Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐఏఎఫ్ ఫైటర్ పైలట్ అవనీ చతుర్వేది... మన దేశంలో మొదటి మహిళా ఫైటర్ పైలట్లుగా చరిత్ర సృష్టించిన ముగ్గురిలో ఈమె కూడా ఒకరు. అప్పటి నుండి ఆకాశంలో ఎగురుతూనే ఉంది. కొత్త శిఖరాలకు చేరుకుంటూనే ఉంది. అతి త్వరలో భారతదేశం, జపాన్ మధ్య జరిగే మొట్టమొదటి వైమానిక పోరాటంలో తన సుఖోరు - 30MKI జెట్‌ను ఎగురవేయనుంది. ఇటువంటి యుద్ధ క్రీడల్లో పాల్గొనే మొదటి మహిళా ఐఏఎఫ్ ఫైటర్ పైలట్ కూడా ఈమే కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ఒక్కసారి
మననం చేసుకుందాం...
అవనీ చతుర్వేది ఐఏఎఫ్ దళ సభ్యురాలిగా భారతదేశం వెలుపల యుద్ధ క్రీడలలో పాల్గొనబోతున్నారు. గతంలోనే భారతదేశపు మొదటి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్లలో ఆమె ఒకరుగా నిలిచి రికార్డు సృష్టించారు. ఈ నెలాఖరులో భారతదేశం, జపాన్ల మధ్య జరిగే మొట్టమొదటి వైమానిక పోరాట వ్యాయామంలో ఆమె తన సుఖోరు-30MKI జెట్‌ను ఎగురవేయనున్నారు. విదేశాల్లో ఇటువంటి వైమానిక యుద్ధ క్రీడల్లో పాల్గొన్న మొదటి ఐఏఎఫ్ మహిళా ఫైటర్ పైలట్‌గా నిలిచి ఆమె మరోసారి రికార్డు బద్దలు కొట్టారు.
ఇదే తొలిసారి
దాదాపు ఏడేండ్ల కిందట దేశ వైమానిక దళంలో ఫైటర్ పైలట్లుగా నియమితులైన మొదటి మహిళల సమూహంలో అవనీ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు మహిళా ఫైటర్ పైలట్లు పాల్గొన్న ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్‌తో సహా భారతదేశానికి వచ్చే విదేశీ బృందాలతో మహిళా అధికారులు యుద్ధ క్రీడల్లో పాల్గొంటున్నారు. అయితే విదేశాల్లో మహిళా అధికారులు దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి.
జెట్‌ను ఎగురవేయబోతోంది
అవనీ గురించి ప్రస్తుతం చెప్పుకోవల్సిన గొప్ప విషయం సుఖోరు - 30MKI జెట్‌ను ఎగురవేయడం. అంతేకాకుండా ఆమె MiG-21 బైసన్ ఫైటర్ జెట్‌లో అర్హత సాధించింది. అలాగే తన హాక్ అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ శిక్షణను కూడా పూర్తి చేసింది. మోహనా సింగ్ జితర్వాల్, భావనా కాంత్‌లతో పాటు ఆమె పోరాటంలో ప్రయాణించిన మొదటి మహిళల్లో ఒకరు.
హైదరాబాద్ అకాడమీలో
మధ్యప్రదేశ్‌కు చెందిన అవనీ 1993 అక్టోబర్‌లో జన్మించింది. తండ్రి దినకర్ చతేర్వేది ఇంజనీర్‌గా చేస్తున్నారు. తల్లి గృహిణి. ఈమె పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత బనస్థలి (యూనివర్శిటీ) నుండి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని పూర్తి చేశారు. తర్వాత యూనివర్సిటీ ఏవియేషన్ స్కూల్లో ఏవియేషన్ చదివారు. ఐఏఎఫ్ ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరడానికి ముందు ఆమె హైదరాబాద్‌లోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆరు నెలల ఇంటెన్సివ్ శిక్షణను పూర్తి చేశారు. 2016లో ఫైటర్ పైలట్‌గా చేరారు. 2018లో MiG-21 నడిపిన మొట్ట మొదటి మహిళా ఫైటర్ పైలట్లలో ఒకరిగా నిలిచారు.
పోరాట స్థానాలలో మహిళలు
''జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌తో 2023 జనవరి 12 నుండి 26 వరకు జరిగే తొలి ఎక్సర్సైజ్ వీర్ గార్డియన్ 2023 కోసం జపాన్‌లోని హ్యకురి ఎయిర్ బేస్‌కు ఐఏఎఫ్ బృందం రేపు బయలుదేరుతుంది. ఐఏఎఫ్ నాలుగు Su-30 MKI, రెండు C-17తో పాల్గొంటుంది. గ్లోబ్మాస్టర్స్, ఒక IL-78 ట్యాంకర్'' అని భారత వైమానిక దళ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేసింది. సిబ్బంది చిత్రాలను పంచుకున్నారు. వీర్ గార్డియన్ 2023 జపాన్‌లో జనవరి 16 నుండి జనవరి 26 వరకు ఒమిటమాలోని హ్యకురి ఎయిర్ బేస్, దాని చుట్టుపక్కల ఎయిర్‌స్పేస్‌లో అలాగే సయామాలోని ఇరుమా ఎయిర్ బేస్‌లో జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశ మూడు సైనిక శాఖలలో ఐఏఎఫ్ మాత్రమే మహిళలను పోరాట స్థానాల్లో అనుమతిస్తుంది.