Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సక్సెస్... ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. అలా అని అంత సులభంగా ఎవరి వద్దకూ వచ్చి చేరదు. విజయం సాధించడాలంటే కష్టపడాల్సిందే. శ్రమనే నమ్ముకుని అంచలంచలుగా ఎదిగిన మహిళలెందరో మన కండ్ల ముందు ఉన్నారు. వారిలో లత నడుకుడ ఒకరు. ఏడవ తరగతి మాత్రమే చదువుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. నాలుగు గార్మెంట్స్ షోరూమ్స్ నడిపిస్తుందంటే దాని వెనక ఎంతటి శ్రమ దాగివుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సక్సెస్ వెనక ఉన్న సీక్రెట్ ఏమిటో, ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, యూసఫ్‌నగర్ గ్రామంలో సాదాసీదా కుటుంబంలో పుట్టింది లత. అది చిన్న పల్లెటూరు కావడంతో ఏడవ తరగతి వరకే చదువుకుంది. ఆ తర్వాత చదువుకోవాలంటే చాలా దూరం బస్సులో ప్రయాణం చేయాలి. అందుకే తండ్రి వద్దని చదువు అక్కడితో ఆపేశాడు. ఖాళీగా ఉండటంతో 2001లో టైలరింగ్‌కి వెళ్లడం మొదలుపెట్టింది. రెండేండ్లు కష్టపడి నేర్చుకుంది. టైలరింగ్‌కి ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే తన దగ్గర ఉన్న అరతులం కమ్మలు వాళ్లకి ఫీజు కింద ఉంచుకోమని చెప్పింది.
కష్టపడితేనే ఫలితం
2003 నుండి ఇంట్లోనే బ్లౌజులు, డ్రెస్సులు కుట్టడం మొదలుపెట్టింది. తాను కుట్టడమే కాకుండా మరికొందరికి టైలరింగ్ నేర్పించి వాళ్ళు ఇచ్చిన ఫీజుతో కమ్మలు విడిపించుకుంది. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు ఒక్కసారి వెను తిరిగి చూసుకుంటే ఇదంతా సాధించిన తనేనా అన్న ఫీలింగ్ వస్తుందట. ఏది ఏమైనా కష్టపడితేనే ఫలితం అన్నదానికి మన లత ఓ మంచి ఉదాహరణ.
భర్త ఉద్యోగం పోయింది
2005లో లతకి పెండ్లి అయింది. భర్త దేవేందర్‌తో కలిసి నిజామాబాద్‌కి వచ్చేసింది. అక్కడ రెండేండ్లు ఖాళీగా ఉంది. భర్త హోంగార్డుగా పని చేసేవారు. కొన్ని కారణాలవల్ల భర్త ఉద్యోగం పోవడంతో కాస్త దిగులు పడింది. ఎంత ప్రయత్నించినా భర్తకు మరో ఉద్యోగం దొరకలేదు. లత నిరుత్సాహ పడకుండా ధైర్యం తెచ్చుకుంది. కాలానికి ఎదురీది పోరాడింది. భర్త తెచ్చే ఆ మూడువేల రూపాయల జీతం కూడా పోవడంతో ఒక కొత్త ఆలోచన చేసింది.
అప్పు చేసి... కుట్టుమిషన్ కొని
తనకు వచ్చిన విద్య టైలరింగ్ కాబట్టి అదే మళ్ళీ మొదలుపెట్టాలనుకుంది. తన ఆలోచనను భర్తకి చెప్పింది, ఇద్దరు ఆలోచించుకున్నారు. తనకు తెలిసిన ఒక బట్టల షాపు ఓనర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతను పని ఇచ్చి ఇంట్లోనే కుట్టమనేవాడు. ఎలాగో అప్పు చేసి కుట్టు మిషన్ కొన్నారు. నెలకు ఏడు వేలు సంపాదించేది. పాప పుట్టింది, ఖర్చులు పెరిగాయి, అవసరాలూ పెరిగాయి. దాంతో దేవేందర్ తనకు తెలిసిన స్కూల్స్‌కి వెళ్లి ఆర్డర్స్ తెచ్చేవాడు. ముందుగా స్కూల్ బెల్టులు, టైలు, ఐడి కార్డులు ఆర్డర్ తెచ్చేవాడు. అలా మొదలైన ఆర్డర్స్ దినదినాభివృద్ధి చెందాయి. రాను రాను టైలరింగ్ బాగా డెవలప్ అయ్యింది. స్కూల్ యూనిఫామ్ ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి.
