Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలిగాలి ప్రభావంతో చర్మం పొడారి, మృదుత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సహజసిద్ధమైన మాయిశ్చరైజర్లతో చర్మసౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు.
ఒక కప్పులో చాక్లెట్ బార్ నుంచి తీసిన నాలుగు ముక్కలను కరిగించి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి పావుగంట ఆరనివ్వాలి. చివరగా తడిపిన చేతులతో ముఖంపై మృదువుగా ఐదునిమిషాలు మర్దనా చేసి కడగాలి. చాక్లెట్‌లోని కెఫీన్ చర్మకాంతిని రెట్టింపు చేస్తే, దీన్లోని కొవ్వులు సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేసి మృదుత్వాన్ని అందిస్తాయి. తేనె చర్మాన్ని తేమగా ఉంచి, పొడారకుండా సంరక్షిస్తుంది.
- రెండు చెంచాల మయనీజ్కు చెంచా బేబీ ఆయిల్‌ను కలిపి ముఖం, మెడ, చేతులకు రాయాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగితే చర్మం మెరుపులీనుతుంది.
- రెండేసి చెంచాల చొప్పున కలబంద గుజ్జు, బాదంనూనె, తేనె తీసుకొని మిశ్రమంగా చేసి ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. దీంతో చర్మం మృదువవుతుంది.
- కప్పు బొప్పాయి ముక్కలకు అరకప్పు నీటిని కలిపి మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమంలో ముంచిన దూది ఉండతో ముఖమంతా అద్ది, పావుగంట తర్వాత కడగాలి. పోషకాలు మెండుగా ఉండే బొప్పాయి చర్మానికి తేమను అందించి మెరుపులీనేలా మారుస్తుంది.
- ఒక అరటిపండును గుజ్జులా చేసి, దీనికి మూడు చెంచాల తాజా మీగడను కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత మృదువైన వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాత నీటితో కడిగితే చర్మం మాయిశ్చరైజ్ అవుతుంది. - పోషకాలు అంది ముఖచర్మం మృదువుగా మారుతుంది.
- సమపాళ్లలో కొబ్బరినూనె, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి అరగంట తర్వాత కడిగితే సరి. యాంటీమైక్రోబియల్ గుణాలుండే కొబ్బరినూనె చర్మరంధ్రాల్లోని సూక్ష్మజీవులను దూరంచేసి, పొడారకుండా చేస్తుంది.