Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ రంగంలోనైనా రాణిస్తున్న వారిని చూసినప్పుడు స్ఫూర్తి పొందడం సహజం. 'నేనూ అలా సాధించాలి' అనీ అనుకుంటుంటాం. మీరూ ఆ జాబితాలోని వారేనా? అయితే ఈ లక్షణాలను పెంపొందించుకోండి.. తిరుగులేని నాయకురాలవుతారు అంటున్నారు నిపుణులు.
సాధారణంగా మహిళలకు ఎదుటివారిని కదిపి, మాట్లాడే స్వభావం ఎక్కువ. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలరు. అయితే ఆఫీసు విషయానికి వచ్చేసరికే నోరు కట్టేసుకుంటారు. 'ఎందుకులే, ఏమనుకుంటారో' అని ఆగిపోతుంటారు. ఆ తీరే సరి కాదు. ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే మీ నైపుణ్యాలు, సామర్థ్యాలను ఇతరులు గుర్తించగలుగుతారు.
నాయకులవ్వాలంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి. నూతన పద్ధతుల గురించి తెలుసుకోవాలి, అనుసరించాలి. లాభ, నష్టాలను బేరీజు వేయడమే కాదు.. వాటి గురించి ఇతరులతోనూ చర్చించాలి. తీసుకునే ప్రతి నిర్ణయం సంస్థ లక్ష్యాలు, తోటివారి సమర్థత ఆధారంగా సాగేలా చూసుకోవాలి.
నాయకులుగా మారాలంటే తోటివారితో సత్సంబంధాలు, బలమైన స్నేహితులుండాలి. నెట్వర్క్ పరిధినీ పెంచుకోవాలి. ఆఫీసన్నాక రాజకీయాలూ సాధారణమే. వాటిని తట్టుకోవడంలోనూ వీరు అండగా ఉంటారు. అలా కాకుండా 'నేను, నా' అనుకుంటూ సాగినా, స్వీయలాభం కోసమే చూసినా ముందుకు సాగలేరు. 'మన' అనుకొని బాధ్యత తీసుకోవాలి. కష్టానికి ముందుండాలి అప్పుడే 'లీడర్' అవ్వగలరు. తోటి మహిళలతో సానుకూల వాతావరణం ఏర్పరచుకోండి. వాళ్లకు తోడ్పాటునిస్తే.. ఇంకా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. మంచి నాయకురాలవ్వాలంటే ఈ మూడు నైపుణ్యాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. అవసరమైతే నేర్చుకోండి. వీటితోపాటు నిర్ణయాలపై గట్టిగా నిలబడటం, రిస్క్ తీసుకోవడం కూడా అవసరం.