ఉచిత టైలరింగ్ శిక్షణ
లత బిజీ అయిపోయింది. అంతేకాదు పదిమందికి నేర్పించడం, పని ఇచ్చి కుట్టమనడం మొదలుపెట్టింది. ఉచిత శిక్షణ, ఉపాధి కల్పన పేరిట ఎంతో మందికి టైలరింగ్ ఉచితంగా నేర్పించింది. కుట్టు మిషిన్ కొనుక్కోవడానికి కూడా డబ్బు లేని వారికి తానే సాయం చేసి సంపాదన వచ్చిన తర్వాత తన అప్పు తీర్చమని చెప్పేది. లత చేసే ప్రతి పనికీ భర్త దేవేందర్ అండగా ఉండి ఫుల్ సపోర్ట్ చేసేవాడు. చిన్నగా మొదలైన ఆమె ఉచిత ట్రైనింగ్ పథకం రాను రాను అభివృద్ధి చెంది 50 మంది నుండి వంద మంది వరకు కుట్టు పని నేర్చుకున్నారు. భర్త అన్ని స్కూల్స్ తిరుగుతూ ఆర్డర్స్ తెస్తూ ఉంటే లత మాస్టర్స్‌ని పెట్టుకొని టైలరింగ్ని అభివృద్ధి చేసింది.
కరోనా మొదలవడంతో...
ఉచితంగా ఆడవారికి శిక్షణ ఇవ్వడం, ఇంటింటికీ ఒక కుట్టు మిషన్ ఇవ్వడంతో వర్కర్స్ పెరిగారు. దాంతో డ్వాక్రా మహిళా గ్రూపులో చేరి లోను తీసుకొని మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసి బిజినెస్ డెవలప్ చేశారు ఆ భార్యాభర్తలు. పగలు రేయి కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకున్నారు. ఇంతలో కరోనా మొదలైంది. మాస్కులు అవసరం పడ్డాయి అందరికీ. అనుకోని విధంగా ఆ జిల్లా కలెక్టర్ , మునిసిపాలిటీ కమిషనర్ వల్ల గవర్నమెంట్ ఆర్డర్ లత చేతికి వచ్చింది. 15 రోజులలో లక్ష మాస్కులు కుట్టి ఇవ్వమని ప్రాజెక్టు డైరెక్టర్ జరుపుల రాములు ఆర్డర్ ఇచ్చారు. ఇది లత జీవితంలో అనుకోని మార్పు.
బంగారం మొత్తం తాకట్టు పెట్టి
పెద్ద ఆర్డర్... కాకపోతే పెట్టుబడి 12 లక్షలు పెట్టాలి. దాంతో తన బంగారాన్నీ, అత్తగారి బంగారాన్నీ, తల్లి బంగారాన్నీ మొత్తం తెచ్చి పెట్టుబడి పెట్టి మూడు రోజుల్లో ఆ మొత్తాన్ని సంపాదించుకొని ఆ ఆర్డర్‌ని ఎలాగో కష్టపడి దక్కించుకున్నారు. 15 రోజుల్లో లక్ష మాస్కులు పూర్తి చేసి ఇచ్చారు. మూడు లక్షలు లాభం వచ్చింది. అంత మొత్తం కండ్ల చూడడం అదే మొదటిసారి. అందులో ఒక లక్ష మాత్రమే వాళ్ళు ఉంచుకొని మిగతా రెండు లక్షలతో పేద వర్కర్లకు పప్పులు, బియ్యం, నూనె లాంటి రేషన్ ఇచ్చారు. ఆమె సేవాగుణం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభుత్వం దృష్టిలో ఒక గొప్ప వ్యక్తి అయిపోయింది లత.
