Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బు నిర్వహణ గురించి కూడా మహిళలకు తెలిసుండాలంటున్నారు ఆర్థిక నిపుణులు. అప్పుడే కుటుంబం ఆర్థికంగా దృఢంగా ఉంటుందంటున్నారు. అంతేకాదు.. మహిళలు ప్రతి దశలోనూ కొన్ని పొదుపు సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం...
పెండ్లయ్యాక అందరు మహిళలు ఉద్యోగం చేయాలని లేదు. ఒక్కోసారి కుటుంబ బాధ్యతలు, ఇతర కారణాల రీత్యా వివాహం తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి గృహిణిగా కొనసాగాల్సి రావచ్చు. అలాంటప్పుడు సైతం ఇంట్లో ఉన్నా డబ్బు నిర్వహణపై దృష్టి పెట్టి ప్రతి రూపాయీ వృథా కాకుండా బడ్జెట్ వేసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు. అందుకే నెలనెలా ఇంటి అవసరాలు, ఖర్చులకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ చర్చించుకొని కొంత బడ్జెట్‌ను నిర్దేశించుకోవాలి. అందులో అత్యవసరమైన వాటికే ఖర్చు పెట్టి మిగిలిన మొత్తాన్ని వివిధ పొదుపు పథకాల్లో పెడితే నష్టభయం ఉండదు.. దీర్ఘకాలంలో వీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టచ్చు.
అనుకోకుండా భర్తను కోల్పోవడం లేదంటే భర్త నుంచి విడిపోవడం.. ఈ రెండు సందర్భాల్లో సింగిల్ మదర్‌గానే మహిళలు తమ పిల్లల బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లల చదువు, పెండ్లి వంటి దీర్ఘకాలిక లక్ష్యాల పైనే ఎక్కువ దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. అయితే అప్పటికే వీటికి సంబంధించిన పొదుపు పథకాల్లో డబ్బు జమ చేస్తుంటే వాటిని కొనసాగించడం.. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ వంటివి తీసుకోవడం.. అవసరమంటున్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చవచ్చు అంటున్నారు. దీంతో పాటు కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని జమ చేసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు. అలాగే మీ పెట్టుబడులు, వాటిలోని లాభ నష్టాల గురించి కూడా ఏ నెలకానెల చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు.
సాధారణంగా చాలామంది విషయంలో.. రిటైర్మెంట్ వయసొచ్చే నాటికే పిల్లల చదువులు, పెండిండ్లు, ఇంటి రుణం.. వంటి పెద్ద లక్ష్యాలన్నీ తీరిపోయి ఉంటాయి. కాబట్టి మిగిలిన సొమ్మును సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్, పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఎఫ్డీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే పన్ను రహిత బాండ్లలోనూ పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ రాబడి పొందడంతో పాటు.. రాబడిపై ఎలాంటి పన్ను ఉండదు. ఇలా మీరు పొదుపు చేసిన డబ్బును ఇటు మీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మీ పిల్లలకూ అందించి సాయపడచ్చు.