Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలలు కనడానికి పేదరికం అడ్డుకాదు. కృషి, పట్టుదల ఉండాలే కానీ మన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. 'కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి' అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలు ఎంతోమంది యువత స్పూర్తిగా తీసుకుని వారి కలల్ని సాకారం చేసుకుంటున్నారు. అలాంటి జాబితాలో ఇటీవలె ఓ దినసరి కూలి కూతురు చేరింది. పేదరికం తన కలలకు అడ్డుకాదని నిరూపించి కేవలం 25 ఏండ్లకే న్యాయమూర్తి అయ్యింది. ఆ యువ న్యాయమూర్తి గాయత్రి. తన పేరు పక్కన న్యాయమూర్తి అనే నాలుగు అక్షరాలు చేర్చుకోవడం కోసం అహర్నిశలు కష్టపడింది. అత్యంత చిన్న వయసులోనే కర్ణాటకలోని కోలారు సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమించబడింది. ఆ కష్టం వెనుక ఆమె పట్టుదల ఉంది. పేదరికంలో పుట్టినా కష్టపడి చదివి న్యాయమూర్తిగా అవకాశాన్ని దక్కించుకుంది.
కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటకు, యళబుర్గికి చెందిన నారాయణస్వామి, వెంకటలక్ష్మి దంపతులకు గాయత్రి ఒక్కగానొక్క కూతురు. అత్యంత పేదరికంలో పెరిగింది. ఏదో సాధించాలనే తపనతో ఉన్న గాయత్రికి తన శ్రమకు తగిన ఫలం దక్కింది. 2021లో లా డిగ్రీ పూర్తి చేసిన గాయత్రి తన కలను సాకారం చేసుకోవాలనే నిరంతర కృషి చేస్తుంది. ఆమె సంకల్పం ఫలితంగా 25 ఏండ్ల వయసులో కర్ణాటక సివిల్ కోర్టులో న్యాయమూర్తి అయ్యారు. సివిల్ జడ్జిగా విజయవంతంగా ఎన్నికయ్యారు.
పేదరికంలో పుట్టింది
కర్ణాటక హైకోర్టు సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఇటీవలె ఆ ఫలితాలను ప్రకటించింది. ఎంపిక జాబితాలో గాయత్రి పేరు కూడా ఉంది. ఇప్పుడు ఆమె ఆనందానికి అవధులులేవు. అట్టడుగు కులంలో, పేదరిక నేపథ్యం నుండి వచ్చిన గాయత్రి ఎన్.కారహళ్లిలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంది. కోలారు ఉమెన్స్ కాలేజీలో బీకాం పూర్తి చేసింది. కేజీఎఫ్‌లోని కెంగల్ హనుమంతయ్య కాలేజీలో 2021లో లా పూర్తి చేసింది. యూనివర్శిటీలో నాలుగో ర్యాంకు సాధించింది. అదే సంవత్సరం సివిల్ జడ్జి పోస్టులకు నిర్వహించిన డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత రెండోసారి ప్రయత్నించి ఫలితం సాధించింది.
కన్నవారి కోరికను నెరవేర్చింది
గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరూ రోజువారి కూలి పనులకు వెళ్ళేవారు. సంపాదించిన కొద్దిపాటి డబ్బుతోనో కూతుర్ని కష్టపడి చదివించారు. తమలా తమ ఒక్కగానొక్క కూతురు కష్టపడకూడదని తపన పడ్డారు. తల్లిదండ్రుల తపనను అర్థం చేసుకున్న గాయత్రి కష్టపడి చదివింది. కూతున్ని ఉన్నత స్థానంలో చూడాలనుకున్న కన్నవారి కోరికను నెరవేర్చి ఇప్పుడు న్యాయమూర్తిగా అవకాశాన్ని దక్కించుకుంది.
వారి ప్రోత్సాహంతో...
సీనియరు న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం వద్ద గాయత్రి జూనియర్ న్యాయవాదిగా పనిచేసింది. ఆమెలో ఉన్న ప్రతిభ, పట్టుదల గమనించిన న్యాయవాది శివరాం సుబ్రహ్మణ్యం సివిల్ న్యాయమూర్తి పరీక్షలకు హాజరు కావటానికి చదవాల్సిన పుస్తకాలను ఇచ్చి ప్రోత్సహించారు. ఆమెకు అన్ని రకాలుగాను సహకరిచారు. అలా సుబ్రహ్మణ్యం నమ్మకాన్ని, తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తూ 25 ఏండ్లకే సివిల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులైంది. ఓ సాధారణ దినసరి కూలి కూతురు న్యాయమూర్తి అయ్యి అందరి నుండి ప్రశంసలు అందుకుంటుంది.
ప్రశంసల జల్లు
పేదరికంలో పుట్టి పెరిగా గాయత్రికి మొదటి నుంచీ సామాజిక అవగాహన ఎక్కువ. జీవితంలో ఏదో సాధించాలనే తపన ఆమెలో నిత్యం ఉండేది. ఆ తపనతోనే కష్టపడి చదివింది. శ్రమకు తగిన ఫలం దక్కించుకుంది. ఇప్పుడు ఇంత చిన్న వయసులో గాయత్రి సాధించిన ఘనత కోలార్ జిల్లా అంతటా ప్రశంసించబడింది. సోషల్ మీడియాలో విశేషమైన ప్రశంసలు అందుకుంటుంది.