Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బోలె రే పపి హర' అంటూ తన గానంతో ఉత్తర భారత దేశంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది' అంటూ రొమాంటిక్ పాటతో యువత మనసులో మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను తట్టిలేపిన వాణి జయరాం గొంతు మూగ పోయింది. అయినా తన పాటలతో శ్రోతల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయిన సుస్వర 'వాణి' పరిచయం నేటి మానవిలో...
వాణి జయరాం అసలు పేరు కలై వాణి. 30, నవంబరు 1945లో వెల్లూరులో జన్మించారు. ఈమె తల్లి తండ్రులు పద్మావతి, దురైస్వామి అయ్యంగార్. వీరికి ఆరుగురు ఆడపిల్లలు, ముగ్గురు కొడుకులు. వాణి జయరాం ఐదవ సంతానం. శాస్త్రీయ సంగీత విద్వాంసుల కుటుంబం వారిది. చిన్నప్పటి నుంచి వాణి రేడియోకి అతుక్కుపోయి హిందీ పాటలు ఎక్కువగా వింటూ ఉండేవారు.
సంగీతంలో శిక్షణ
కూతురి ఆసక్తిని గమనించి సంగీతంలో శిక్షణ ఇప్పించేందుకు రంగ రామానుజ అయ్యంగార్ వద్ద చేర్పించారు. అక్కడ ముత్తుస్వామి దీక్షితార్ కృతులు నేర్చుకున్నారు. తర్వాత ఆమె కడలూర్ శ్రీనివాస్ అయ్యంగార్, టి.ఆర్.బాలసుబ్రహ్మణ్యన్, ఆర్.యెస్ మణి గార్ల వద్ద మెరుగైన సంగీత శిక్షణ తీసుకున్నారు. ఒక వైపు సంగీతం నేర్చుకుంటూనే చదువు కొనసాగించారు. చెన్నైలోని క్వీన్ మేరీ కళాశాల నుండి పట్టభద్రురాలు అయ్యారు. చదువు పూర్తి అవ్వగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మద్రాస్‌లో ఉద్యోగం రావడంతో చేరిపోయారు.
ఉద్యోగం వదిలేసి
1969లో జయరాంతో వివాహం అయిన తర్వాత తన ఉద్యోగాన్ని ముంబయికి బదిలీ చేయించుకుని అక్కడ తన వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. వాణి గాన నైపుణ్యాన్ని తెలుసుకున్న జయరాం ఆమె అభిష్టాన్నీ గ్రహించి హిందూస్థాని సంగీతంలో శిక్షణ పొందేందుకు ఉస్తాద్ అబ్దుల్ రెహ్మాన్ దగ్గర చేర్పించారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూ బ్యాంక్ ఉద్యోగానికి స్వస్తి పలికారు. సంగీతాన్నే తన వృత్తిగా మలచుకున్నారు. ఖాన్ శిక్షణలో భజన, గజల్, తు మి రీ వంటి వివిధ స్వర రూపాలలో నైపుణ్యాన్ని సంపాదించారు. 1969లో తన మొదటి బహిరంగ కచేరి ఇచ్చారు. అదే సంవత్సరం వసంత దేశారుతో పరిచయం అయ్యింది. ఆమె స్వరానికి ముగ్ధుడైన దేశారు తన ఆల్బుమ్లో పాటకు ఆమెను ఎంచుకున్నారు. ఈ ఆల్బమ్ మరాఠీ ప్రేక్షకులలో ఎంతో ప్రజాదరణ పొందింది.
జాతీయ పురస్కారం
బాలీవుడ్లో ఆమెకు ప్రజాదరణ రోజు రోజుకు పెరగసాగింది. దక్షిణ భారత దేశం నుండి అవకాశాలు రాసాగాయి. 1973లో మొదటిసారి తమిళ పాటను రికార్డ్ చేశారు. అయితే ఆ చిత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు. ఆమె పాడిన పాటలలో మొదట విడుదల అయినది 1973లోనే టి.ఎం.సౌందర్ రాజన్‌తో కలిసి పాడిన యుగళ గీతం ''ఓరు ఇదం ఉన్ని దం''. ఇది విడుదలైన అతి తక్కువ కాలంలోనే బాలచందర్, కె. విశ్వనాథన్ తమ చిత్రంలో సోలో పాటకు ఆమెను నియమించుకున్నారు. 'అపూర్వ రాగాంగల్' చిత్రంలో ఆమె అందించిన పాటలకు ఉత్తమ నేపధ్య గాయనిగా మొదటి జాతీయ చలన చిత్ర అవార్డును అందుకున్నారు. అప్పటి నుండి ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. పురస్కారాలు వెల్లువలా వచ్చి పడసాగాయి. తమిళనాడు రాష్ట్రం ఉత్తమ మహిళా నేపధ్య గాయనిగా గుర్తించి పురస్కారాన్ని అందించింది.
తెలుగులో అవకాశాలు
ఇక తెలుగులో కూడా ఆమెకు అవకాశాలు రాసాగాయి. తెలుగులో తొలిసారిగా 'అభిమానవంతులు' చిత్రం కోసం పాడారు. 1975లో వచ్చిన 'పూజ' చిత్రంలోని పాటలు ఆమెను తెలుగు చిత్ర సీమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచాయి. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం చిత్రంలో ఐదు పాటలు పాడి విశేష ప్రజాదరణ పొంది రెండవ జాతీయ చలన చిత్ర పుర స్కారాన్ని అందుకున్నారు. ఆ చిత్రంలోని పాటలకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ నేపధ్య గాయనిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
కవిత్వం కూడా రాశారు
మలయాళ, కన్నడ భాషాలలోనే కాక దాదాపు 16 భాషలలో పాటలు పాడి ప్రజాదరణ పొందారు. ఇన్ని పాటలు పాడిన వాణి జయరాం సంగీత ప్రపంచంలో ఎన్నో ఓడిదుకులను ఎదుర్కొన్నారు. కొన్ని సమస్యల వల్ల అనుకున్న సమయంలో పాటలన్ని ఆగిపోయాయి. అయిన ఆమె నిరాశ పడలేదు. ఆమెకు కవితలు రాయడం అంటే ఏంతో ఇష్టం. హిందీ భాషలో అనేక కవితలు రాసారు. రోజుకు 48 గంటలు ఉన్నా తనకు సరిపోవని అప్పుడప్పుడు ఆమె అంటుండేవారు. అంత బిజీగా గడిపేవారు.
పద్మభూషణ్ తీసుకోకుండానే...
ఈ సంవత్సరం 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వాణి జయరాంకు కేంద్ర ప్రభుత్వం కిందటి నెలలో పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారాన్ని స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆ పురస్కారాన్ని స్వీకరించ కుండానే ఆవిడ మరణించడం ఎంతో బాధాకరం. భర్త జయరాం ఐదు సంవత్సరా కిందట కన్నుమూశారు. ప్రజల మనసుల్లో తన గానంతో చెరగని ముద్ర వేసిన వాణి జయరాం మన మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.
- పాలపర్తి సంధ్యారాణి