Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొక్కజొన్నల్లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉంటాయని అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది మొక్కజొన్నలను రకరకాలుగా తింటుంటారు. కొందరు గారెలు ఇష్టపడితే, కొందరు ఉడకబెట్టుకుని తింటారు. ఇంకొందరు మొక్కజొన్న పిండి చేసుకుని రొట్టెల రూపంలో కూడా తింటారు. అయితే మొక్కజొన్నల్లో మనకు అందుబాటులో ఉండే స్వీట్ కార్న్ వెరైటీతో కార్న్ సమోసాలు, సూప్, రైస్, పాయసం వంటివి కూడా చేసుకోవచ్చు. ఇవి మనకు రుచికి రుచిని, పోషకాలకు పోషకాలను అందిస్తాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరింకెందుకాలస్యం.. వాటిని ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం... మనమూ ఓ సారి ప్రయత్నిద్దాం...
సమోసా
కావల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ - కప్పు, ఉల్లిగడ్డ ముక్కలు - 1/4 కప్పు, ఉడికించి మెత్తగా చేసిన ఆలుగడ్డలు -1/4 కప్పు, పచ్చిమిర్చి (తరిగినవి) - టీస్పూను, ఉప్పు - 1/4 టీస్పూను, కారం - 1/4 టీస్పూను, కరివేపాకు, కొత్తిమీర - తగినంత, ఆమ్చూర్ పౌడర్ -1/4 టీస్పూను, సమోసా స్ట్రిప్స్ - తగినన్ని.
తయారు చేసే విధానం: పాన్ తీసుకుని అందులో నూనె వేసి.. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు వేసి తర్వాత ఉడికించిన ఆలుగడ్డల మిశ్రమం, స్వీట్ కార్న్ కూడా వేయాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, ఆమ్చూర్ పౌడర్, కొత్తిమీర వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. సమోసా స్ట్రిప్ తీసుకుని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని నింపి జాగ్రత్తగా సీల్ చేయాలి. తర్వాత ఆ సమోసాలను నూనెలో వేసి వేయించాలి. అంతే.. వేడి వేడిగా ఉండే కార్న్ సమోసా రెడీ అయిపోతుంది.
రైస్
కావల్సిన పదార్థాలు: బాస్మతి రైస్ - పావుకేజీ (అరగంట నీటిలో నానబెట్టుకోవాలి), కార్న్ - రెండు కప్పులు, ఉల్లిగడ్డ ముక్కలకు - ఒకప్పు, క్యాప్సికమ్ - కప్పు, అల్లం : పావు టీస్పూను, వెల్లుల్లిపేస్ట్ - పావు టీస్పూను, ఆలూ ముక్కలు - కప్పు, పచ్చిమిర్చి - నాలుగైదు, గరం మసాలా - టీస్పూను, పసుపు - పావు టీస్పూను, జీలకర్ర - పావు టీస్పూను, నూనె - సరిపడా.
తయారు చేసే విధానం: ఉల్లిగడ్డను సన్నగా తరిగి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన బియ్యం, ఆలూ, స్వీట్ కార్న్ వేయాలి. అందులోనే కొద్దిగా నూనె, సరిపడా నీళ్ళు పోసి మిక్స్ చేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి వేడి అయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అంతలోపు కుక్కర్లో స్వీట్ కార్న్ రైస్ రెడీ అవుతుంది. స్టౌ ఆఫ్ చేసి కుక్కర్లోని ఆవిరి మొత్తం తగ్గనివ్వాలి. కుక్కర్లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత స్వీట్ కార్న్ రైస్‌ను బయటకు తీసి పాన్‌లో వేగుతున్న మిశ్రమంలో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే స్పెషల్ స్వీట్ కార్న్ రైస్ రిసిపి రెడీ.
సూప్
కావల్సిన పదార్థాలు: మొక్కజొన్న - అర కప్పు, తురిమిన వెల్లుల్లి - టీస్పూను, తురిమిన క్యారెట్ - పావు కప్పు, వెనిగర్ - టీస్పూను, వెన్న - రెండు టీస్పూన్లు, తురిమిన అల్లం - టీస్పూను, తరిగిన ఉల్లిగడ్డ - ఐదు టీస్పూన్లు, మొక్కజొన్న పిండి - టీస్పూను, నల్ల మిరియాలు - పావు టీస్పూను, ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం: బాణలిలో వెన్న వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చి ఉల్లిగడ్డ వేసి రెండు నిమిషాలు వేయించాలి. చివరగా మొక్కజొన్న, క్యారెట్ కలపాలి. కొద్దిగా ఉప్పు వేసి కూరగాయలను మూడునాలుగు నిమిషాలు వేయించాలి. పావు కప్పు మొక్కజొన్నలో రెండు టేబుల్ స్పూన్ల నీటిని పోసి గ్రైండర్లో పేస్ట్‌గా చేయాలి. ఈ పేస్ట్‌ను పాన్‌లో వేసి మూడు నాలుగు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. 10-12 నిమిషాలు అంటే అందులోని నీరు ఒక కప్పుకు తగ్గే వరకు మరిగించాలి. ఇప్పుడు టేబుల్‌స్పూన్ కార్న్‌ఫ్లోర్‌ను రెండు టేబుల్స్పూన్ల నీటితో కలిపి మిశ్రమం తయారుచేయాలి. ఈ ద్రావణాన్ని సూప్‌లో వేసి బాగా కలపాలి. సూప్ చిక్కబడే వరకు ఉడికించాలి. చివరగా వెనిగర్, ఎండుమిర్చి పొడి, మిగిలిన పచ్చిమిర్చి వేసి రుచికి తగినట్టుగా ఉప్పు వేయాలి. అంతే సూప్ రెడీ.
పాయసం
కావల్సిన పదార్థాలు: మరీ లేతగా అలాగని ముదురుగా లేని మొక్కజొన్న గింజలు - కప్పు, బియ్యప్పిండి - టేబుల్ స్పూను, కాచి చల్లార్చిన పాలు - కప్పు, నీళ్లు - అర కప్పు, బెల్లం తురుము - కప్పు, నెయ్యి - రెండు చెంచాలు, యాలకుల పొడి - చెంచా, అరటిపండు - ఒకటి పెద్దది.
తయారు చేసే విధానం: ఓ గిన్నెలో మొక్కజొన్న గింజలు, నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి ఉడికేలోగా పాలల్లో బియ్యప్పిండి కలిపి పెట్టుకోవాలి. మొక్కజొన్న గింజలు ఉడికిన తర్వాత అందులో బియ్యప్పిండి మిశ్రమాన్ని వేయాలి. మూడు నాలుగు నిమిషాలకు బియ్యప్పిండి ఉడికి, పాయసం చిక్కగా అవుతుంది. అప్పుడు బెల్లం తురుము వేయాలి. బెల్లం కరిగి, చిక్కగా అవుతున్నప్పుడు యాలకులపొడి వేయాలి. ఇది పాయసంలా తయారయ్యాక చక్రాల్లా తరిగిన అరటిపండు ముక్కలు వేసి రెండు నిమిషాలయ్యాక పొయ్యి కట్టేయాలి. చివరకు నెయ్యి వేసే చాలు.