Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గమనించాలే కానీ చాలా రకాల ఔషధాలు మన పెరట్లోనే ఉంటాయి. అందులో మేలైనది కలబంద. దీంట్లో ఇతర పదార్థాలు కలిపితే తేలికగా బరువెలా తగ్గొచ్చో నిపుణుల సూచనలు తెలుసుకుందామా!
రెండు చెంచాల కలబందని ఒక గ్లాసు నీళ్లలో, మూడుచెంచాల నిమ్మరసంతో కలిపి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. ఇది తాగాక గంట వరకూ ఇంకేమీ తీసుకోకూడదు. అలా చేస్తే శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రిక్ ఇబ్బందులు ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే సమస్య అదుపులోకి వస్తుంది.
కలబంద గుజ్జుని అల్లంతో కలిపి రోజూ ఒక గ్లాసు మధ్యాహ్న సమయంలో తీసుకోవాలి. అల్లంలోని యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఒత్తిడిని అదుపుచేస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి శరీరంలో తేమ నిల్వ ఉండేలా చేస్తాయి. ఈ గుణాలన్నీ కలబందతో కలిసినప్పుడు శరీరంలోని కొవ్వు తేలికగా కరిగిపోతుంది. కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలూ దరిచేరవు.
స్ట్రాబెర్రీలు శరీరంలోని మలినాలను తొలగిస్తాయి. వీటిని కలబంద, కమలా రసంతో కలిపి తాగితే...ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. ఈ రెండింటిలోనూ తక్కువ కెలొరీలు ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారూ తీసుకోవచ్చు.
అయితే గర్భిణులు, చర్మ వ్యాధులున్నవారు, పాలిచ్చే తల్లులు... కలబంద తీసుకోకపోవడమే మంచిది. సాధారణ వ్యక్తులు కూడా ఈ రసం తీసుకోవటం వల్ల ఏమైనా సమస్యలొస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి. రోజూ ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల కలబంద రసాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.