Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గింజధాన్యాలైన పచ్చి బఠానీలు సీజనల్‌గా లభిస్తాయి. వాటిని సీజన్ ప్రకారం కచ్చితంగా తినాలి. ఎండు బఠానీల కన్నా పచ్చి బఠానీలు తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇవి మంచి వింటర్ డైట్ అని చెప్పాలి. వీటిలో ఫ్లేవనాయిడ్స్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.ఇవి తినడం వల్ల గుండెకు ఎంతో మంచిది. గుండె వ్యాధులు, గుండె పోటు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. దీనిలో ఫైబర్ కంటెట్ కూడ అధికంగా ఉంటుంది. వీటిని తినడం జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం తగ్గుతుంది. డయాబెటిస్ రోగులకు ఇది మంచి ఆహారం. కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ఇవి తగ్గిస్తాయి. ఎముకలకు ఇవి బలాన్నిస్తాయి. వీటిని తినడం వల్ల మల బద్ధకం సమస్య కూడా దరిచేరదు. పచ్చిబఠాణీలతో కొత్త రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం.
దోశ
కావాల్సిన పదార్థాలు: పచ్చిబఠాణీలు - కప్పు, శెనగపిండి - అరకప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు - అయిదు, పచ్చిమిర్చి - మూడు, కొత్తి మీర - కట్ట, ఉప్పు - తగినంత, నూనె - దోశె వేయడానికి సరిపడా.
తయారీ విధానం: పచ్చి బఠానీలను పరిశుభ్రంగా కడిగి మిక్సి గిన్నెలో వేయాలి. వెల్లుల్లి, అల్లం, ఉల్లి గడ్డ తరుగు, పచ్చిమిర్చి, కొత్తి మీర కూడా వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. పచ్చి బఠాణీల రుబ్బుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో శెనగపిండి, ఉప్పు కూడా వేసి కలపాలి. దోశె వేసేంత జారుడుగా అనిపించకపోతే రుబ్బులో కాస్త నీళ్లు కలుపుకోవచ్చు. జీలకర్ర కూడా కలుపుకుంటే చాలా మంచిది. స్టవ్‌పై పెనం పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక పలుచటి దోశెల్లా వేసుకోవాలి. రెండు వైపులా కాల్చుకుని టమాటా చట్నీతో తింటే టేస్టు అదిరిపోతుంది.
టేస్టీ రొట్టె
కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి - కప్పు, పచ్చి బఠాణీ - కప్పు, పచ్చి మిర్చి - రెండు, జీలకర్ర - టీ స్పూను, ఉల్లిగడ్డ - ఒకటి, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, కరివేపాకులు - ఒక రెమ్మ, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - ఒక టీస్పూను.
తయారీ విధానం: పచ్చి బఠాణీలను ఉడికించి నీళ్లు వడకట్టాలి. చేత్తో వాటిని మెత్తగా మెదుపుకోవాలి. కష్టమనుకుంటే మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకున్నాచాలు. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో బియ్యప్పిండి బాగా కలపాలి. ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు కూడా వేసి ముద్దలా కలుపుకోవాలి. గారెలా పిండి ఎంత గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఒక పాలిథిన్ లేదా అరిటాకుకు కాస్త నూనె రాసి బూరె సైజులో చిన్న ముద్ద తీసుకోవాలి. కవర్ పై పెట్టి చేత్తో ఒత్తుకోవాలి. మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు పెట్టుకోవాలి. పెనం పై కాస్త నూనె రాసి ఒత్తు కున్న రోటీని పెనంపై వేయాలి. చిన్న మంట మీద రెండు వైపులా కాల్చుకోవాలి. దీని రుచి చాలా బాగుంటుంది.
పరాటా
కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి - ఒక కప్పు, పనీర్ ముక్కలు - రెండు కప్పులు, పచ్చిబఠానీలు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - మూడు, గరం మసాలా - అరస్పూను, జీలకర్ర పొడి - అరస్పూను, కారం - అర స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు.
తయారీ విధానం: మెత్తని చపాతీలను పిల్లలు ఇష్టంగా తింటారు. వాటిని మరింత పోషకాహారంగా మారిస్తే చాలా మంచిది. దీనికోసం గోధుమపిండిని ఎప్పటిలాగే చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కలిపి ఒక గిన్నెలో వేసి మూత పెట్టి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ముద్ద కలిపేటప్పుడు కాస్త నూనె వేసి కలిపితే మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు, పనీర్ ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి. పనీర్‌ని, బఠాణీలను చేత్తో నొక్కి మెత్తటి ముద్దలా చేయాలి. ఇప్పుడు చపాతీ ముద్దని తీసుకుని చిన్న పూరీలా ఒత్తి దాని మధ్యలో బఠాణీ-పనీర్ మిశ్రమాన్ని పెట్టి మడతబెట్టేయాలి. దాన్ని గుండ్రంగా ఒత్తుకుని పెనంపై రెండు వైపులా కాల్చుకోవాలి.
టమాటా - బఠాణీ కూర
కావల్సిన పదార్థాలు: టమోటాలు - పావుకిలో, పచ్చిబఠాణీలు - వంద గ్రాములు, నూనె - పెద్ద గరిటెడు, ఉల్లిగడ్డలు - నాలుగు, పచ్చిమిర్చి - పది, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, పసుపు - చిటికెడు, కొత్తిమీర - రెండు చిన్నకట్టలు, ఉప్పు, కారం - తగినంత.
తయారీ విధానం: పచ్చి బఠాణీలను రాత్రి నానబెట్టి కూర వండే ముందు ఉడకబెట్టి వార్చుకోవాలి. టమోటాలు ముక్కలుగా కోసుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి చీలికలిగా తరగాలి. గిన్నెలో నూనెవేసి కాగాక వెల్లుల్లి వేసి తాలింపు పెట్టి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేపాలి. తర్వాత టమోటా ముక్కలు, బఠాణీలు వేసి ఒక్కసారి కల తిప్పి పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. మరోసారి కల తిప్పి మూత పెట్టాలి. టమోటా ఉడికాక కొత్తిమీర తరుగు వేసి రెండు నిముషాలు ఉంచి దించాలి.