Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహ విద్యార్థులతో కొందరు పిల్లలు తరచూ గొడవ పడతారు. తోటిపిల్లల పెన్సిల్, పెన్ వంటి వస్తువులను ఇంటికి తీసుకొచ్చేస్తారు. హోంవర్క్ పూర్తిచేయకుండానే చేశామంటారు. చిన్నచిన్న విషయాలకే అబద్ధాలు చెబుతుంటారు. దీంతో పిల్లలను మంచి మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులు చేయి చేసుకొంటారు. బెదిరిస్తారు. నయానాభయానా మార్చడానికి ప్రయత్నిస్తారు. కొందరు పిల్లలు భయపడి దారిలోకి వచ్చినా, మరికొందరు మాత్రం అలాగే ప్రవర్తిస్తుంటారు. క్రమేపీ ఏ శిక్షకూ భయపడరు. పెద్దల పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తారు. ఇలాంటి వారిలో మార్పు ఎలా తీసుకురావాలో చూద్దాం...
పిల్లల ప్రవర్తనకు ఇంటివాతావరణం, తల్లిదండ్రుల వ్యవహారశైలి, స్నేహితుల ప్రభావం వంటివి కారణాలవుతాయి. ఇంట్లో పెద్దల ప్రవర్తన, అమ్మానాన్నల అనుబంధం, వారు చూపించే ప్రేమ వంటివన్నీ చిన్నారులు గమనిస్తారు. తాము ప్రేమరాహిత్యానికి గురవుతున్నట్టు గుర్తించినా, పెద్దవాళ్లు తమకు సమయాన్ని కేటాయించక పోయినా.. ఆ పసి మనసులు గాయపడతాయి. తల్లిదండ్రులు కోరినట్టు తాము ఉండకుండా, వారి ఏకాగ్రతను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఏదోలా ప్రత్యేకంగా కనిపిస్తేనే వారు తమను చూస్తారని భావించి తమకు నచ్చినట్లు నడుచుకోవడం మొదలు పెడతారు.
చిన్నారులకు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. స్కూల్ లేదా స్నేహితుల గురించి రోజూ పిల్లలతో మాట్లాడాలి. వారు చెప్పేది పూర్తిగా వినాలి. అప్పుడే వారి సంతోషాలు, సమస్యల గురించి తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు తరగతిలో పాఠ్యాంశాలను పిల్లలు అనుసరించలేక పోవచ్చు. మరికొన్నిసార్లు ఉపాధ్యాయులు, సహ విద్యార్థుల నుంచి అవహేళనలు ఎదుర్కోవచ్చు. ఇవన్నీ తెలియాలంటే పిల్లలతో పెద్దవాళ్లు స్నేహం చేయాలి. సమస్యలను పరిష్కరించుకోవడం నేర్పాలి. కష్టం వస్తే చెప్పుకోవడానికి స్నేహితుల్లా అమ్మా నాన్న ఉన్నారనే భరోసాను వారి మనసులో నింపగలిగితే చాలు. శిక్షించాల్సిన పని ఉండదు. వారి ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే శిక్షించడమే పరిష్కారమని భావించకూడదు. వారెందుకలా చేశారో అనునయంగా అడిగి తెలుసుకోగలగాలి. విషయం పట్ల అవగాహన కలిగించాలి. మెల్లగా దారిలోకి తేవాలి.