Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తీసుకునే ఆహారం విషయంలో మనమే మన కోరికల్ని కంట్రోల్ చేసుకోలేం. అలాంటిది పిల్లలెలా వింటారు. చలికాలమైనా ఐస్క్రీమ్ కావాలని, అనారోగ్యమని తెలిసినా పిజ్జా, బర్గర్లు తింటామని మారాం చేస్తుంటారు. ఇలాంటప్పుడు పిల్లల్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను పిల్లలకు అలవాటు చేయడం తల్లులకు కత్తి మీద సాములాంటిది. అయితే చిన్నారులకు ఒక్కో ఆహార పదార్థం అలవాటు చేసేటపుడు హెల్దీ ఆప్షన్స్ ఎంచుకోవాలని దానికోసం మన పూర్వీకులు పాటించిన ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను వారికి అలవర్చాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇలా పిల్లలకు పసి వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే.. పెద్దయ్యాక కూడా వారు అవే అలవాట్లను కొనసాగించే అవకాశం ఉంటుంది. దాంతో తల్లులకు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి దిగులూ ఉండదని చెబుతున్నారు.
ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ సక్రమంగా జరుగుతాయి. అయితే పిల్లలు మాత్రం ఇవేవీ వినిపించుకోరు. అవి ఆరోగ్యానికి మంచివి కావు.. అని చెప్పినా అవే కావాలని పట్టుబడతారు. పెద్దయ్యాక పిల్లలు ఇలా తయారుకాకుండా ఉండాలంటే చిన్నతనం నుంచే వారికి ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవాటు చేయాలి. మన పెద్దలు తమ పిల్లల విషయంలో పాటించిన చిట్కాలను, ఆరోగ్యకరమైన వంటకాలను మనమూ మన పిల్లలకు అలవాటు చేయించాలి.
సీజన్ మారుతున్న కొద్దీ మనం ఎలాగైతే మన ఆహారపుటలవాట్లలో మార్పులు-చేర్పులు చేసుకుంటామో.. పిల్లల విషయంలోనూ ఇది పాటించాలి. తాజాగా, చక్కటి పోషకాహారంతో కూడిన పదార్థాలు అందిస్తే.. అవి వారిని ఆయా కాలాల్లో ఎదురయ్యే ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉంచుతాయి. ఇక ఈ చలికాలంలో సాధారణంగానే పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. పైగా ఇది పండగల సీజన్ కూడా. ఇలాంటి సమయాల్లో స్వీట్స్, డెజర్ట్స్.. వంటివి చేసుకోవడం మామూలే. అయితే చక్కెరకు బదులు బెల్లం, దాల్చినచెక్క పొడి.. వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. పిల్లలకు అటు ఆరోగ్యకరమైన ఆహారం, ఇటు అప్పుడప్పుడూ వారికి నచ్చిన ఆహారం అందిస్తూ వారి ఆహారపు కోరికల్ని అదుపు చేస్తే వాళ్లు మనం చెప్పిన మాట వింటారు. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎప్పుడైనా జలుబు, దగ్గు అనిపిస్తే ఆవిరి పట్టడంతో పాటు రోజూ రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగించడం వంటివి చేయాలి.