Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్లి కళ అనేది మహారాష్ట్రలోని గిరిజనులు సృష్టించిన కళ. సాంప్రదాయ గిరిజన శైలితో ఈ కళ ఉద్భవించింది. కాగితం, కాన్వాసులపై వర్లి చిత్రకళను చిత్రిస్తారు. ''జివ్య మాషే'' ఈ వర్లి చిత్రకళకు మంచి గుర్తింపును తీసుకురావడం వల్ల అతనికి వర్లి పెయింటింగ్ ఆధునిక పితామహుడిగా కీర్తిస్తారు. ఈ మధ్య కొన్ని కంపెనీలు పురాతన సంప్రదాయ కళలను తిరిగి ప్రచారంలోకి తేవడం ప్రారంభించారు. దాని వలన ఇలాంటి వర్లి, కచ్ వర్కులు తిరిగి తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. గిరిజన సంస్థలు ఆదివాసీ కళలను ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. భారత దేశంలోని అతిపెద్ద తెగలలో వర్లీ తెగ మొదటిది. ఈ తెగ ముంబైకు వెలుపల నివసిస్తుంది. 1970లలో ప్రాచుర్యం పొందిన ఈ గిరిజన శైలి పదవ శతాబ్ధం ఏడి ల కాలం నాటిదని భావిస్తున్నారు. ఈ కళ మాతృ ప్రకృతి భావనపై కేంద్రీకృతమై ఉంటుంది. ప్రకృతి అంశాలపై ఎక్కువగా వేస్తారు. కళాకారులు తమ గుడిసెలనే కాన్వాసుగా ఉపయోగిస్తున్నారు.
ఇంటికి చేరిన కుటుంబం
ఈ చిత్రకళను ఎక్కువగా గోడలపైనే వేస్తారు. మట్టి గుడిసెల్లో గోడలకు ఎర్రమంట్టి రంగును పూశాక దానిపై తెలుపు, నలుపు రంగుతో ఈ చిత్రకళను వేస్తారు. కేవలం రేఖలతోనే మనిషి రూపురేఖలు గీసేస్తారు. ఏ వస్తువైనా మనిషైనా త్రికోణాలు, గీతలతో మాత్రమే ఈ శైలి ఉంటుంది. చూడటానికి సులభంగా అనిపిస్తుంది. కానీ శ్రద్ధ పెట్టాల్సిందే. తల కోసం ఒక గుండ్రాన్ని గీయటం, శరీరానికి రెండు త్రికోణాలను వ్యతిరేక దిశలో గీయటం. రెండు పుల్లల్లాంటి కాళ్ళు, చేతులు - చూస్తుంటే గీయటం ఎంతసేపు అనిపిస్తుంది. కానీ ప్రాక్టీస్ చాలా అవసరం. డ్రాయింగ్ షీటుపై ఒక కుటుంబాన్ని చిత్రిద్దాం. సాయం సంధ్యవేళ ఇంటికి చేరే భార్యాభర్తలు, ఒక పాపను వేస్తున్నాను. భర్త తల మీద కట్టెల మోపు, భార్య తలపై కుండ, వీరి వెనకగా చిన్న పాపను వెయ్య దలిచాను. సాయంత్రమయింది కదా అని ఆకాశంలో చంద్రుడు చుక్కలు పెట్టేశాను. దగ్గరగా ఉన్న గుడిసెలో కాంతి వెలుగుతున్నట్టుగా పసుపు రంగును వేశాను. ఆకాశం నిండు బులుగు రంగును వేశాను. మొదటగా డ్రాయింగ్ షీటు బాక్ గ్రౌండును తయారు చేసుకోవాలి. దాని తర్వాత నలుపు రంగు స్కెచ్ తీసుకొని పురుషుడు, మహిళ, బాలిక బొమ్మల్ని చిత్రించాను. మొదట్లో స్కెచ్ పెన్నుతో వేసుకుని కొద్దిగా చెయ్యి తిరిగాక బ్రష్‌తో వేసుకోవచ్చు. ఒకటి రెండు సార్లు వేస్తే చెయ్యి తిరిగి నైపుణ్యం వస్తుంది.
వృత్తాకారంలో మహిళలు
వేట, వ్యవసాయం, నాట్యం వంటి అంశాలను ఆదిమానవుడు గుహలపై చిత్రీకరించాడు. ఆనాటి సాంఘిక జీవనం తప్ప ఎక్కడా పురాణ చిత్రాల జోలికి పోలేదు. గోడల మీద నుండి కాగితాల వరకు పాకిన ఈ కళ చాలా కాలం వరకు కూడా వివాహిత స్త్రీల కాలక్షేపపు కళగానే మిగిలి పోయింది. వర్లి, మల్ఖర్ కోలీ అనే తెగలు ప్రకృతిని పూజిస్తారు. సూర్య చంద్రులు, ఉరుములు, మెరుపులు, గాలి, వర్షం వంటి ప్రకృతి అంశాలనే ఆరాధ్య దైవాలుగా భావిస్తారు. జనన మరణాలలో వివాహాలలో వృత్తాలను చిత్రిస్తారు. మృత్యువును అంతంగా కాకుండా ఆరంభంగా చిత్రిస్తారు. ఇప్పుడు వృత్తాకారంలో నిలబడిన మహిళలను చిత్రిద్దాం. చాలా వరకు పూర్వకాలపు ముగ్గుల్లో అమ్మాయిలను ఇలాగే చిత్రిస్తారు. రెండు పెద్ద వృత్తాలను గీసుకొని వాటి మధ్యగా అమ్మాయిలను నిలబడితే బాగుంటుంది. వృత్తాకారంలో ఉన్న అమ్మాయిలు ఒకరి చెయ్యి మరొకరు పట్టుకున్నట్టుగా ఉంటుంది. మధ్యలో ఒక తబలాను పెడదాం. ఏదైనా మ్యూజికల్ పరికరాన్ని పెట్టవచ్చు. చుట్టూ బార్డర్‌ను కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ముందుగా పెన్సిల్‌తో వేసుకున్న చిత్రాలకు రంగులు అద్దాలి. మహిళల దుస్తులకు రంగులు అద్దవచ్చు. గుండ్రటి తలలకు కొప్పులు పెడితే అమ్మాయిలు అయిపోయినట్టే. బార్డర్‌ను కూడా త్రికోణాలుగా వేసి రంగులు వేస్తే బాగుంటుంది. వర్లి చిత్రకళను అందంగా వాడుకోవచ్చు. నాలుగు మూలలా సూర్యుడ్ని కూడా వేయవచ్చు.
