Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిచెన్ ప్లాట్‌ఫామ్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు.. ఇలా ఇంటిని, ఆయా వస్తువుల్ని శుభ్రం చేయడానికి మార్కెట్లో దొరికే విభిన్న క్లీనింగ్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తుంటాము. ఇందుకు బ్రాండ్ పేరుతో బోలెడంత డబ్బు ఖర్చు పెట్టే వారూ లేకపోలేదు. అయితే వంటింట్లోనే సహజసిద్ధమైన క్లీనర్లుండగా బయటి వాటితో పనేముందంటున్నారు నిపుణులు. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలనే ఇంటిని శుభ్రం చేయడానికీ ఉపయోగించచ్చంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..
కిచెన్ సింక్, ప్లాట్‌ఫామ్, కత్తులు, చాపింగ్ బోర్డు.. వంటి వాటిపై నిరంతరం తేమ ఉండడం వల్ల ఒక్కోసారి నీచు వాసన వస్తుంటాయి. అలాంటప్పుడు నిమ్మచెక్కతో వాటిని రుద్దితే అవి శుభ్రపడతాయి.. చక్కటి సువాసనా వెదజల్లుతాయి. అలాగే ఇత్తడిని మెరిపించడంలో దీనిలోని ఆమ్లగుణాలు సహకరిస్తాయి.
వెనిగర్, నీటిని సమపాళ్లలో తీసుకొని స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. శుభ్రం చేయాలనుకున్న వస్తువులపై ఈ మిశ్రమాన్ని స్ప్రే చేసి పొడిగుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.
ఇక కుళాయి, షవర్‌హెడ్.. వంటివి మూసుకుపోయినప్పుడు.. వెనిగర్‌ను నేరుగా వాటి ఓపెనింగ్ దగ్గర స్ప్రే చేసి కాసేపు అలా వదిలేస్తే ప్రయోజనం ఉంటుంది.
బేకింగ్ సోడా, నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని జిడ్డుగా ఉన్న ప్రదేశాల్లో, దుస్తులపై పడిన గ్రీజు మరకలపై అప్లై చేసుకొని కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తద్వారా వాటి జిడ్డుదనం తొలగిపోవడమే కాదు.. దుర్వాసనలూ మాయమవుతాయి.
కొన్ని పాత్రలు మాడిపోయినప్పుడు వాటిని ఎంత తోమినా ఆ మరకలు తొలగిపోవు. అలాంటప్పుడు కాఫీ పొడిని వాటిపై చల్లి.. కాసేపటి తర్వాత సాధారణంగా తోమితే ఫలితం ఉంటుంది.
అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ వంటివి కట్ చేసినప్పుడు చేతుల నుంచి అదో రకమైన వాసన వస్తుంది. అలాంటప్పుడు కాస్త కాఫీ పొడి రుద్దుకుంటే ఫలితం ఉంటుంది.
పాత్రలు మాడిపోయినా, వాటిపై జిడ్డు మరకలైనా.. ఒకట్రెండు టీబ్యాగ్స్ నానబెట్టిన నీటిలో వాటిని వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు తోమితే అవి శుభ్రపడతాయి.
గాలి తగలడం వల్ల కొన్నాళ్లకు రాగి వస్తువులు నల్లగా మారతాయి.. అక్కడక్కడా మరకలు పడినట్లుగా తయారవుతాయి. ఇలాంటప్పుడు కొద్దిగా టొమాటో కెచప్‌ను ఒక టిష్యూ పేపర్‌పై వేసి దాంతో ఆయా వస్తువులపై రుద్ది.. ఆపై సాధారణ నీటితో శుభ్రం చేయాలి.
బేకింగ్ సోడాను వేడి నీళ్లలో కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని కిచెన్ క్యాబినెట్స్, ప్లాట్‌ఫామ్.. వంటివి శుభ్రం చేయడానికి ఉపయోగించచ్చు.