Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనవసర ఖర్చులను తగ్గించుకోలేకపోతే నెలాఖరుకి మన చేతిలో పైసా ఉండదు. ఆదాయం సరిపోయేలా జాగ్రత్తపడటంకన్నా, ఆర్థికపరమైన ఖర్చుల్లో చేసే పొరపాట్లే అప్పులబారిన పడేలా చేస్తాయంటున్నారు నిపుణులు. ఇలాకాకుండా ఉండాలంటే పాటించాల్సిన కొన్ని సూచనలు, సలహాలను చెప్తున్నారు. అవేంటో చూద్దాం...
- ఆదాయాన్ని అవసరాలకు తగ్గట్టు వినియోగించడంలో సరైన ఆర్థిక ప్రణాళికను పాటించాలి. జీతంకన్నా ఎక్కువ ఉండే వ్యయాన్ని నియంత్రించుకోగలగాలి. ఏయే చోట్ల ఎక్కువ ఖర్చు అవుతుందో గుర్తించి, వాటి అవసరమెంతుందో ఆలోచించి ఆచితూచి అడుగులేయాలి. ముందుగానే కుటుంబం, పిల్లల ఖర్చులు, వ్యక్తిగతం అంటూ ఒక బడ్జెట్ వేసుకోవాలి. వీటితోపాటు పండుగలు, ప్రత్యేకదినాలు, అనారోగ్యాలు సహా అత్యవసర ఖర్చులు, భవిష్యత్తు అవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత కావాల్సిన ఫండ్‌నూ ఇప్పటి నుంచే పొదుపు చేయాలి. వీటన్నింటినీ సమన్వయం చేయడానికి ప్రస్తుతం చాలారకాల ఆన్లైన్ ఫోరమ్స్ చేయూతగా నిలుస్తున్నాయి.
- రెండుమూడు నెలలు ఖర్చుపెట్టే ప్రతిపైసాను ఒక పుస్తకంలో రాయాలి. అలాగే ఫోన్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కూడా ఈ వివరాలను పొందుపరిస్తే, నెలంతా దేనికి ఎంత ఖర్చుపెట్టామో తెలుస్తుంది. రెండు నెలల తర్వాత అవసరం, అనవసరం అని రెండుగా వీటిని విడదీస్తే, ఎక్కడ నగదు వృథా అవుతోందో గుర్తించొచ్చు. రవాణా, బయటి ఆహారం, ఎంటర్టైన్మెంట్, మితిమీరిన షాపింగ్ వంటి ఖర్చులు తెలుస్తాయి. అవసరం కాని వాటిని నియంత్రించి, మరో ముఖ్యమైన పొదుపు కోసం కేటాయిస్తే మంచిది.
క్రెడిట్ కార్డుపై అందించే రుణాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలులో తప్పనిసరై క్రెడిట్‌కార్డ్‌ను వినియోగించినా, వీలైనంత తక్కువకాలంలో చెల్లించాలనే లక్ష్యం పెట్టుకొని ప్రయత్నించాలి. అలాగే ఒకేసారి రెండు మూడు రుణాలు తీసుకోవద్దు. అప్పుడు భారమనిపించదు. తిరిగి కట్టడం తేలిక అవుతుంది. తక్కువ సమయంలోనూ చెల్లించేయొచ్చు. వడ్డీ, చెల్లించే కాలం వంటివాటిలో ఏది అనువైనదో సలహా లేదా ప్రణాళిక అవసరమైనప్పుడు ఫైనాన్షియల్ ప్లానర్ లేదా క్రెడిట్ కౌన్సెలర్‌ను అడిగి తెలుసుకొంటే మంచిది.