Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైనది. గణతంత్ర దినోత్సవంగా జరుపుకునే 26 జనవరి 1950న ఇది చట్టబద్ధంగా అమలు చేయబడింది. రాజ్యాంగ అసెంబ్లీలోని 299 మంది సభ్యులలో 15 మంది మహిళలు ఉన్నారు. కాని వీరి గురించి అంతగా బయటి ప్రపంచానికి తెలియదు. వారిలో ప్రతి ఒక్కరు ఆనాడు ఒక్కో చరిత్ర సృష్టించిన వారు. బాల్య వివాహాలపై పోరాడి, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని ఉద్ధరించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. స్వాతంత్య్ర సమరయోధులుగా, న్యాయవాదులుగా, సంస్కరణవాదులుగా, రాజకీయ నాయకులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ 15 మంది మహిళల జీవితాలను ఒకసారి చూద్దాం.
దాక్షాయణి వేలాయుధన్
34 ఏండ్ల వయసులో దాక్షాయణి అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలు. కొచ్చిన్‌లోని పులయ కమ్యూనిటీకి చెందిన ఆమె తన కమ్యూనిటీలో చదువుకున్న మొదటి తరం మహిళల్లో ఒకరు. 1945లో కొచ్చిన్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నామినేట్ అయ్యారు. అసెంబ్లీ మొదటిసారి సమావేశమైన పది రోజుల తర్వాత దాక్షాయణి దాని ముందు నిలబడి తన మొదటి ప్రసంగం చేశారు.
అమ్ము స్వామినాథన్
ప్రారంభం నుండి బలమైన స్వరాన్ని వినిపించేవారు అమ్ము. తను 13 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవలసి వచ్చినప్పుడు కొన్ని షరతులు పెట్టారు. వీటిలో మద్రాసుకు వెళ్లి ఆంగ్ల విద్యను పొందడం లాంటివి కూడా ఉన్నాయి. 1914లో ఆమె రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మూడేండ్ల తర్వాత 1917లో అన్నీ బిసెంట్, మార్గరెట్ కజిన్స్, మాలతీ పట్వర్ధన్, శ్రీమతి దాదాభోరు, శ్రీమతి అంబుజమ్మల్ వంటి ఇతర ప్రముఖులతో కలిసి ఉమెన్స్ ఇండియా అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. 1934లో మద్రాసు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అణచివేత, కుల వ్యవస్థ నిర్మూలన కోసం పని చేసిన ఒక దృఢమైన న్యాయవాది అమ్ము.
తహంసా జీవరాజ్ మెహతా
''పురుషులందరూ స్వేచ్ఛగా, సమానంగా జన్మించారు'' అన్న దాన్ని ''మానవులందరూ స్వేచ్ఛగా, సమానంగా జన్మించారు'' అని సవరించబడింది. ఈ మార్పు చిన్నదే అయినప్పటికీ దాని ప్రభావం చాలా విస్తృతమైనది. అయితే దీని క్రెడిట్ పూర్తిగా హంసా జీవరాజ్ మెహతాకే దక్కుతుంది. 1897 జూలై 3న సంపన్నుల కుటుంబంలో జన్మించిన హంసా తండ్రి మనుభారు నందశంకర్ మెహతా, అప్పటి బరోడా దివాన్. ఆమె చిన్నతనంలో ఇంగ్లాండ్ వెళ్లి భారతదేశానికి తిరిగి వచ్చే ముందు సోషియాలజీ, జర్నలిజం పూర్తి చేశారు. హంసా సహాయ నిరాకరణ, స్వదేశీ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె 1937లో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ స్థానం నుండి మొదటి ప్రావిన్షియల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కౌన్సిల్లో రెండు పర్యాయాలు (1937-39, 1840-49) పనిచేశారు. తదనంతరం రాజ్యాంగ సభలో చేరారు.