WE HUB సహకారంతో
అప్పటి నుండి అన్నీ పెద్ద ఆర్డర్సే వచ్చేవి. 2020లో పీపీ కిట్స్ కుట్టమని ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్. అదే సమయంలో WE HUB సహకారంతో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యింది. అకౌంటింగ్, మార్కెటింగ్, టాక్స్‌లు ఇలా మొత్తం వ్యాపారానికి సంబంధించిన కిటుకులు అన్నీ నేర్పించారు అక్కడ. ఇది తన వ్యాపారంలో మరింత అభివృద్ధికి దోహదపడింది. కరోనా సమయంలో గ్రామంలో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్న ఆశా వర్కర్క్కు బ్లౌజులు కుట్టే ఆర్డర్ మళ్లీ లతకే వచ్చింది. 20వేల బ్లౌజెస్ ఒక నెలలో పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చారు. కొన్ని లత కట్ చేసేది మరికొన్ని వర్కర్స్‌తో చేయించేది. ఆ సమయంలోనే ఓ న్యూస్ ఛానల్ వాళ్ళు లత ఇంటర్వ్యూ తీసుకోవడం, ఓ ఇంగ్లీష్ పత్రికలో లత గురించి ఆర్టికల్ రావడంతో అందరి దృష్టిలో పడింది.
ప్రభుత్వ సహకారంతో...
జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లు లతకే ఇస్తామని గవర్నమెంట్ సహకారం అందించింది. దాంతో మూడు లక్షల యూనిఫామ్స్కి ఆర్డర్ వచ్చింది. నాలుగు నెలల ప్రాజెక్టు అది. వెంటనే వర్క్ మొదలు పెట్టింది లత. 2000 మంది వర్కర్స్‌తో నాలుగు బ్రాంచ్‌లు ఓపెన్ చేసింది. 'శ్రీలత లేడీస్ టైలర్ అండ్ గార్మెంట్స్' పేరుతో అంచలంచలుగా ఎదిగిన లత స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శం.
ట్రస్టును ప్రారంభించి
లత పట్టుదల చూసిన కేఎంసి అనే సంస్థ పది లక్షల రూపాయల విలువ గల మెటీరియల్ అప్పుగా ఇచ్చారు. ఒకప్పుడు తినడానికి తిండి లేక కష్టపడ్డ లతా, దేవేందర్‌లు ఇప్పుడు ఎందరికో ఉపాధి కల్పిస్తున్నారు. పేదలకు సహాయం చేయడం ఈ దంపతుల మరో ప్రత్యేకత. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటని ప్రశ్నిస్తే 'జ్ఞానోదయం' అనే ట్రస్టును స్థాపించి రోడ్డుపై అడుక్కునే ప్రతి ఒక్కరికి మంచి బట్టలు కుట్టించి ఇవ్వాలని ఒక ఆలోచన, అంతేకాదు ఒక గవర్నమెంట్ స్కూలుని అడాప్ట్ చేసుకొని వారిని చదివించి మంచి ప్రయోజకులను చేయాలని వారి ఆశయం. ఇప్పుడు వారి టౌన్ లెవల్లో ఫెడరేషన్ అధ్యక్షురాలు లత. ఇంతకంటే విజయం ఏముంటుందండి. తాజాగా కంటి వెలుగులో కూడా లత వర్క్ చేస్తుంది. లత జీవితం ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిదాయకం. భవిష్యత్‌లో ఆమె మరెన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుందాం.
- ముచ్చర్ల రజినీ శకుంతల,
9246207774