Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమెకు పాటంటే ప్రాణం.. పొద్దున లేచింది మొదలు మనసునిండా గాత్రమే.. సముద్రాన్ని వీడని కెరటంలా అనుక్షణం ఆమె గొంతు సరిగమప రాగం తీస్తూనే ఉంటుంది. ఓవైపు వృత్తి బాధ్యతలు, మరోవైపు తనకిష్టమైన గానం ఈ రెండింటికీ సమన్యాయం చేస్తోంది. ప్రభుత్వ వసతిగృహ సంక్షేమాధికారిగా చిన్నారుల భవితవ్యాన్ని మోస్తూనే తెలుగు, హిందీ పాటల్ని తన మృదువైన గొంతుతో పాడుతూ ప్రతిభను చాటుతోంది. చిన్నప్పటి నుంచే పాటలపై మక్కువ పెంచుకున్న ఆమె ఇప్పుడు సంగీత సాగరంలో విపంచి వీణలా విహరిస్తోంది. రెండేండ్లప్పుడు పాఠశాలలో పాడిన పాట ఆమెకు అమితమైన గుర్తింపు తెచ్చింది. నాలుగు దశాబ్దాలుగా అదే స్వరంతో గాన కచేరీలూ, ఆర్కెస్ట్రాలు, పలు ప్రదర్శనలు ఇస్తూ శ్రోతలను అలరిస్తోంది. పాటల పూదోటలో విరబూసిన 'పద్మ'జ పరిచయం ఈ రోజు మానవిలో...
ఎర్రోజు పద్మజ... పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ. తండ్రి ఆదినారాయణ సాహిత్యకారుడు. తల్లి ఈశ్వరమ్మ గాయని. పద్మజ ప్రాథమిక, సెకండరీ విద్య వేములవాడ, ఇంటర్ కరీంనగర్, డిగ్రీ సిద్దిపేట, బీఎడ్ చెన్నరులో చేశారు. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం గనుక ఆమెపై సహజంగానే వారి ప్రభావం పడింది. చిన్నప్పటి నుంచే పాటల్లో రాణిస్తున్న బిడ్డను గుర్తించిన తల్లిండ్రులు వరంగల్‌లో రాజేశ్వరి వద్ద సంగీతంలో శిక్షణ కూడా ఇప్పించారు. ఓవైపు సంగీతతో ఓనమాలు నేర్చుకుంటూనే మరోవైపు చదువును యథాతథంగా కొనసాగించారు.
ఆత్మ విశ్వాసం కోల్పోలేదు
1988లో వసతిగృహ సంక్షేమాధికారిగా ఉద్యోగంలో చేరారు. కేశవపట్నం, రామగుండం, ఎల్కతుర్తి, హుజురాబాద్, వీణవంక మండలాల్లో తనదైన శైలితో వృత్తిలో రాణించారు. విద్యార్థినులను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నతంగా తీర్చి దిద్దడంలో తనదైన పాత్రను పోషించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా వారికి శిక్షణ ఇప్పించారు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదనేది ఎంతటి చేదు నిజమో కష్టపడితే ఫలితాలు కూడా అదే స్థాయిలో అందలం ఎక్కిస్తాయనేది కూడా అంతే వాస్తవం. పద్మజ కూడా తన జీవితంలో రాణించడానికి ఎన్నో ఒడిదుడుకులు, ఆటు పోట్లను ఎదుర్కొన్నారు. కానీ ఆమె ఎన్నడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదిరించారు. అవకాశమిస్తే మహిళలకు సాటి ఎవరూ రారని నిరూపించారు. ఓవైపు పాటలు పాడుతూనే తన వృత్తి బాధ్యతల్ని నిర్వర్తించారు. విద్యార్థుల పట్ల కనబరుస్తున్న శ్రద్ధకుగాను అప్పటి హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి నుండి ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ అధికారిణిగా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేతుల మీదుగా ఆవార్డు, సత్కారం పొందారు.
సమన్వయం చేసుకుంటూ...
1995లో పద్మజకు రవీందర్‌తో వివాహమైంది. వారికి గాయత్రి, కళ్యాణ్ ఇద్దరు సంతానం. పెండ్లయిన తర్వాత ఆంక్షల మధ్య తమ కిష్టమైన రంగాలను వదులుకుంటున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. సమాజంలో ఒంటరి పయనం కష్టమైన విషయం అందరికీ తెలిసిందే. తమ రంగాల్లో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భలూ అనేకం. ఆ విషయాల్ని కూడా సందర్భోచితంగా వివిధ వేదికలపై చెప్పినవారు ఉన్నారు. కానీ పద్మజకు అలాంటి పరిస్థితి రాలేదు. భార్య ఇష్టాన్ని గమనించి భర్తనే చేదోడు వాదోడుగా ఉన్నాడు. తనది కూడా ప్రభుత్వ ఉద్యోగమే అయినప్పటికీ బాధ్యతల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు కదిలాడు. ఒక్కమాటలో చెప్పాలంటే పాటకు ఆమె పల్లవి అయితే ఆయన చరణంలా సాగాడు. ఎక్కడ పాటల కార్యక్రమం జరిగినా దగ్గరుండి తీసుకెళ్లేవాడు. అది పద్మజకు మరింత ప్రోత్సాహం, ఉత్తేజాన్ని కలిగించింది. ప్రదర్శనలు చిన్నవా, పెద్దవా అనే తేడా లేకుండా ఎవరు ఆహ్వానించినా వెళ్లి పాటల్లో తన ప్రత్యేకతను కనబరిచేవారు. అలా కరీంనగర్ కళాభారతిలో ప్రారంభమైన ఆమె పాటల ప్రస్థానం హైదరాబాద్ రవీంద్రభారతి వరకూ కొనసాగింది.
అవార్డులు.. ప్రశంసలు..
పద్మజకు తెలుగు, హిందీ పాటలంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు వెయ్యి వరకు ప్రదర్శనలు ఇచ్చారు. కన్నడ నుంచి తెలుగుకు డబ్బింగ్ అయిన ఐదు సినిమాలకు పాటలు పాడారు. 2006 సంవత్సరంలో రామకృష్ణ ప్రొడక్షన్ వారు పద్మజకు 'గాన కోకిల' బిరుదును ఇచ్చారు. ఓ ప్రదర్శనలో సంగీత దర్శకుడు మాధవపెద్ది సత్యం ఆమె పాటలకు పరవసించి స్వయంగా తానే స్టేజీమీద సత్కరించాడు. విజయవాడలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల్లోనూ ఆమె ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు. 'ఎన్కౌంటర్ దయానాయక్' చిత్రంలో కొత్త సింగర్స్‌ను పరిచయం చేసేందుకు చెన్నరులో నిర్వహించిన ఆడిషన్స్‌లో పద్మజ ఎంపికయ్యారు. కానీ అనివార్య కారణాల వల్ల అందులో పాడలేకపోయారు. ఇలా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆమె ఐదు వేలకు మించి పాటలు పాడారు. ప్రతియేటా రాగ కల్చరల్ అకాడమీ కరీంనగర్ వారు నిర్వహించే పాటల కార్యక్రమంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఘంటసాల వర్థంతి సందర్భంగా అలనాటి గీతాలపై పాడిన పాటలు ఆమెకు అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. నిత్యం పాటలనే ఆరాధించే పద్మజ రోజురోజుకూ అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. స్టార్మేకర్లోనూ ఆమె పాటల్ని అభిమానించేవారి సంఖ్య పెరుగుతోంది.
- హింగే రాజేశ్వర్‌రావు, ఎల్కతుర్తి