Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ చిత్రకళాశైలి తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఉద్భవించడం వల్ల ఈ కళకు 'తంజావూరు పెయింటింగ్' అనే పేరు వచ్చింది. ఈ చిత్రకళ 1600 ఏడి నుండి మొదలైందనీ, విజయనగర రాజుల అధీనంలో ఉన్న తంజావూరు నాయకుల ప్రోత్సాహంతో పేరు పొందిందనీ తెలుస్తుంది. ఈ పెయింటింగ్‌లలో అద్భుతంగా మెరిసే బంగారు రేకులు, విలువైన రాళ్ళను, రత్నాలను పొదుగుతారు. ఈ చిత్రకళలో విజయనగరం, డెక్కనీ, మరాఠా, యూరోపియన్ కళాశైలులు కనిపిస్తాయి. విజయనగర రాజుల పతనానంతరం కళాకారులు స్థానిక ప్రభావాలకులోనై ఈ ప్రత్యేకమైన శైలిని అభివృద్ధి చేశారు. మరాఠా రాజుల రాజ భవనాలు, ఛత్రాలు, ప్రధాన భవనాలను అలంకరించడంలో అనేక చిత్రకళల్ని ఉపయోగించాను. ఎక్కువగా చెక్కపలకలపై ఈ చిత్రాలను వేయడం ఆరంభించారు. సహజ రంగులతో రత్నాలు, బంగారు రేకులతో రాజుల సింహాసనాలు, గోడలు, స్తంభాలు, తోరణాలు తయారు చేసేవారు. భారతీయ చిత్రకళలో తంజావూరు చిత్రకళకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది.
నెమలిని చేద్దాం
మొదటగా మనం ఒక నెమలి బొమ్మను చేద్దాం. ఏ ఆర్ట్ అయినా ఏ చిత్రం అయినా నెమలి బొమ్మను చేయకుండా ఉండలేము. నెమలి అందాలను చిత్రించకుండా ఏ విధమైన కళ, కళాకారుడూ లేడు. ఇక బంగారు రేకలతోనూ, ఫాయిల్తోనూ తయారయ్యే తంజావూరు పెయింటింగ్‌లో నెమలి ఆకారాన్ని చిత్రించకుండా ఉంటారా? బంగారు ఆభరణాల తయారీలో కూడా నెమలి ప్రధమ స్థానాన్ని తీసుకుంటుంది. లాకెట్టయినా, కడియాలైనా, వడ్డాణమైనా నెమలి అందాలు లేకుండా ఉండవు. తంజావూరు చిత్రకళలో చెక్క పలకలనుగానీ, పెయింటింగ్ బేస్‌లు గానీ ఉపయోగించవచ్చు. ఒక బేస్‌ను తీసుకొని దాని మీద నెమలి చిత్రాన్ని వేసుకోవాలి. దీనికోసం పసుపురంగు కార్బన్ పేపర్‌ను ఉపయోగించాలి. చాక్‌పౌడర్ ఫెవికాల్ గీతల వెంట గీస్తూ వెళ్ళాలి. మొత్తం గీతలు గీసేశాక మధ్యలో రాళ్ళను పొదగాలి. నెమలి చిత్రం మధ్యలో ఉన్న డిజైన్ పూర్తయ్యాక బాగా ఆరబెట్టాలి. ఇది ఎండిపోయాక మాత్రమే గోల్డ్ ఫాయిల్‌తో అలంకరించాలి. ఈ గోల్డ్ ఫాయిల్ బాగా ఖరీదు ఉంటుంది. వేల రూపాయల ఖర్చు అవుతుంది. అయితే చిన్న చిన్న బొమ్మలు చేసుకోవచ్చు. నెమలి చిత్రమంతా గోల్డ్ ఫాయిల్‌ను అతికించాలి. పూర్తిగా అతికిన తర్వాత సన్నని కత్తితో అవసరం లేని భాగాన్ని కత్తిరిస్తే నెమలి చిత్రం అందంగా తయారవుతుంది.
వధువు బొమ్మ
ఒక అమ్మాయి బొమ్మను చేద్దాం. సాధారణంగా దేవతామూర్తులను తప్ప ఏవిధమైన బొమ్మల్నీ చెయ్యరు. కొనేవాళ్ళు కూడా ఇష్టపడరు. వెరైటీ కోసం మనం అమ్మాయి చిత్రాన్ని చేద్దాం. వివాహ సమయంలో వధువు బొమ్మను ఇలా తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ చిత్రానికి నాంది. కార్డుబోర్డు మీద ఒక వస్త్రాన్ని అతికించి దానిమీద ఈ చిత్రం వేశాను. అయితే దీనిలో అమ్మాయిని ఎక్కువగా బంగారంతో నింపకుండా చేశాను. కేవలం చుట్టూ ఉన్న డిజైన్‌ను మాత్రమే బంగారు రంగు రేకులతో నింపాను. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చేస్తాయి. లేదంటే పెద్ద ఊర్లలో క్రాఫ్ట్ షాపులలో దొరుకుతాయి. అమ్మాయి నగలకు మాత్రం గోల్డ్ ఫాయిల్ పెట్టవచ్చు. నేను నగలు కూడా ఎక్కువగా వెయ్యలేదు. సాదాసీదాగా చెయ్యాలనుకున్నాను. వధువుకు వివాహ సమయంలో బహుమతిగా ఇవ్వా లనుకున్నాను. తలనిండా పువ్వులను చిత్రించాను. చాక్‌పౌడర్ పిండితో పువ్వులు చేసి పెట్టాను. మీరూ ప్రయత్నించండి.
రాథాకృష్ణులు
ప్రేమకు ప్రతిరూపమైన రాథాకృష్ణుల్ని చిత్రిద్దాము. మద్రాసు ఎయిర్‌పోర్టులో చక్కని షాపు ఉన్నది. ఫ్లైటుకు సమయం మిగిలితే నేను ఈ షాపులో ఉన్న తంజావూరు చిత్రాల్ని చూస్తూ ఉంటాను. కళ్ళ ముందు అద్భుతం సాక్షాత్కరించినట్టుంది. వాటిని చూస్తుంటే మనసెంత ఆహ్లాదంగా ఉంటుంది. నేనొకసారి శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీకి వెళ్ళినపుడు ప్రతి బిల్డింగ్‌లో తంజావూరు చిత్రాలే దర్శనమిస్తాయి. తమిళనాడు రాష్ట్ర హాస్తకళల విభాగంలో తంజావూరు చిత్రకళ ప్రధాన పాత్రను పోషిస్తుంది. సింహాసనాలు, ఆభరణాలు, నగలు వంటివన్నీ బంగారు రేకులతో దిద్ది రాళ్ళు రత్నాలను పొదిగితే అందమైన చిత్రం తయారవుతుంది. వీటిని తయారు చేయాలంటే నెలల సమయం పడుతుంది. రాథాకృష్ణులను కూడా వివాహ సమయంలో బహుమతులుగా ఇవ్వవచ్చు. నాట్య భంగిమలలో ఉన్న రాథాకృష్ణులను చేసుకుంటే బాగుంటుంది. లేదంటే గోపికల మధ్యలో ఉన్న కృష్ణుడ్ని కూడా చేసుకోవచ్చు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్