Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లిదండ్రుల ప్రేమానుబంధం.. చిన్నారుల ఎదుగుదలపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు నిపుణులు. వారి మనసును తెలుసుకుంటూ.. ప్రేమను పంచే తల్లిదండ్రుల పెంపకంలో పిల్లల మానసికారోగ్యం పెంపొందుతుందని సూచిస్తున్నారు.
రకరకాల కారణాల రీత్యా పిల్లలు చిన్న కుటుంబాల్లో పెరగాల్సి వస్తుంది. కొన్ని కుటుంబాల్లో అయితే తోబుట్టువులూ లేక ఒంటరితనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల మధ్య ఉండే అన్యోన్యత, అనుబంధాలు చిన్నారుల మానసిక ఎదుగుదలపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఉద్యోగ ఒత్తిళ్లు, పెరుగుతున్న గ్యాడ్జెట్ల వినియోగం, భార్యాభర్తలిద్దరికీ కనీసం మాట్లాడుకునే సమయం చిక్కకపోవడం వంటివన్నీ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తమ ఆలోచనలను పంచుకోవడానికి తల్లిదండ్రులకు సమయం ఉండకపోవడంతో పిల్లలు ఒంటరితనానికి లోనై, కుంగుబాటుకు గురవుతున్నారు.
ఉద్యోగ ఒత్తిడి, తల్లిదండ్రులు ఏదో ఒక కారణంతో ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం, బాధ్యతలను పంచుకోవడంలో విమర్శించుకోవడం, దూషించుకోవడం వంటివన్నీ పిల్లలపై చెడు ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. పెద్దల ప్రవర్తన అర్థంకాక, వారెందుకు కోపంగా ఉంటున్నారో అవగాహన లేక చిన్నారులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. తల్లిదండ్రుల సమస్యలు ఏంటో తెలియక, పిల్లలు తమ ఆలోచనలను పంచుకోవడానికి భయపడుతుంటారు. ఇవన్నీ వారి మానసిక ఆరోగ్యాన్ని కుంటుపడేలా చేసి, వారి ఎదుగుదలకు అవరోధాలవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలెదుట సమస్యలను చర్చించుకోకూడదు. వారికి వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించడమే కాకుండా, దాన్ని ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నించాలి. దంపతుల సంభాషణ అన్యోన్యంగా, ప్రేమపూర్వకంగా, పరస్పర గౌరవంతో ఉండాలి. ఆ ప్రేమానుబంధం పిల్లలపై మంచి ప్రభావం చూపి వారూ ఇతరులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించేలా చేస్తుంది.
చిన్నారులకు కేటాయించే సమయంలో 80 శాతాన్ని వారి భావోద్వేగాలను గుర్తించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి వినియోగించాలి. మిగతా 20 శాతం వారితో ప్రేమగా, అనునయంగా మాట్లాడాలి. పిల్లలతో గడపాల్సిన సమయానికి అధిక ప్రాముఖ్యతనివ్వాలి. కలిసి భోజనం చేయడం, కథలు వినిపించడం, రోజూ వారికెదురైన అనుభవాలను తెలుసుకోవడం, ఆలోచనలను పంచుకోవడం వంటివన్నీ వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి దోహదం చేస్తాయి.