హ్యాంగింగ్
ఈ చిత్రంలో కేవలం రెండు వర్లి చిత్రాలు గీద్దాం. దీనిని చాలా సులభంగా చేశాను. ఇద్దరు మహిళలు ఒక డ్రమ్‌ను మాత్రమే వేశాను. బ్యాక్ గ్రౌండ్ కూడా ఒక రంగునే వాడాను. కేవలం పసుపు రంగునే తీసుకున్నాను. అయితే ఈ చిత్రానికి బార్డర్‌గా చిన్న సైజులో మహిళలు చేయి చేయి పట్టుకుని నడుస్తున్నట్టుగా గీశాను. బార్డర్‌లోని మహిళలకు కేవలం నలుపు రంగులు వేశాను. ఇద్దరూ కలసి డ్రమ్ వాయిస్తున్నట్టుగా వేశాను. ఇలా తయారు చేసిన అట్టను నాలుగు కర్రలతో ఫ్రేమ్ చేసినట్టుగా అతికించాలి. వెనక వైపున వేలాడ దీసేందుకు గట్టి కాడను అతికించాలి. గోడకు వేలాడ దీసుకుంటే బాగుంటుంది.
వర్లి సాంప్రదాయం
సాదాగా ఉండే తెల్లని కాగితం పైన కాకుండా మిక్స్డ్ కలర్‌తో తయారు చేద్దాం. దీని కోసం తెల్లని కాగితాన్ని తీసుకొని దానిపై క్రేయాన్స్‌తో ఆకుపచ్చ పసుపు రంగులతో దిద్దుకోవాలి. లేదా ఎరుపు, పసుపు పేస్ట్రెల్స్తో కలిపి రంగుల్ని బ్రష్ సహాయంతో మిక్స్డ్ బ్యాక్ గ్రౌండ్‌ను తయారు చేసుకోవాలి. దీనిపై మనకు నచ్చిన చిత్రాలను వేసుకోవాలి. ఇక్కడ ఒక్క మహిళనే వేసుకుందాం. అది కూడా ఇక్కడ తెలుపు రంగును వాడదాం. ఇప్పటి వరకు వేసినట్టుగా నలుపు రంగుతో కాకుండా తెలపు రంగును వేస్తే బాగుంటుంది. నాలుగు మూలలా అర్థ చంద్రాకార వృత్తాలను గీసి వాటి మధ్యలో మరల వర్లి మనుష్యులను గీయాలి. వాటి మధ్యలో సూర్యుడ్ని గీయాలి. సూర్య చంద్రులు ఈ తెగల ఆరాధ్య దైవాలు. అందుకే ప్రతి చిత్రంలో వారి సాంప్రదాయాన్ని ప్రతి బింబించేలా గీసుకుంటే బాగుంటుంది. సెంటర్లో ఉన్న మహిళను గీసి ఆమె దుస్తులకు బాగా గీతల డిజైను వేశాను. ఈ మహిళ కొమ్ము బూర ఊదుతున్నట్టుగా వేశాను. తర్వాత ఈ మహిళ దుస్తులకు రంగులు వేయనవసరం లేదు. కేవలం తెలుపు రంగుతోనే డిజైన్ చేయాలి.
వాయిద్యాన్ని వాయిస్తున్నట్టు
ఈ చిత్రానికి కూడా తెలుగు రంగు పెయింట్‌తోనే వేద్దాం. ఇంతకు ముందు వరకు నలుపు రంగును వాడాం కదా! హారాష్ట్రకు సంబంధించిన వెబ్సైట్లు, బస్సులు, భవనాలు వంటి వాటిపై వర్లి చిత్రాలనే అధికారికంగా చిత్రిస్తున్నారు. ఏదో ఒక సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ ఉన్న మనిషి, అతని చుట్టూ అనేక మంది నాట్యం చేస్తున్నట్టుగా ఉండే దృశ్యాలు ఎక్కువగా ఉంటాయి. చెట్లు, మనుషులు, పక్షులు ఒక దానితో ఒకటి కలసి స్పందించే చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా మట్టి గోడలపై ఎర్రజాజు పూసి దానినై తెల్లని పెయింట్‌తో వర్లి చిత్రాలను గీసినట్టుగా కాగితంపై వేద్దాం. అదే రంగు కాగితంపై వేసి దాని మీద తెలుపు రంగు చిత్రాలను వేద్దాం. కాగితంపై ఎర్రమట్టి రంగును వేసుకుని నలుగురైదుగురు మనుష్యులను గీసి ఇద్దరు మనుష్యులు వాయిద్యం వాయిస్తున్నట్టుగా వేద్దాం. వెనకవైపు రెండు కొబ్బరి చెట్లను ప్రకృతికి గుర్తుగా వెయ్యాలి. ఇలా రకరకాలుగా వర్లి చిత్రకళను వేద్దాం.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్