతూ వేరే నీటిని పోస్తూ ఉండాలి. ఇలా నానబెట్టిన తర్వాత బియ్యాన్ని ఒక జల్లిగిన్నెలోకి తీసుకుని నీరంతా పోయేలా చేసుకోవాలి. తర్వాత ఈ బియ్యాన్ని జార్‌లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పిండిని జల్లించి తడి ఆరిపోకుండా దానిపై మూత పెట్టుకోవాలి. ఎక్కువ మొత్తంలో తయారు చేసే వారు మర ఆడించిన పిండిని కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు, పంచదార వేసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీటిని వడకట్టి మరలా గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలోని మలినాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లం నీటిని లేత తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. బెల్లం మిశ్రమాన్ని నీటిలో వేసి చూస్తే మెత్తని ఉండలా అవ్వాలి. ఇలా పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలపాలి. తర్వాత వెంటనే ముందుగా తయారు చేసుకున్న బియ్యం పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి. పిండి మరీ గట్టిగా కాకుండా జారుడుగా ఉండేలా చూసుకోవాలి. పాకం ముదిరిన, పిండి గట్టిగా అయినా అరిసెలు గట్టిగా అవుతాయి. ఇలా తయారు చేసుకున్న పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక పాలిథిన్ కవర్‌కు నూనె రాసుకుంటూ ఒక్కో పిండి ఉండను తీసుకుని అరిసెల ఆకారంలో వత్తుకోవాలి. వీటిని నెమ్మదిగా సున్నితంగా మరీ పలుచగా కాకుండా వత్తుకోవాలి. తర్వాత ఈ అరిసెను నూనెలో వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తర్వాత అరిసె బయటకు తీసి నూనె పోయేలా అరిసెల గిద్దల్లో వేసి వత్తుకోవాలి. ఈ గిద్దెలు అందుబాటులో లేని వారు రెండు గంటెల మధ్య అరిసెను ఉంచి నూనె పోయేలా వత్తుకోని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనం నువ్వుల అరిసెను కూడా చేసుకోవచ్చు. పిండి ఉండకు నువ్వులను అద్ది అరిసెలా వత్తుకుని కాల్చుకోవాలి. వీటిని కూడా అరిసెలను వత్తుకున్నట్టే వత్తుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా ఉండే అరిసెలు తయారవుతాయి. వీటిని గాలి, తడి తగలకుండ నిల్వ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. అలాగే వీటిని కాల్చుకునేటప్పుడు నూనె వేడిగా ఉండేలా చూసుకోవాలి. కేవలం పండుగలకే కాకుండా తీపి తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడూ ఇలా అరిసెలను తయారు చేసుకుని తినొచ్చు. వీటిని తినడం వల్ల రుచితో పాటు శరీరం కూడా బలంగా తయారవుతుంది.