Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో అరుగుదల క్షీణిస్తుంది.. విటమిన్ 'డి' లోపంతో రోగనిరోధక శక్తీ తగ్గుతుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి ఈ సమస్యను నివారించాలంటే ఈ కాలంలో లభించే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య రహస్యాల్ని నింపుకొన్న ఆ పదార్థాలేంటో చూద్దాం...
ఈ కాలంలో జీవక్రియలు నెమ్మదించడం వల్ల అదనపు కొవ్వులు, విషతుల్యాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్లకుండా శరీరంలో పేరుకుపోతాయి. దీని ప్రభావం కాలేయంపై పడుతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి శరీరంలోని విషతుల్యాలను బయటికి పంపించి.. కాలేయాన్ని తిరిగి పునరుత్తేజితం చేయడంలో చెరకు రసం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఆల్కలీన్ సమ్మేళనాలే ఇందుకు కారణం. ఇవి శరీరంలో ఆమ్ల స్థాయుల్ని క్రమబద్ధీకరించడంలో సహకరిస్తాయి. అలాగే చలిగాలులకు చర్మం దెబ్బతినకుండా రక్షిస్తాయి.
చలికాలంలో పిల్లలు తరచూ జబ్బు పడుతుంటారు. ఇందుకు కారణం వాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమే! అందుకే రేగు పండును తరచూ వాళ్లకు అందించమంటున్నారు నిపుణులు. ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ 'సి' ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తుంది. అలాగే వారిలో తలెత్తే మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. పెద్దవాళ్లలోనూ చలికాలంలో కీళ్లు పట్టేయడం వంటి సమస్యలొస్తాయి. వాటికి విరుగుడూ రేగు పండే. ఇందులో అధిక మొత్తంలో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము.. ఎముక బలాన్ని పెంచుతాయి.
చలికాలంలో ఎదురయ్యే అజీర్తి సమస్యలకు చింతపండును మించిన పరమౌషధం లేదంటున్నారు నిపుణులు. ఇందులో అధిక మొత్తంలో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి. తద్వారా ఎముక విరుపులకు చెక్ పెట్టచ్చు.. అలాగే భవిష్యత్తులో ఆస్టియోపొరోసిస్ రాకుండా జాగ్రత్తపడచ్చు.
- చలికాలంలో విరివిగా లభించే ఉసిరిని నేరుగానైనా తీసుకోవచ్చు.. లేదంటే ఉసిరి రసం, మురబ్బ, పచ్చళ్ల రూపంలో కూడా తినచ్చు. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఈ కాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. పుష్కలంగా ఉండే విటమిన్ 'సి' ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తుంది. అలాగే అజీర్తి కారణంగా తలెత్తే మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టచ్చు.
నువ్వుల్లో ఉండే అత్యవసర కొవ్వులు ఎముకలు, కీళ్లకు బలాన్నిస్తాయి. తద్వారా ఈ కాలంలో కీళ్ల నొప్పులు, ఎముక విరుపులకు చెక్ పెట్టచ్చు. దీన్ని బెల్లంతో కలిపి ఉండలు చేసుకొని తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం అందుతుంది. జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గించడానికి, శరీరంలో రక్తహీనతను నివారించడానికి ఇది సూపర్‌ఫుడ్ అని చెప్పచ్చు.