లీలా రాయ్
అక్టోబరు 1900లో అస్సాంలోని గోల్‌పరాలో జన్మించిన లీలా 1923లో ఢాకా విశ్వవిద్యాలయం నుండి ఎమ్మె పట్టా పొందిన మొదటి మహిళ. అదే సంవత్సరంలో ఆమె సామాజిక, రాజకీయాలను ప్రోత్సహించే, బోధించే మహిళల కోసం 'దీపాలి సంఘ'ను కూడా స్థాపించారు. విద్యకు గొప్ప మద్దతుదారు. ఆమె ఢాకాలో మహిళల కోసం రెండవ పాఠశాలను ఏర్పాటు చేశారు. మార్షల్ ఆర్ట్స్, వృత్తి శిక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. ఈమె రచయిత్రి కూడా. 1931లో జయశ్రీని ప్రచురించడం ప్రారంభించారు. ఇది మహిళా రచయితలచే నిర్వహించబడిన మొదటి పత్రిక. లీలా 9 డిసెంబర్ 1946న బెంగాల్ నుండి రాజ్యాంగ పరిషత్ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ నుండి ఎన్నికైన ఏకైక మహిళా సభ్యురాలు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్
మొదట సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు దుర్గాబాయికి 12 ఏండ్లు. 1936లో ఆమె ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఇది తర్వాత మద్రాసు నగరంలో గొప్ప విద్య, సామాజిక సంక్షేమ సంస్థగా మారింది. ''నేను చట్టాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాను. తద్వారా మహిళలకు ఉచిత న్యాయ సహాయం అందించి, తమను తాము రక్షించుకోవడానికి వారికి సహాయం చేయగలను'' అని ఆమె తన ఆత్మకథలో రాసుకున్నారు. అందుకే జైలు శిక్ష తర్వాత ఆమె రాజకీయాల నుండి విద్యపై దృష్టి మళ్లించారు. దుర్గాబాయి న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు మద్రాసు బార్లో చేరారు. ఆమె 1946లో రాజ్యాంగ పరిషత్‌లోకి ప్రవేశించారు.
బేగం ఐజాజ్ రసూల్
రాజ్యాంగ పరిషత్‌లోని ఏకైక ముస్లిం మహిళా సభ్యురాలు ఐజాజ్ రసూల్. 1937లో తన మొదటి ఎన్నికల్లో రిజర్వ్డ్ కాని స్థానం నుండి గెలిచి ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలయ్యారు. అప్పుడే అధికారికంగా పర్దాను వదులుకున్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన రసూల్ చిన్నతనంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె తన తండ్రి జుల్ఫికర్ అలీ ఖాన్‌తో పాటు వివిధ సమావేశాలకు వెళ్లేవారు. కొన్నిసార్లు అతని కార్యదర్శిగా నోట్స్ కూడా తీసుకునేవారు. 1952 నుండి 1958 వరకు భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు. పదిహేనేళ్లకు పైగా భారత మహిళా హాకీ సమాఖ్య అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.
కమల చౌదరి
1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో అత్యంత చురుకైన మహిళా సభ్యులలో ఒకరుగా పేరుగాంచిన మహిళ కమల. ఆ కాలంలో అనేకసార్లు జైలుకెళ్లారు. 1946లో మీరట్‌లో జరిగిన కాంగ్రెస్ 54వ సదస్సులో ఆమె ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1947 నుండి 1952 వరకు రాజ్యాంగ పరిషత్‌లో సభ్యురాలిగా కొనసాగారు. కమలా నిష్ణాతులైన రచయిత్రి, లింగ వివక్ష, దోపిడీపై విస్తృతంగా రాశారు.
సుచేతా కృపాలానీ
స్వాతంత్య్ర సమరయోధురాలు, రాజ్యాంగ పరిషత్ సభ్యురాలు, ముఖ్యమంత్రి, ప్రతిచోటా మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన సుచేతా కృప్లానీ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆమె 1940లో ఐఎన్సీలో మహిళా విభాగాన్ని స్థాపించడానికి బాధ్యత వహించారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన ప్రసిద్ధ ''ట్రిస్ట్ విత్ డెస్టినీ'' ప్రసంగం చేయడానికి ముందు వందేమాతరం, సారే జహాన్ సే అచా, జన గణ మన పాటలను పాడటానికి ఆమెపే ఆహ్వానించబడినప్పుడు ఆమె రాజకీయ జీవితంలో గర్వించదగిన క్షణాలలో ఒకటిగా చెప్పుకుంటారు.
మాలతీ చౌదరి
ఒడిశాకు చెందిన రాజ్యాంగ సభ సభ్యురాలు మాలతి సమాజంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అపారమైన కృషి చేశారు. 16 ఏండ్ల వయసులో ఆమె శాంతినికేతన్ చేరుకుంది. అక్కడ ఆమె విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదువుకుంది. తర్వాత ఒడిషా ముఖ్యమంత్రి అయ్యి 1927లో ఒడిషాకు మారిన నబక్రుష్ణ చౌధురిని వివాహం చేసుకుంది. సత్యాగ్రహ ఉద్యమంలో ఆమె, ఆమె భర్త కీలక పాత్ర పోషించారు. ఒడిశాలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాజీరౌత్ ఛత్రవాస్ వంటి అనేక సంస్థలను ఏర్పాటు చేసిన ఘనత కూడా ఆమెకు ఉంది.
