Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో సహజంగానే దాహం అంతగా ఉండదు. అలాగని నీరు తాగడం మానేస్తే శరీరానికి కావాల్సిన నీరు అందదు. ఫలితమే దేనిమీదా ఆసక్తి లేకపోవడం, అలసట.. కొన్నిసార్లు చర్మ, అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. వాటన్నింటి నుంచీ తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి.
ఈ కాలం బోర్ కొట్టనిది ఏదైనా ఉందంటే టీనే! వెచ్చగా తాగుతోంటే ఉత్సాహమొచ్చినట్టు అనిపిస్తుందని ఎన్ని సార్లైనా తాగేస్తుంటాం. కెఫిన్ శరీరంలోకి అధికంగా చేరినా సమస్యే! బదులుగా చామంతి టీని తాగండి. ఒళ్లు నొప్పులు, నిద్రలేమి, ఆందోళన, కడుపుబ్బరం వంటివి దూరమై చక్కని నిద్రా దరి చేరుతుంది.
ఇంట్లో వాళ్లకి జలుబు చేసినప్పుడు పాలల్లో పసుపు వేసిస్తుంటాం. ఈ బామ్మల చిట్కా నలతగా ఉన్నప్పుడే కాదు.. రోజూ ప్రయత్నించొచ్చు. శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాదు జలుబు లక్షణాలను దూరం చేయడం, చక్కని నిద్ర పట్టేలా చేయడంలోనూ సాయపడుతుంది. పాలు శరీరాన్ని హైడ్రేట్ చేస్తే.. పసుపు ఆరోగ్యాన్నిస్తుంది.
శీతకాలం ఆహారం త్వరగా జీర్ణమవదు. కాబట్టి.. నీటితోపాటు పోషకాలు, ఫైబర్ వంటివీ అందేలా చూసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, టొమాటో వంటి వెజిటబుల్ జ్యూసులు, తాజా పండ్ల రసాలకు పుదీనా, కొత్తిమీర వంటివి చేర్చి తీసుకోండి. శరీరానికే కాదు.. ముఖానికీ తేమ అందుతుంది.
చలి గాలికి నోటికి తిండి సహించదు.. పిల్లలూ వద్దని మారాం చేస్తుంటారు. అందుకే ఓ పూట సూప్‌ని తప్పనిసరి చేయండి. జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది.