Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల పెంపకమూ ఒక కళే... సంతోషకరమైన బాల్యం బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. క్రమశిక్షణ తోడైతే జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలబెడుతుంది. అయితే మాంటిస్సోరీ విధానాన్నీ ప్రయత్నంచేయమంటున్నారు నిపుణులు. పిల్లలను కొత్త విషయాలను అన్వేషిస్తూ నేర్చుకునేలా ప్రోత్సహించడమే ఈ పద్ధతి ప్రత్యేకత. ఇంతకీ ఇదేంటో తెలుసుకుందాం...
- పిల్లలన్నాక తప్పులు చేయడం సహజమే! నేర్చుకునేప్పుడు ఇంకా ఎక్కువగా దొర్లుతాయి. అంతమాత్రాన వాళ్లను శిక్షించొద్దు. తప్పులు చేయటానికి, తద్వారా నేర్చుకోవడానికి వారికి అవకాశమివ్వాలి. పిల్లలు ఎవరికి వారే ప్రత్యేకం. వాళ్ల ఎదుగుదలలో అవసరమైన సాయం అందించడమే మన బాధ్యత.
- 'పిల్లలు.. వాళ్లకి గౌరవమేంటి' అనుకోవద్దు. వాళ్లనీ గౌరవించాలి. ఉదాహరణకు వాళ్లకి సంబంధించిన కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటే కోప్పడొద్దు. చేయనివ్వండి. ఇక్కడ మనం అనుసరించాల్సిందల్లా ఇతరులకు ఇబ్బంది కలగనివ్వక పోతే చాలన్న సూత్రమే. కాబట్టి కనీసం చిన్న చిన్న అంశాల్లోనైనా ఆ సౌలభ్యాన్ని వాళ్లకి ఇవ్వండి.
- బాల్యంలో పిల్లల మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితులు, అనుభవాలు వారి వ్యక్తిత్వ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లలు నేర్చుకునేదేమో మనల్ని.. అంటే తల్లిదండ్రులను చూసే. కాబట్టి వాళ్ల ఎదుట మీ ప్రవర్తన ఎలా ఉందో గమనించుకుంటూ ఉండాలి.
- పిల్లలు తప్పుచేసినప్పుడు దండించేస్తాం. బదులుగా సమస్య పరిష్కార మార్గాలు అన్వేషించేలా ప్రోత్సహించండి. స్వేచ్ఛగా ఆలోచించినప్పుడే తప్పొప్పులు గ్రహించగలుగుతారు. గుడ్డిగా ఎవరినీ అనుసరించరు.
- పిల్లల మనసు మరీ సుకుమారం. పరిస్థితులకు వెంటనే ప్రతిస్పందిస్తారు. అలాంటి సమయాల్లోనే మనం వారికి స్థితప్రజ్ఞతను అలవరచుకునేలా చేయాలి. భావోద్వేగాలు నియంత్రించుకునే నైపుణ్యాలు పెంపొందించాలి. అందుకు అవసరమైన సానుకూల వాతావరణాన్ని మనమే కల్పించాలి.