పూర్ణిమా బెనర్జీ
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, 1930ల చివరలో, 1940లలో స్వాతంత్య్ర ఉద్యమంలో అగ్రగామిగా నిలిచిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళల నెట్‌వర్క్‌లో పూర్ణిమ ఒకరు. సామ్యవాద భావజాలం పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తూ రాజ్యాంగ సభలో ఆమె చేసిన ఉద్వేగభరితమైన, ఆవేశపూరిత ప్రసంగం ఆమెకు తరచుగా గుర్తుకు వచ్చే వాటిలో ఒకటి. సత్యాగ్రహ, క్విట్ ఇండియా ఉద్యమ నిరసనల సమయంలో జైలు శిక్ష అనుభవించిన ఆమె జైలు నుండి తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారని నివేదికలు చెబుతున్నాయి.
సరోజినీ నాయుడు
''నైటింగేల్ ఆఫ్ ఇండియా'' అని పిలువబడే సరోజినీ నాయుడు 1925లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన మొదటి భారతీయ మహిళ. ఆమె భారత రాష్ట్ర గవర్నర్‌గా కూడా చేశారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీ తర్వాత కేంబ్రిడ్జ్‌లో చదివిన ఆమె సహాయ నిరాకరణ ఉద్యమం వైపు ఆకర్షితురాలయారు. 1924లో ఆఫ్రికా అంతటా పర్యటించి అక్కడి భారతీయుల అభిరుచులను అర్థం చేసుకోవడంలో గడిపారు. 1914లో ఆమె రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్‌కి ఫెలోగా ఎన్నికయ్యారు. 1917లో భారతీయ స్త్రీల పరిస్థితిలో సంస్కరణల శ్రేణిని డిమాండ్ చేయడానికి మోంటాగు-చెమ్స్‌ఫోర్డ్ కమిటీని కలిసేందుకు మహిళా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.
రాజకుమారి అమృత్ కౌర్
1927లో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్‌కు సహ వ్యవస్థాపకురాలిగా, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన మానవతావాది రాజకుమారి అమృత్. ఆమె ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ లెప్రసీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ని ఏర్పాటు చేశారు. లీగ్ ఆఫ్ రెడ్‌క్రాస్ సొసైటీస్ గవర్నర్ల బోర్డు వైస్-ఛైర్‌గా, సెయింట్ జాన్స్ అంబులెన్స్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. బాల్య వివాహాలు, పర్దా వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేశారు. ఈమె దేశానికి మొదటి మహిళా క్యాబినెట్ మంత్రి కూడా.
అన్నీ మస్కరేన్
అన్నీ రాజ్యాంగ పరిషత్‌లో ట్రావెన్కోర్, కొచ్చిన్ యూనియన్‌కు ప్రాతినిధ్యం వహించాయి. అసెంబ్లీలో చర్చల సందర్భంగా ఆమె ఫెడరలిజం గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడారు. మొదటి లోక్‌సభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కేరళ నుంచి లోక్‌సభకు ఎన్నికైన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
విజయలక్ష్మి పండిట్
విజయలక్ష్మి పండిట్‌కి జవహర్లాల్ నెహ్రూ సోదరిగానే కాకుండా మంచి గుర్తింపు ఉంది. స్వాతంత్య్ర సమరయోధురాలు, క్విట్ ఇండియా ఉద్యమంతో సహా అనేక సందర్భాల్లో జైలుకెళ్లారు. దేశపు మొట్టమొదటి మహిళా క్యాబినెట్ మంత్రి, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి మొదటి ఆసియా అధ్యక్షురాలు
రేణుకా రే
రేణుకా రే భారతదేశ స్వాతంత్య్రం, అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఐసీఎస్ అధికారి, సామాజిక కార్యకర్త కుమార్తెగా రేణుకా రే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి బీఏ పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చి ఆల్ ఇండియా ఉమెన్ కాంగ్రెస్‌లో చేరారు. రాజ్యాంగం మహిళల సమానత్వాన్ని గుర్తించడంలో కీలకపాత్ర పోషించారు. 1943 నుండి 1946 వరకు చురుకైన రాజకీయ జీవితాన్ని గడిపారు.
- సలీమ