Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలకు మంచి చెడులు నేర్పాలి. అంతమాత్రాన... వారు చేసే ప్రతి పనినీ గమనించడం, చేయిపట్టి చేయించడం, వారి ప్రతి నిర్ణయానికీ షరతులు విధించడం వంటివి సరికాదంటారు మానసిక నిపుణులు. ఓవర్ పేరెంటింగ్‌గా పిలిచే ఈ విధానంతో భవిష్యత్తులో సొంతంగా ఆలోచించే శక్తికీ, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలకూ దూరమవుతారని హెచ్చరిస్తున్నారు.
పిల్లలను పట్టించుకోకుండా ఉండే పెంపకంవల్ల కలిగినట్టే, ఓవర్ పేరెంటింగ్తోనూ నష్టం ఉంటుందంటున్నారు నిపుణులు. చిన్నారులకు ప్రతి విషయంలో తల్లిదండ్రులు చేదోడువాదోడుగా ఉండాల్సిన అవసరమెంతో ఉంది. అయితే ఎదుగుతున్నప్పుడూ.. అదే అనుసరిస్తే అది వారి కెరియర్‌కు ప్రతిబంధకంగా మారుతుంది. తోడుగా ఉంటూనే, వారికి సంబంధించిన అంశాల్లో ఛాయిస్ తీసుకోవడానికి అవకాశమివ్వాలి. చిన్నచిన్న సమస్యలకు పరిష్కరాలను వారినే ప్రయత్నించమని చెప్పాలి. అలా కాకుండా వారికెదురయ్యే ప్రతి సమస్యకూ.. పెద్దవాళ్లే ఆలోచిస్తే, మున్ముందు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చేయలేరు. వేసే అడుగులో పొరపాట్లు దొర్లినప్పుడు దానిపై అవగాహన కలిగించి సరిదిద్దుకోవడమెలాగో నేర్పాలి. అలా కాక పెద్దవాళ్ల మాటలు వినకపోతే ఇలాగే జరుగుతుందంటూ విమర్శలు మొదలుపెడితే వైఫల్యాన్ని విజయాలుగా మార్చుకోవడమెలాగో ఎప్పటికీ తెలుసు కోలేరు. కొత్త ప్రయత్నాలు చేయడానికీ వెనుకాడతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోలేని స్థాయికి చేరతారు.
సరైన నిర్ణయం తీసుకోక తప్పటడుగు వేస్తారేమో అని ముందుగానే భయంతో అడ్డుపడకుండా, సహనంగా పిల్లలను ప్రోత్సహించాలి. పెద్దవాళ్లు చెప్పే పాఠాలుకన్నా, వైఫల్యాల నుంచి మరింత తేలికగా సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సైకిల్ నేర్చుకొంటే కింద పడిపోతావని పూర్తిగా దానికి దూరంగా ఉంచితే ఏమవుతుంది? ఎప్పటికీ నేర్చుకోలేరు. అలా కాకుండా, పిల్లలు కింద పడకుండా తొక్కడం నేర్పే శిక్షకుడిలా పెద్దవాళ్లు మారాలి. వారికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని అనుసరించి నీడలా వెంటాడటం కన్నా.. స్వేచ్ఛనిచ్చి చూడాలి. అది సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్పుతుంది. ప్రతి విషయానికీ ముందుకు ముందే సలహాలివ్వకూడదు. అప్పుడే వారికి ఆలోచించడమెలాగో తెలుస్తుంది. అవసరమైనప్పుడు మాత్రం సూచనలిస్తూ.. పిల్లలకు తల్లిదండ్రులు స్ఫూర్తిగానూ నిలిస్తే చాలు. భవిష్యత్తుకు కావాల్సిన నైపుణ్యాలను వారే అందుకొంటారు.