Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవకాశాలు కల్పిస్తే మహిళలు ఎక్కడైనా, ఏ రంగంలోనైనా రాణించగలరు. దీనికి మరో ఉదాహరణగా నిలిచారు ప్రియాంక శర్మ... ఇప్పుడు ఆమె తన రాష్ట్రంలో ప్రభుత్వ బస్సును నడిపిన మొట్టమొదటి మహిళా డ్రైవర్‌గా చరిత్ర సృష్టించింది. దేశంలో మహిళా అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులే. ఇక ఉత్తర భారతదేశంలోని మహిళల పరిస్థితి మరింత ఘోరం. అలాంటి చోట ఆమె మహిళా డ్రైవర్‌గా పని చేస్తూ తనలాంటి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆమె పరిచయం...
ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యుపీఎస్ఆర్టీసీ) ఇటీవలే 26 మంది మహిళా డ్రైవర్లను ప్రభుత్వం నడుపుతున్న బస్సులకు నియమించింది. ప్రియాంక శర్మతో పాటు ఇతర మహిళలు లింగ వివక్షను విచ్ఛిన్నం చేసే అవకాశాన్ని పొందారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ నడుపుతున్న బస్సును నడిపిన తొలి మహిళగా ప్రియాంక నిలిచారు.
భర్త చనిపోవడంతో...
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రియాంక 2002లో షోరూమ్‌లో సెక్యురిటీ గార్డ్‌గా పని చేస రాజీవ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. అయితే అతను మద్యానికి బానిసై కుటుంబాన్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఇద్దరు పిల్లలు పుట్టినా అతనిలో మార్పు లేదు. తాగి తాగి కిడ్నీ వ్యాధికి గురయ్యాడు. చివరకు 2016లో చనిపోయాడు. తినడానికి కూడా తిండిలేని ప్రియాంక తన ఇద్దరు కొడుకులతో బిక్షాటన చేయాల్సి వచ్చింది. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆమె ఉపాధి కోసం దేశంలోని ఎన్నో ప్రాంతాలకు వలస వెళ్ళింది.
ఆదాయం సరిపోయేదికాదు
జీవనోపాధి కోసం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రదేశాలలో నివసించింది. మొదట ఢిల్లీ వెళ్ళిన ఆమె ఓ ఫ్యాక్టరీలో హెల్పర్‌గా పని చేసింది. కొన్ని రోజులు టీ స్టాల్ కూడా నడిపింది. అయితే వచ్చిన ఆదాయం తన కుటుంబానికి ఏ మాత్రం సరిపోయేది కాదు. దాంతో డ్రైవింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. తెలిసిన వారి వద్ద శిక్షణ తీసుకుని ఓ ట్రక్కు నడపడం మొదలుపెట్టింది. ''డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నేను పిల్లలను తీసుకుని ముంబయి వెళ్ళాను. డ్రైవింగ్ కోర్సును పూర్తి చేసి అవసరమైన లైసెన్స్‌ను కూడా పొందాను. ట్రక్కు డ్రైవర్‌గా బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, అస్సాం వరకు కూడా ప్రయాణం చేశాను'' అంటున్నారు ఆమె. చివరకు యుపీ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో మహిళా డ్రైవర్ల కోసం నోటిఫికేషన్ వేయడంతో ఆమె కూడా దరఖాస్తు చేసుకుంది.
వేధింపులు ఎక్కువ
సాధారణంగా ఈ రంగంలో పని చేసే మహిళలపై వేధింపులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాటికి భయపడి చాలా మంది మహిళలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను నడిపేందుకు ఇష్టపడరు. అయితే కుటుంబం గడవడానికి ప్రియాంక ధైర్యంగా ఈ వృత్తిలతోకి ప్రవేశించింది. మహిళలను డ్రైవర్లుగా నియమించాలని యుపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దరఖాస్తు చేసుకుంది.
జీతం తక్కువ...
''యుపీఎస్ఆర్టీసీ మహిళా డ్రైవర్ల కోసం ఖాళీ పోస్టులను ప్రకటించినప్పుడు నేను దరఖాస్తు చేసాను. మేలో శిక్షణ పాసయ్యాను. సెప్టెంబర్‌లో పోస్టింగ్ పొందాను. ప్రస్తుతం మా జీతం తక్కువగా ఉంది. అయితే ఆరు నెలల తర్వాత పోస్టును క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. శాఖ అధికారుల నుండి మాకు భవిష్యత్‌లో మంచి మద్దతు లభిస్తోంది'' అని ప్రియాంక అన్నారు.
పర్మినెంట్ చేయాలని
ప్రస్తుతం ప్రియాంక ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 26 మంది మహిళా డ్రైవర్లలో ఒకరు. ఆమె కౌశాంబి బస్ డిపో నుండి డెహ్రాడూన్, రిషికేశ్, మీరట్, లక్నో, మొరాదాబాద్, బరేలీలకు సుదూర బస్సును నడుపుతోంది. 50 మంది ప్రయాణికులను కౌశాంబి నుండి మీరట్‌కు నడపడం ఆమె మొదటి కర్తవ్యం. ప్రస్తుతం ఆమె కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తుంది. భవిష్యత్‌లో ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగం పొందాలని ఆమె ఆశిస్తోంది. అది తనకు, తన కుటుంబాన్ని చూసుకోవడానికి ఎంతో అండగా ఉంటుందని ఆమె భావిస్తుంది. ప్రియాంక వంటి మహిళలు జీవిత పాఠాలను అందిస్తారు. ఇతర మహిళలకు స్ఫూర్తినిచ్చే చోదక శక్తిగా నిలుస్తారు.